బడ్జెట్‌పై అంచనాలు, క్యూ3 ఫలితాలు కీలకం

Expectations on budget, Q3 results keyrole: market experts - Sakshi

ప్రపంచ పరిణామాలు.. ఎఫ్‌ఐఐల పెట్టుబడులపైనా దృష్టి

రిపబ్లిక్‌ డే సందర్భంగా గురువారం సెలవు

ఈ వారం మార్కెట్‌ గమనంపై నిపుణుల అంచనా

ముంబై: ట్రేడింగ్‌ నాలుగురోజులే ఈ వారంలో బడ్జెట్‌పై అంచనాలు, కార్పొరేట్‌ క్యూ3 ఫలితాలు, ప్రపంచ పరిణామాలు దేశీయ స్టాక్‌ సూచీలకు దిశానిర్ధేశం చేస్తాయని మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. నెలవారీ డెరివేటివ్స్‌ ఎక్స్‌పైరీ(బుధవారం) నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తతో ఒడిదుడుకుల ట్రేడింగ్‌కు అవకాశం ఉండొచ్చంటున్నారు. వీటితో పాటు దేశీయ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలర్‌ మారకంలో రూపాయి విలువ, క్రూడాయిల్‌ ధరలపై మార్కెట్‌ వర్గాలు దృష్టి సారించవచ్చంటున్నారు.

‘‘అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ ప్రతికూల ప్రభావం దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. క్యూ3 ఆర్థిక ఫలితాల సీజన్‌ కొనసాగుతున్నందున స్టాక్, రంగాల ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. కొంత కాలం నిఫ్టీ 17,800–18,250 పరిధిలోనే ట్రేడవుతోంది. ఈ వారంలోనూ అదే శ్రేణిలో కదలాడొచ్చు. బడ్జెట్‌ వెల్లడి తర్వాత తదుపరి మూమెంటమ్‌ చూడొచ్చు’’ అని స్వస్తిక ఇన్వెస్ట్‌మార్ట్‌ లిమిటెడ్‌ రీసెర్చ్‌ హెడ్‌ సంతోష్‌ మీనా తెలిపారు.

  తీవ్ర ఒడిదుడులకులకు లోనవుతూ.., పరిమిత శ్రేణిలో కదలాడిన సూచీలు గతవారం స్వల్ప లాభాలను ఆర్జించగలిగాయి. సెన్సెక్స్‌ 361 పాయింట్లు, నిఫ్టీ 71  పాయింట్లు చొప్పున లాభపడ్డాయి. ఐటీ, మెటల్, క్యాపిటల్‌ గూడ్స్, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, విద్యుత్‌ స్టాకులకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఎఫ్‌ఎంసీజీ, ఆటో, ఫార్మా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.  

ఎఫ్‌ఐఐల బేరీష్‌ వైఖరి
ఈ కొత్త ఏడాదిలో దేశీయ మార్కెట్‌ పట్ల విదేశీ ఇన్వెస్టర్లు బేరీష్‌ వైఖరిని ప్రదర్శిస్తున్నారు. ఈ జనవరి 20 నాటికి రూ.15,236 కోట్ల షేర్లను అమ్మేశారు. చైనా లాక్‌డౌన్‌ ఎత్తివేతతో ఎఫ్‌ఐఐల అక్కడి మార్కెట్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీనికి తోడు అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం దిశగా అడుగులేస్తుంనే భయాలు ఇందుకు కారణమయ్యాయి.

ఫైనాన్స్, ఐటీ, టెలికాం షేర్లను భారీగా విక్రయిస్తున్నారు. కేవలం మెటల్, మైనింగ్‌ షేర్లను కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే సమయంలో(జనవరి 21 నాటికి) సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.16,000 వేల షేర్లను కొనుగోలు చేసి మద్దతుగా నిలుస్తున్నారు. ‘‘బడ్జెట్‌పై ఆశలు నెలకొన్నప్పటికీ.., బలహీన స్థూల ఆర్థిక గణాంకాల నమోదు కారణంగా రానున్న రోజుల్లో విదేశీ ఇన్వెస్టర్లు భారత ఈక్విటీ పట్ల బేరీష్‌ వైఖరినే ప్రదర్శింవచ్చు’’ అని రిలిగేర్‌ బ్రోకింగ్‌ సాంకేతిక రీసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అజిత్‌ మిశ్రా తెలిపారు.  

కార్పొరేట్‌ ఆర్థిక ఫలితాలు
రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గత శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత క్యూ3 గణాంకాలను వెల్లడించింది. ఈ ఫలితాల ప్రభావం సోమవారం (23న) ట్రేడింగ్‌లో ప్రతిఫలించే అవకాశముంది. ఇదే వారంలోనే యాక్సిస్‌ బ్యాంక్, మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, బజాజ్‌ ఆటో, సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్, బజాజ్‌ ఫైనాన్స్‌సహా 300కి పైగా కంపెనీలు తమ మూడో క్వార్టర్‌ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత కంపెనీల షేర్లు ఒడిదుడుకులకు లోనవచ్చు. ట్రేడర్లు షేరు ఆధారిత ట్రేడింగ్‌కు ఆసక్తి చూపవచ్చు.

బుధవారమే ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ
ఈ గురువారం జనవరి 26 గణతంత్ర దినోవత్సం సందర్భంగా ఎక్సే్చంజీలకు సెలవుకావడంతో బుధవారమే నెలవారీ డెరివేటివ్స్‌ కాంట్రాక్టుల గడువు ముగియనుంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకునే స్క్యేయర్‌ ఆఫ్‌ లేదా రోలోవర్‌ అనుగుణంగా మార్కెట్‌ స్పందించవచ్చు. నిఫ్టీకి ఎగువ స్థాయిలో 18,100–18,200 శ్రేణిలో నిరోధం, దిగువ స్థాయిలో 18,000–17,800 వద్ద తక్షణ మద్దతు ఉందని ఆప్షన్‌ డేటా సూచిస్తోంది.

ప్రపంచ పరిణామాలు
బ్యాంక్‌ ఆఫ్‌ జపాన్‌ ద్రవ్య విధాన సమావేశపు నిర్ణయాలు నేడు విడుదల కానున్నాయి. అమెరికాతో పాటు యూరోజోన్‌ జనవరి తయారీ, సేవా రంగ గణాంకాలు రేపు(మంగళవారం) వెల్లడి కానుంది. యూఎస్‌ గృహ విక్రయాలు, నిరుద్యోగ గణాంకాలు, క్యూ4 జీడీపీ అంచనా గణాంకాలు గురువారం(జనవరి 26న) విడుదల కానున్నాయి. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల ట్రేడింగ్‌ను ప్రభావితం చేసే ఈ కీలక స్థూల ఆర్థిక గణాంకాలను ఇన్వెస్టర్లు క్షుణ్ణంగా పరిశీలించే వీలుంది.

ప్రీ బడ్జెట్‌ అంచనాలు
వచ్చే ఏడాది(2024)లో జరిగే సాధారణ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే చివరి బడ్జెట్‌ ఇది. మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించి మూలధన వ్యయానికి భారీగా నిధులు కేటాయించవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి, రైల్వేలు, రోడ్డు, రక్షణ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చంటున్నారు. బడ్జెట్‌ సంబంధిత ముఖ్యంగా మౌలిక వసతులు, క్యాపిటల్‌ గూడ్స్, సిమెంట్, ఎరువుల రంగాల షేర్లలో కదలికలు గమనించవచ్చు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top