
ఆస్తుల నాణ్యతలో కొనసాగుతున్న సవాళ్లు
క్రిఫ్ హైమార్క్ నివేదిక
సూక్ష్మ రుణాల పోర్ట్‌ఫోలియో వార్షికంగా చూస్తే మార్చి త్రైమాసికం చివరికి 14 శాతం తగ్గి రూ.3.81 లక్షల కోట్లుగా ఉన్నట్టు క్రిఫ్ హైమార్క్ తెలిపింది. 30 రోజులుగా చెల్లింపులు చేయని రుణాల పరంగా కొంత పురోగతి మార్చి త్రైమాసికంలో కనిపించినప్పటికీ, ఆస్తుల నాణ్యత సవాళ్లు కొనసాగుతున్నట్టు వివరించింది. గతేడాది కాలంలో సూక్ష్మ రుణ రంగంలో ఉన్న ప్రతికూలతలను ప్రస్తావించింది.
ఒకే రుణ గ్రహీతకు ఒకటికి మించిన సంస్థలు రుణాలు మంజూరు చేయడంతో ఆస్తుల నాణ్యత దిగజారడాన్ని గుర్తు చేసింది. దీంతో ఒక్క రుణ గ్రహీతకు గరిష్టంగా నాలుగు సంస్థల వరకే రుణ వితరణ జరిగేలా సూక్ష్మ రుణ పరిశ్రమ పరిమితులు విధించినట్టు తెలిపింది. తమిళనాడు, కర్ణాటకలో సూక్ష్మ రుణ వసూళ్లను కట్టడి చేస్తూ అక్కడి ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లు పరిశ్రమకు హాని చేస్తాయంటూ.. ఆయా రాష్ట్రాల్లో డిసెంబర్ క్వార్టర్ కంటే మార్చి క్వార్టర్‌లో రుణ వితరణ 7 శాతం తగ్గినట్టు పేర్కొంది.
మార్చి క్వార్టర్ చివరికి పరిశ్రమ వ్యాప్తంగా చురుకైన రుణాలు 14 కోట్లకు తగ్గినట్టు తెలిపింది. డిసెంబర్ చివరికి ఇవి 14.6 కోట్లుగా ఉంటే.. 2024 మార్చి నాటికి 16.1 కోట్లుగా ఉన్నట్టు క్రిఫ్ హైమార్క్ నివేదిక వెల్లడించింది. మార్చి త్రైమాసికలో 1.33 కోట్ల రుణాలు మంజూరైనట్టు.. 2024 మార్చి త్రైమాసికంలో మంజూరైన రుణాలు 2.40 కోట్లతో పోల్చితే సగం మేర తగ్గినట్టు తెలిపింది.
ఆస్తుల నాణ్యతలో కొంత మెరుగు
30 రోజుల వరకు చెల్లింపులు చేయని రుణాలు 2024 డిసెంబర్ త్రైమాసికం చివరికి 1.8శాతంగా ఉంటే, మార్చి చివరికి 1.4 శాతానికి తగ్గినట్టు క్రిఫ్ హైమార్క్ నివేదిక వెల్లడించింది. రూ.లక్షకు మించిన రుణాల పోర్ట్‌ఫోలియో 38.5 శాతం పెరగ్గా.. రూ.30వేలలోపు రుణాలు 36 శాతం మేర తగ్గినట్టు తెలిపింది. దీర్ఘకాల సుస్థిరత పథకంలో పరిశ్రమ నడుస్తున్నట్టు పేర్కొంది.