ఈక్విటాస్‌ స్మాల్ ఫైనాన్స్‌ బ్యాంక్‌

Equitas small finance bank public issue on 20th October - Sakshi

ఈ నెల 20-22 మధ్య పబ్లిక్‌ ఇష్యూ

ధరల శ్రేణి రూ. 32-33- ఒక లాట్‌ 450 షేర్లు

ఇష్యూ ద్వారా రూ. 518 కోట్ల సమీకరణ లక్ష్యం

ఏయూఎం, డిపాజిట్లరీత్యా రెండో పెద్ద స్మాల్‌ బ్యాంక్

ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ పబ్లిక్‌ ఇష్యూ మంగళవారం(20) ప్రారంభంకానుంది. ఇష్యూకి ధరల శ్రేణి రూ. 32-33కాగా.. 450 షేర్లను ఒక లాట్‌గా కేటాయించారు. దీంతో రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 450 షేర్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇష్యూ ద్వారా కంపెనీ రూ. 518 కోట్లవరకూ సమకూర్చుకోవాలని భావిస్తోంది. నేడు యాంకర్‌ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించడం ద్వారా కొంతమేర నిధులను సమీకరించనుంది. ఇష్యూ నిధులతో టైర్‌-1 క్యాపిటల్‌ను పటిష్టపరచుకోనుంది. తద్వారా భవిష్యత్‌ అవసరాలకు వినియోగించుకోనున్నట్లు ప్రాస్పెక్టస్‌లో కంపెనీ పేర్కొంది. కంపెనీ తొలుత పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ. 1,000 కోట్లు సమీకరించాలని ఆశించింది. కనీస పెట్టుబడుల నిష్పత్తి మెరుగుపడటంతోపాటు, క్యాపిటల్‌ మార్కెట్‌ పరిస్థితుల ఆధారంగా ప్రణాళికలను సవరించుకున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు.

ప్రమోటర్‌ వాటా
పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ 7.2 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచనుంది. వీటికి అదనంగా రూ. 280 కోట్ల విలువైన షేర్లను సైతం జారీ చేయనుంది. ఐపీవో తదుపరి బ్యాంక్‌లో ప్రమోటర్ల వాటా 82 శాతానికి పరిమితంకానుంది. 2021 సెప్టెంబర్‌కల్లా ఈ వాటాను 40 శాతానికి తగ్గించుకోవలసి ఉన్నట్లు నిపుణులు పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ఆపై 2028 సెప్టెంబర్‌కల్లా 26 శాతానికి పరిమితం చేసుకోవలసి ఉన్నట్లు వివరించారు.

మూడో కంపెనీ
పబ్లిక్‌ ఇష్యూ పూర్తయ్యాక ఈక్విటాస్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌.. దేశీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన మూడో కంపెనీగా నిలవనుంది. ఎన్‌బీఎఫ్‌సీ ఈక్విటాస్‌ హోల్డింగ్స్‌కు పూర్తి అనుబంధ సంస్థ ఇది. ఇప్పటికే ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌, ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టింగ్‌ పొందాయి. క్రిసిల్‌ నివేదిక ప్రకారం బ్యాంకింగ్‌ ఔట్‌లెట్స్‌ ద్వారా 2019లో ఈక్విటాస్‌ స్మాల్‌ బ్యాంక్‌ తొలి ర్యాంకులో నిలిచింది. ఈ విభాగంలో నిర్వహణలోని ఆస్తులు, డిపాజిట్ల రీత్యా రెండో పెద్ద సంస్థగా ఆవిర్భవించింది. దేశీయంగా ఏయూఎంలో 16 శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top