లాంచింగ్‌కు స్పేస్‌ఎక్స్‌ రెడీ! | Elon Musk SpaceX Set to Make History With Record Breaking IPO | Sakshi
Sakshi News home page

లాంచింగ్‌కు స్పేస్‌ఎక్స్‌ రెడీ!

Jun 12 2026 12:56 AM | Updated on Jun 12 2026 12:56 AM

Elon Musk SpaceX Set to Make History With Record Breaking IPO

అతిపెద్ద ఐపీవోగా రికార్డు

75 బిలియన్‌ డాలర్ల సమీకరణ 

షేరు ఇష్యూ ధర 135 డాలర్లు

రిటైలర్లకు 35 శాతం వాటా  

నాస్‌డాక్‌లో లిస్టింగ్‌ నేడు

మొట్టమొదటి ట్రిలియనీర్‌గా ఎలాన్‌ మస్క్‌!

రాకెట్‌ ప్రయోగాల వేదిక, ప్రపంచవ్యాప్త శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ కలిగిన దిగ్గజం స్పేస్‌ఎక్స్‌ ఐపీవో సరికొత్త రికార్డులు నెలకొల్పనుంది. కంపెనీ అధిపతి ఎలాన్‌ మస్క్‌ ఈ కంపెనీ లిస్టింగ్‌తో ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌ (లక్ష కోట్ల డాలర్లు)గా అవతరించనున్నారు.  అటు కార్పొరేట్లను, ఇటు ఇన్వెస్టర్లను విపరీతంగా ఆకర్షిస్తున్న ఇష్యూకి రిస్క్ లు సైతం ఎక్కువే. అయితే దేశీ ఇన్వెస్టర్ల ఐపీవో దరఖాస్తుకు నిబంధనలు అడ్డుపడుతుండటంతో లిస్టింగ్‌ తదుపరి కంపెనీ షేర్లను కొనుగోలు చేసేందుకు వీలుంటుంది!   

యూఎస్‌ ఈవీ కార్ల దిగ్గజం టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ రాకెట్‌ కంపెనీ.. స్పేస్‌ఎక్స్‌ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టింది. షేరుకి 135 డాలర్ల ధరలో చేపట్టిన ఇష్యూ ద్వారా 55.56 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయడం ద్వారా 75 బిలియన్‌ డాలర్లు సమీకరించింది. రిటైల్‌ ఇన్వెస్టర్లకు అత్యధికంగా 35 శాతం వాటా ఆఫర్‌ చేయడం విశేషం. ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించడంతో ఇష్యూ 3 రెట్లకు పైగా ఓవర్‌ సబ్‌స్క్రయిబ్‌ (250 బిలియన్‌ డాలర్ల విలువైన బిడ్‌లు) అయింది. 

నేడు (12న) లిస్ట్‌కానున్న కంపెనీ ప్రపంచంలోనే అత్యంత భారీ ఇష్యూగా రికార్డ్‌ నెలకొల్పనుంది. తద్వారా 1.75 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్‌ విలువను అందుకోనున్నట్లు అంచనా. వెరసి ప్రపంచంలోని అత్యంత విలువైన దిగ్గజాలలో ఒకటిగా నిలవనుంది. ఇప్పటిదాకా అతిపెద్ద ఐపీఓ రికార్డు సౌదీ ఆరా మ్‌కో (29.4 బి. డాలర్లు) పేరిట ఉండగా.. దీన్ని స్పేస్‌ఎక్స్‌ బ్రేక్‌ చేయనుంది. లిస్టింగ్‌లోనే ట్రిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువను దాటిన రెండో కంపెనీ (మొదటిది సౌదీ ఆరామ్‌కో) గా కూడా రికార్డులకెక్కనుంది. మరోపక్క స్టాక్‌ ఆప్షన్స్‌ పొందిన కంపెనీ ఉద్యోగుల సంపద సృష్టికి సైతం తెరలేవనుంది!

స్పేస్‌ఎక్స్‌ అంటే? 
2002లో ఏర్పాటైన స్పేస్‌ఎక్స్‌ ప్రయివేట్‌ కంపెనీగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఐపీవోతో పబ్లిక్‌ మార్కెట్లో ప్రవేశించనుంది. రాకెట్‌ లాంచింగ్‌తోపాటు..అంతరిక్ష ప్రయాణ(స్పేస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌) సేవలందిస్తోంది. అయితే కంపెనీ వృద్ధికి ప్రధానంగా దోహదపడుతున్నది మాత్రం స్టార్‌లింక్‌గా పేర్కొనవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా టెలికం సేవలందించగల శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ నెట్‌వర్క్‌ ఇది. 

ఐపీవో ద్వారా స్టార్‌లింక్‌ సేవల విస్తరణకు నిధులు లభించనున్నాయి. అంతేకాకుండా కొత్త స్పేస్‌క్రాఫ్ట్‌ అభివృద్ధి, స్పేస్‌ ఎక్స్‌ప్లొరేషన్‌ తదితరాలకు సైతం ఆర్థికంగా మద్దతు లభించనుంది. స్పేస్‌ టెక్నాలజీ, శాటిలైట్‌ కనెక్టివిటీ, వాణిజ్యపరమైన స్పేస్‌ ట్రావెల్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు రిటైలర్లకు సైతం వీలు కల్పిస్తుండటం కంపెనీ ఐపీవోకున్న ప్రత్యేకతలుగా పేర్కొనవచ్చు.  

మస్క్‌ మస్త్‌.. మస్త్‌ 
స్పేస్‌ఎక్స్‌ లిస్టింగ్‌తో ప్రమోటర్‌ ఎలాన్‌ మస్క్‌ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా అవతరించే వీలుంది. స్పేస్‌ఎక్స్‌ ప్రణాళికలు ఫలిస్తే మార్స్‌లోకి మానవులను పంపిన తొలి కంపెనీగా ఘనత వహించవచ్చు. అయితే కంపెనీ కార్యకలాపాలు అత్యంత వ్యయభరితంకావడం, అత్యధిక పెట్టుబడుల అవసరం ఉండటంతో రిస్కులూ అధికమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. స్పేస్‌ఎక్స్‌కు గ్లోబల్‌ ఈకామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ ఏర్పాటు చేసిన బ్లూ ఒరిజిన్‌ నుంచి పోటీ ఉంది. ఇదేవిధంగా ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్‌ నుంచి స్టార్‌లింక్‌కు సైతం సెగ తగులుతోంది.

రాకెట్‌ స్పీడ్‌
పునర్‌వినియోగానికి వీలు కల్పించే రాకెట్‌ సాంకేతికతకు తెరతీయడం ద్వారా స్పేస్‌ఎక్స్‌ సరికొత్త మార్పులకు తెరతీసింది. దీంతో రాకెట్ల ప్రయోగ వ్యయాలు తగ్గాయి. ఫాల్కన్‌ రాకెట్లు శాటిలైట్‌ లాంచింగ్, స్పేస్‌ మిషన్స్‌కు వినియోగించవచ్చు. అయితే కంపెనీ బిజినెస్‌లలో స్టార్‌లింక్‌ కీలకపాత్ర పోషిస్తోంది. ఈవీ దిగ్గజం టెస్లాసహా.. పేపాల్‌కు ఊపిరిపోసిన ప్రమోటర్‌ ఎలాన్‌ మస్క్‌ కంపెనీ కావడంతో స్పేస్‌ఎక్స్‌పై భారీ అంచనాలున్నాయి.

లిస్టింగ్‌ తర్వాతే...
దేశీ ఇన్వెస్టర్లు స్పేస్‌ఎక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు లిస్టింగ్‌ తదుపరి మాత్రమే వీలుంటుంది. లిబరలైజ్‌డ్‌ రెమిటెన్స్‌ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌)లో భాగంగా అంతర్జాతీయ బ్రోకరేజీ ప్లాట్‌ఫామ్స్‌ ద్వారా షేర్ల కొనొచ్చు.  అధిక విలువ కారణంగా లిస్టింగ్‌ తర్వాత కంపెనీ పనితీరుపై ఒత్తిడి పెరిగే వీలుంది.  ప్రాజెక్టుల్లో ఆలస్యం, రాకెట్‌ ప్రయోగాలలో అనుకోని సవాళ్లు, టెక్నాలజీ వైఫల్యాల వంటి రిస్క్ లున్నాయి.  2025లో 18.67 బిలియన్‌ డాలర్ల ఆదాయం, 4.94 బి. డాలర్ల నష్టం నమోదు చేసింది.

  – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement