
కోర్టు సుంకాలకు వ్యతిరేకంగా తీర్పు ఇస్తే '1929 నాటి మహా మాంద్యం' వస్తుందని అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' శుక్రవారం హెచ్చరించారు. ఇంతకీ ఈ మహా మాంద్యం ఏమిటి?, దీనికి ప్రధాన కారణాలు ఏంటి? ఇది ప్రజలపై ఎలాంటి ప్రభావాన్ని చూపించిందనే.. విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.
1929 నాటి మహా మాంద్యం
1929 నాటి మహా మాంద్యం.. 20వ శతాబ్దంలోని అత్యంత తీవ్రమైన ఆర్థిక మాంద్యంగా చరిత్రలో నిలిచింది. ఇది 1929లో ప్రారంభమై సుమారు 1939 వరకు ప్రభావం చూపింది. ఈ మాంద్యం మొదట అమెరికాలో 1929 అక్టోబర్ 24 నాటి స్టాక్ మార్కెట్ పతనంతో ప్రారంభమైంది. ఇది కేవలం అమెరికాలో మాత్రమే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపింది.
1929 ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణాలు
స్టాక్ మార్కెట్ పతనం
స్టాక్ ధరలు పెరుగుతుండటం, వాటిపై ఎక్కువ నమ్మకం పెట్టుకున్న ప్రజలు స్టాక్‌లను కొనుగోలు చేశారు. చాలామంది అప్పు తెచ్చుకున్న డబ్బుతో కూడా స్టాక్ కొనేశారు. ఇలా పెద్దఎత్తున స్టాక్‌లు అమ్ముడవడం వల్ల మార్కెట్ విలువ ఒక్కసారిగా కుప్పకూలింది.
బ్యాంకులు మూతపడటం
ప్రజలు తమ డబ్బును బ్యాంకుల నుంచి తీసుకోవడం మొదలుపెట్టారు. ఇది బ్యాంకులు మూతపడటానికి కారణమైంది. వేలాది బ్యాంకులు క్లోజ్ అవ్వడంతో.. ప్రజల నమ్మకాన్ని కోల్పోయాయి. ప్రభుత్వ జోక్యం కూడా తగ్గిపోయింది. బ్యాంకింగ్ వ్యవస్థ బలహీనపడటం ఆర్థిక సంక్షోభానికి ప్రధాన కారణమైంది.
అధిక ఉత్పత్తి, తక్కువ డిమాండ్
రైతులు మార్కెట్ అవసరాల కంటే ఎక్కువ ఉత్పత్తి చేశారు. పారిశ్రామిక రంగం కూడా ఇదే బాటలో అడుగులు వేసింది. అయితే ఉత్పత్తికి తగిన డిమాండ్ లేకుండా పోయింది. ఇది ధరలు తగ్గడానికి మాత్రమే కాకుండా.. అప్పులు పెరగడానికి కూడా కారణమైంది. ఇది ఆర్ధిక వ్యవస్థను మరింత దిగజారేలా చేసింది.
ప్రపంచ వాణిజ్య పతనం
స్మూట్ హాలీ టారిఫ్ చట్టం (1930) వల్ల అమెరికా దిగుమతులపై అధిక పన్నులు విధించడం జరిగింది. ఇది ఇతర దేశాల నుంచి ప్రతీకార సుంకాలను సైతం పెంచింది. దీంతో అంతర్జాతీయ వాణిజ్యం క్షిణించింది. ప్రపంచ మాంద్యం తీవ్రతరం అయింది.
ప్రజలపై ప్రభావం
1929 నాటి మహా మాంద్యం కారణంగా అమెరికాలో నిరుద్యోగం రేటు 25% దాటింది. లక్షలాది ప్రజలు ఉద్యోగాలు కోల్పోయారు. కార్మికులు, రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎంతోమంది ఇళ్లను కూడా వదిలి బయటకు వలసలు వెళ్లి, నిరాశ్రయులయ్యారు.