విదేశాల్లో ఉన్నారు.. ఇన్‌కంట్యాక్స్‌ ఫైల్‌ చేయడం ఎలా?

Details About Income Tax E Filing - Sakshi

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయా. రిటర్న్‌ వేయకుండా ఉంటే పెన్షన్‌ ఉండదంటున్నారు చాలా మంది. –  కే.యస్‌. చైతన్య, హైదరాబాద్‌ 
రిటర్నులు వేయకపోతే ఎటువంటి నోటీసులు రావు అని, ఎవరికీ తెలియదు అని.. ఏమీ అడగరు అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది నిజం కాదు. అపోహ మాత్రమే. ఈ వాదనలో ఎటువంటి పసలేదు. చట్టరీత్యా మీకు ట్యాక్సబుల్‌ ఇన్‌కం దాటి ఆదాయం ఉంటే, మీరే స్వంతంగా రిటర్న్‌ దాఖలు చేయాలి. అది మీ విధి. కర్తవ్యం. పరోక్షంగా మీరు దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నారన్న మాట. మనం కట్టే పన్నుల్లో నుంచే దేశాభివృద్ధికి ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇక మరో విషయం ఏమిటంటే ఇది మీ స్టేటస్‌ సింబల్‌ .. గౌరవం కూడా. అటు పైన మీరు రుణం తీసుకోవాలన్నా బ్యాంకర్లు, ఇతరులు.. అందరూ అడిగే మొట్టమొదటి డాక్యుమెంట్‌ మీ ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్నే. పెద్ద పెద్ద ఆర్థిక వ్యవహారాలు చేయాలంటే పాన్‌ ఉండాల్సిందే. బ్యాంకు అకౌంట్‌ తెరవాలంటే పాన్‌ ఉండాలి. విదేశీయానానికి కావాల్సిన వీసా తీసుకోవడానికి వెళ్లాలన్నా ఈ డాక్యుమెంట్లు ఉపయోగకరంగా ఉంటాయి. వ్యాపారం, వృత్తి చేయాలంటే, స్థిరాస్థుల క్రయవిక్రయాల్లో, ఇన్సూరెన్స్‌లో, ఇన్వెస్ట్‌మెంట్లలో .. ఇలా ఎన్నో రోజువారీ కార్యకలాపాలకు పాన్‌ తప్పనిసరి. కాబట్టి రిటర్ను వేయడం మానేయడం కన్నా వేస్తే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. 

మా అత్తగారు, మావగారు ప్రస్తుతం మాతో అమెరికాలో ఉన్నారు. వచ్చే జనవరి వరకు భారత్‌కి రారు. గడవు తేదిలోగా రిటర్ను వేయలేకపోవచ్చు. ఇప్పుడు ఏం చేయాలి – పాలగుమ్మి అరుణ, వర్జీనియా (ఈమెయిల్‌ ద్వారా) 
మీ అత్తగారు, మావగారి దగ్గర ఆదాయానికి సంబంధించి పూర్తి సమాచారం సిద్ధంగా ఉంటే మీరు అక్కడి నుంచే ఆన్‌లైన్‌లో రిటర్నులు దాఖలు చేయవచ్చు. దీనినే ఈ–ఫైలింగ్‌ అంటారు. ఇది సులువు. త్వరగా అవుతుంది. కష్టపడక్కర్లేదు. డిపార్ట్‌మెంట్‌ వీటిని త్వరితగతిన ప్రాసెసింగ్‌ చేస్తారు. సెప్టెంబర్‌ 2021లో వేసినవారికి అక్టోబర్‌లో రిఫండ్‌లు వచ్చాయి. ప్రస్తుతం గడువు తేది 31–12–2021. వారు భారత్‌ వచ్చే దాకా ఆగకండి.  ఇక్కడికి వచ్చి, ఇక్కడే వేయనవసరం లేదు. వేచి ఉండక్కర్లేదు. ఈ లోగా సమగ్ర సమాచారం సేకరించలేకపోతే డిసెంబర్‌ తర్వాత వేయండి. వడ్డీ, పెనాల్టీలు పడతాయి. 

నేను ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తున్నాను. నా సేవింగ్స్‌ను పరిగణనలోకి తీసుకోకుండా ఫారం 16 జారీ చేశారు. అలాగే ఫారం 26 అ లో తప్పులున్నాయి. రివైజ్‌ చేయడానికి సంస్థ ముందుకు రావడం లేదు. – సామవేదం లావణ్య, సికింద్రాబాద్‌ 
ఈ విషయం గతంలో ఎన్నో సార్లు ప్రస్తావించాం. ఎన్నో సంస్థలు ఫారం 16, ఫారం 16 అల జారీలో తప్పులు చేస్తున్నాయి. ఫారం 26 అ లో కూడా తప్పులు దొర్లుతున్నాయి. మీ దగ్గరున్న సమాచారం సరైనది, సమగ్రమైనది అయితే, తగిన కాగితాలు ఉంటే, ఆ మేరకు రిటర్నులు వేసినప్పుడు సరిదిద్దండి. సరిగ్గా వేయండి. ఎటువంటి సమస్యా ఉండదు. అవసరం అయినప్పుడు సమీక్షించుకోవాలి
- కేసీహెచ్‌ ఏవీఎస్‌ఎన్‌ మూర్తి, కేవీఎన్‌ లావణ్య

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top