ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి ఢిల్లీ ప్రభుత్వం శుభవార్త..!

Delhi government launches portal for purchasing and registering electric autos - Sakshi

కొత్తగా ఎలక్ట్రిక్ వాహనం కొనాలని చూస్తున్న వారికి ఢిల్లీ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త తెలిపింది. ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ కింద రుణాలపై ఈ-ఆటోల కొనుగోలు చేస్తే వారికి ప్రభుత్వం ఐదు శాతం వడ్డీ రాయితీని అందిస్తున్నట్లు ప్రకటించింది. దేశంలో ఇలాంటి గొప్ప అవకాశాన్ని అందిస్తున్న మొదటి రాష్ట్రం ఢిల్లీ అని తన అధికారిక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీ ప్రభుత్వం కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్(సీఇఎస్ఎల్)తో కలిసి వెబ్‌సైట్‌(https://www.myev.org.in)ను అభివృద్ధి చేసింది. 

ఈ వెబ్‌సైట్‌ ద్వారా ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేసేవారికి రూ.25,000 అదనపు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీ రవాణా మంత్రి కైలాశ్ గహ్లోట్ మాట్లాడుతూ.. "ఈ వెబ్‌సైట్‌ వల్ల ప్రభుత్వం దృవీకరించిన వాహనాలు ప్రజలకు అందడంతో పాటు ఎలక్ట్రిక్ ఆటోల రుణాలపై వడ్డీ రాయితీని అందిస్తున్నట్లు" తెలిపారు.  'మై ఈవీ పోర్టల్' అనేది ఆన్ లైన్ పోర్టల్. ఇది లెటర్ ఆఫ్ ఇంటెంట్(ఎల్ఓఐ) హోల్డర్లు ఈ-ఆటోలను కొనుగోలు చేయడానికి, ఢిల్లీ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహకాలను క్లెయిం చేసుకోవడానికి వీలు కలిపిస్తుంది. ఈ ఆన్‌లైన్ పోర్టల్ రవాణా శాఖ వెబ్‌సైట్‌లో కూడా వినియోగదారులకి అందుబాటులో ఉంటుంది. 

ప్రస్తుతం ఈ పథకం కింద ఎలక్ట్రిక్ ఆటోలపై అందిస్తున్న ప్రోత్సాహకలను త్వరలో దేశ రాజధానిలోని లిథియం-అయాన్ ఆధారిత ఈ-రిక్షాలు, ఇ-కార్ట్ లు మరియు ఎలక్ట్రిక్ లైట్ గూడ్స్ వాహనాలకి అందించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందంలో భాగంగా మహీంద్రా ఫైనాన్స్, అకాసా ఫైనాన్స్, మన్నాపురం ఫైనాన్స్, రెవ్ఫిన్, ప్రెస్ట్ రుణ సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలపై రుణాలను అందించనున్నాయి.

(చదవండి: క్యాబ్​ డ్రైవర్​గా మారిన దిగ్గజ కంపెనీ సీఈఓ.. ఎందుకో తెలుసా?)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top