Sakshi News home page

సైబర్‌ బీమాకు డిమాండ్‌

Published Fri, Oct 6 2023 4:36 AM

Cyber insurance gains momentum in India - Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా సైబర్‌ బీమాకు గణనీయంగా డిమాండ్‌ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో సైబర్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్‌ ఏటా 27–30% వృద్ధి చెందనుంది. కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్‌ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్రస్తుతం భారత్‌లో సైబర్‌ బీమా మార్కెట్‌ పరిమాణం 50–60 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.500 కోట్లు) స్థాయిలో ఉంది. గత మూడేళ్లుగా 27–30% మేర చక్రగతిన వృద్ధి చెందుతోంది.

‘సైబర్‌ ఇన్సూరెన్స్‌ అవసరంపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో వచ్చే 3–5 ఏళ్లలో ఇదే స్థాయి వృద్ధి కొనసాగే అవకాశం ఉంది‘ అని నివేదికలో పేర్కొంది. ఐటీ, ఫార్మా, తయారీ రంగాలతో పాటు సరఫరా వ్యవస్థ, రిటైల్, ఫైనాన్స్‌ వంటి డిజిటైజేషన్‌ అధికంగా ఉండే విభాగాలు సైబర్‌ క్రిమినల్స్‌కు లక్ష్యాలుగా ఉంటున్నట్లు తెలిపింది. కాబట్టి, మిగతా రంగాలతో పోలిస్తే సైబర్‌ బీమాను తీసుకోవడంలో ఈ విభాగాలు ముందుంటాయని పేర్కొంది.

పలువురు చీఫ్‌ ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ ఆఫీసర్ల (సీఐఎస్‌వో)తో నిర్వహించిన సర్వే ఆధారంగా డెలాయిట్‌ ఈ నివేదికను రూపొందించింది. ప్రస్తుతం మార్కెట్లో ఒడిదుడుకులు, అనిశ్చితి నెలకొన్నప్పటికీ వచ్చే దశాబ్ద కాలంలో సైబర్‌ బీమా గణనీయంగా వృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయని డెలాయిట్‌ ఇండియా పార్ట్‌నర్‌ (రిస్క్‌ అడ్వైజరీ) ఆనంద్‌ వెంకట్రామన్‌ తెలిపారు. విక్రేతలు, కొనుగోలుదారుల అవసరాల మేరకు పాలసీలను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు.  

నివేదికలోని మరిన్ని అంశాలు..
► రాబోయే మూడేళ్లలో డిజిటల్‌ మౌలిక సదుపాయాలకు రక్షణ కలి్పంచుకునేందుకు సర్వేలో పాల్గొన్న సీఐఎస్‌వోల్లో 70% మంది మరింత ఎక్కువ వ్యయం చేయడానికి మొగ్గు చూపారు.  
► గణనీయంగా వినియోగదారుల డేటాబేస్‌లు ఉన్న కొన్ని పెద్ద కంపెనీలు తమ డిజిటల్‌ ఇన్‌ఫ్రా బడ్జెట్‌లను పెంచుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. డిజిటల్‌ మౌలిక సదుపాయాల భద్రతను మెరుగుపర్చుకునేందుకు మరింత ఇన్వెస్ట్‌ చేయడానికి బదులు బీమా కవరేజీని పెంచుకోవడంపై ఆసక్తిగా ఉన్నట్లు 60 శాతం సంస్థలు పేర్కొన్నాయి.  
► దేశీయంగా సైబర్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్‌ వృద్ధి గతి ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉండనుంది. కంపెనీలు డిజిటల్‌ పరిపక్వతను సాధించే వేగం, డిజిటైజేషన్‌ .. కఠినతరమైన సైబర్‌ చట్టాల అమలుకు ప్రభుత్వం తీసుకునే చర్యలు, సంప్రదాయేతర సంస్థలైన టెక్నాలజీ కంపెనీల్లాంటివి కూడా సైబర్‌ ఇన్సూరెన్స్‌ మార్కెట్లోకి ప్రవేశించడం వీటిలో ఉండనున్నాయి.  
► సైబర్‌ బీమాను ఒక వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూసే ధోరణి పెరగాలి. డిజిటైజేషన్‌ వేగవంతమవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో తగు స్థాయిలో సైబర్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీని తీసుకోవడం తప్పనిసరి అనేది కంపెనీలు గుర్తించాలి.
► సమగ్ర రిసు్కల నిర్వహణలో సైబర్‌ రిసు్కలు ప్రధానమైనవని గుర్తించి బోర్డులు, సీఈవోలు సైబర్‌సెక్యూరిటీ విషయంలో తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది.
► బీమా పాలసీలను సరళతరం చేయడంతో పాటు వివిధ కవరేజీల గురించి కొనుగోలుదార్లలో అవగాహన పెంచేందుకు బీమా
కంపెనీలు కృషి చేయాలి.  
► పౌరుల గోప్యతకు భంగం వాటిల్లకుండా పటిష్టమైన డేటా రక్షణ వ్యవస్థను నిర్వహించడంలో ప్రభుత్వం కీలకపాత్ర పోషించాలి.

Advertisement

What’s your opinion

Advertisement