
ఈ–ఫైలింగ్ పోర్టల్‌పై సాంకేతిక సమస్యలు
గడువు పొడిగించాలన్న డిమాండ్
16వ తేదీ వరకు అవకాశమిచ్చిన సీబీడీటీ
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్‌లు) దాఖలుకు చివరి రోజు (సెపె్టంబర్ 15) అయిన సోమవారం ఈ–ఫైలింగ్ పోర్టల్‌పై భారీ రద్దీ కనిపించింది. దీంతో పన్ను చెల్లింపుదారులకు పలు సాంకేతిక సమస్యలు ఎదురయ్యాయి. దీనిపై సోషల్ మీడియాలో ఎకరవు పెడుతూ, గడువు పొడిగించాలని డిమాండ్ చేశారు. తొలుత ఎలాంటి సమస్యల్లేవన్న ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ).. సెపె్టంబర్ 16వ తేదీ వరకు (మరొక రోజు) గడువు పొడిగిస్తున్నట్టు రాత్రి 11 గంటల తర్వాత ఎక్స్ ప్లాట్‌ఫామ్‌పై ప్రకటించింది. ఐటీ పోర్టల్‌లో సమస్యలు ఎదురవుతున్నట్టు గత కొన్ని రోజులుగా వ్యక్తులు, చార్టర్డ్ అకౌంటెంట్లు సోషల్ మీడియా ద్వారా ఆదాయపన్ను శాఖ దృష్టికి తీసుకెళ్లారు. పన్ను చెల్లింపులు, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్) డౌన్‌లోడ్‌లో సమస్యలు ఎదురవుతున్నట్టు పేర్కొంటూ, గడువు పొడిగించాలని కోరారు. ముఖ్యంగా ఇ–ఫైలింగ్ పోర్టల్‌పై లాగిన్ కాలేకపోయామంటూ పలువురు అసహనం వ్యక్తం చేయడం కనిపించింది.
పెద్ద సంఖ్యలో రిటర్నులు..
7 కోట్లకు పైగా ఐటీఆర్‌లు దాఖలైనట్టు సీబీడీటీ ప్రకటించింది. 2025–26 అసెస్‌మెంట్ సంవత్సరానికి (2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి) ఇంకా రిటర్నులు దాఖలు చేయని వారు వెంటనే ఆ పని పూర్తి చేయాలని సూచించింది. గత ఆర్థిక సంవత్సరానికి పెనాల్టీ లేకుండా వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌లు) రిటర్నుల సమర్పణకు జూలై 31 గడువు తేదీ కాగా, దీన్ని సెపె్టంబర్ 15 వరకు పొడిగించడం గమనార్హం. గతేడాది జూలై 31 నాటికి మొత్తం 7.28 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయి.