వర్క్ ఫ్రం హోం.. డెలాయిట్‌ సర్వేలో ఆసక్తికర విషయాలు

cyber risk increase next 2 years says deloitte report - Sakshi

కరోనా వల్ల ఏర్పడిన పరిస్థితుల్లో వచ్చే రెండేళ్ల కాలంలో భారీగా ఆన్‌లైన్‌ మోసాలు పెరిగే ప్రమాదం ఉందని కంపెనీ బోర్డుల్లోని స్వతంత్ర డైరెక్టర్లు ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. డెలాయిట్‌ టచ్‌ తోమత్సు ఇండియా, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ భాగస్వామ్యంతో నిర్వహించిన సర్వేలో ఈ విషయం తెలిసింది. 

‘కార్పొరేట్‌ మోసాలు, దుర్వినియోగం: ఇండింపెండెంట్‌ డైరెక్టర్ల పాత్ర’ పేరుతో ఈ సర్వే వివరాలను డెలాయిట్‌ బుధవారం విడుదల చేసింది. సర్వేలో పాల్గొన్న స్వతంత్ర డైరెక్టర్లలో 63 శాతం మంది వచ్చే రెండేళ్లలో ఆన్‌లైన్‌ మోసాలు పెరగొచ్చని చెప్పారు. ఉద్యోగుల్లో ఎక్కువ మంది ఇంటి నుంచే పనిచేస్తుండడం, నగదు ప్రవాహాల సమస్యలు మోసాలు పెరిగేందుకు కారణం కావచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా సైబర్‌ నేరాలు, ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్లకు సంబంధించి ఎక్కువ మోసాలు జరగొచ్చని అంచనా వేస్తున్నారు.

మోసాలను నివారించేందుకు, గుర్తించే విషయంలో తాము ముఖ్యమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని 75 శాతం మంది ఇండిపెండెంట్‌ డైరెక్టర్లు తెలిపారు. మోసాల రిస్క్‌ను నివారించే విషయంలో పటిష్టమైన కార్యాచరణను కంపెనీ బోర్డు అమలు చేస్తోందని 57 శాతం మంది చెప్పారు. వ్యాపార నిర్వహణ పరిస్థితులు శరవేగంగా మార్పునకు గురవుతున్న నేపథ్యంలో కంపెనీలు తమ రిస్క్‌ నిర్వహణ విధానాలను సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఈ సర్వే పేర్కొంది.
 

చదవండి: వారంలో మూడు రోజులు పనిచేస్తే చాలు..! తెరపైకి మరో కొత్త పాలసీ

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top