
ప్రపంచంలోని అతిపెద్ద టెక్ కంపెనీలైన యాపిల్, మెటాకు యూరోపియన్ యూనియన్ (ఈయూ) వందల మిలియన్ల డాలర్ల జరిమానా విధించింది.
యాపిల్ సంస్థకు 570 మిలియన్ డాలర్లు (భారతీయ కరెన్సీ ప్రకారం రూ.48,64,61,08,500).. మెటాకు 228 మిలియన్ డాలర్లు (ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ. 19,45,92,38,025) జరిమానా విధించింది. ఈ భారీ జరిమానాలు యూరోపియన్ యూనియన్ & ట్రంప్ పరిపాలన మధ్య ఉద్రిక్తతలను పెంచే ప్రమాదం ఉంది. ఎందుకంటే అమెరికా కంపెనీలపై జరిమానా విధించే దేశాలపై సుంకాలు విధిస్తామని ట్రంప్ ఇప్పటికే వెల్లడించారు.
యాపిల్ కంపెనీ ఐఫోన్ వినియోగదారులను.. ఐఫోన్ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా.. ఇతర యాప్‌లను డౌన్‌లోడ్ చేయడానికి వీలు లేకుండా పరిమితులు విధించినట్లు యూరోపియన్ యూనియన్ తన పరిశోధనలో తేల్చింది. ఇది డీఎంఏ చట్టం నిబంధనలకు విరుద్ధం. ఈ కారణంగానే జరిమానా విధిస్తున్నట్లు ఈయూ పేర్కొంది. వినియోగదారుల వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని, ఈ కారణంగానే ఇతర యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి అనుమతించలేదని యాపిల్ స్పందించింది. అంతే కాకుండా తమ టెక్నాలజీని ఉచితంగా ఇవ్వాలని ఈయూ చెబుతోందని.. ఈ కారణంగానే సంస్థను టార్గెట్ చేసినట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి: కుమారుల కోసం ధీరూభాయ్ అంబానీ వదిలివెళ్లిన ఆస్తి ఎంతంటే..
ఇక మెటా విషయానికి వస్తే.. తన సొంత ప్లాట్‌ఫామ్‌లలో వారి వ్యక్తిగత డేటాను కలపకుండానే తన సేవలను ఉపయోగించుకునే అవకాశాన్ని వినియోగదారులకు అందించాల్సి వచ్చింది. అయితే, DMA నిబంధనల ప్రకారం అలా చేయడంలో విఫలమైంది. ఈ కారణంగానే జరిమానా పడింది. ఈ అంశంపై తాము కూడా సవాలు చేస్తామని మెటా పేర్కొంది.