ధరల పెరుగుదల, మారిపోతున్న ఆర్థిక లక్ష్యాలు, అంతటా ఆర్థిక అనిశ్చితి నెలకొన్న తరుణంలో ఇటు స్థిరంగా ఉంటూ అటు సమర్ధంగా పనిచేయగలిగే విధంగా సమతౌల్యతను పాటించే సాధనాల కోసం ఇన్వెస్టర్లు అన్వేషిస్తున్నారు. సాంప్రదాయ పెట్టుబడి సాధనాల్లో సాధారణంగా, – అయితే భద్రత, లేకపోతే వృద్ధి – ఇలా ఏదో ఒక దాన్నే ఎంచుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇన్‌కం ప్లస్ ఆర్బిట్రేజ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్) హైబ్రిడ్ విధానాన్ని అందిస్తాయి. మార్కెట్ టైమింగ్‌పై లేదా డైనమిక్ మార్పులపైన ఆధారపడకుండా ఇటు డెట్ అటు ఆర్బిట్రేజ్ వ్యూహాల సామర్థ్యాల మేళవింపుగా ఇది ఉంటుంది. తక్కువ ఒడిదుడుకులతో మెరుగైన రాబడులు అందిస్తాయని వీటికి పేరుంది. కాబట్టే, మధ్యకాలిక వ్యవధికి లిక్విడిటీ, పన్ను ఆదా ప్రయోజనాలు, పెట్టుబడి సంరక్షణను కోరుకునే ఇన్వెస్టర్లకు ఇవి ఆసక్తికరంగా ఉండగలవు.
ఇన్‌కం ప్లస్ ఆర్బిట్రేజ్ ఎఫ్‌వోఎఫ్‌లు
ఇన్‌కం ప్లస్ ఆర్బిట్రేజ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ (ఎఫ్‌వోఎఫ్) స్వరూపం ప్రత్యేకంగా ఉంటుంది. ఇవి ప్రధానంగా నిర్దిష్ట డెట్ ఆధారిత ఫండ్స్‌లో (65 శాతం వరకు), మిగతా మొత్తాన్ని ఆర్బిట్రేజ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తాయి. డెట్ సాధనాల స్థిరత్వాన్ని, అలాగే ఈక్విటీ మార్కెట్లలో ధరల్లో స్వల్పకాలిక తేడాలను ఒడిసిపట్టుకుని, అధిక రాబడులు అందించగలిగే ఆర్బిట్రేజ్ వ్యూహాన్ని కలగలిపి మెరుగైన ఫలితాలను అందించడం ఈ వ్యూహం లక్ష్యం. ఫైనాన్స్ చట్టం 2024 (నం.2) కింద ఏదైనా ఎఫ్‌వోఎఫ్ తన పోర్ట్‌ఫోలియోలో 35 శాతం నుంచి 65 శాతం వరకు మొత్తాన్ని ఆర్బిట్రేజ్ స్కీములకు (పన్ను విధింపునకు సంబంధించి వీటిని ఈక్విటీగా పరిగణిస్తారు) కేటాయిస్తే, దాన్ని నాన్–స్పెసిఫైడ్ మ్యుచువల్ ఫండ్‌గా వ్యవహరిస్తారు.
ఈ వర్గీకరణ వల్ల ఇన్‌కం ప్లస్ ఆర్బిట్రేజ్ ఫండ్స్ ప్రత్యేకమైన పన్నుపరమైన ప్రయోజనాన్ని కూడా అందిస్తాయి. అదేమిటంటే, యూనిట్లను రెండేళ్లు లేదా అంతకు మించిన వ్యవధికి అట్టే పెట్టుకునే ఇన్వెస్టర్లకు ఇండెక్సేషన్ ప్రయోజనాలతో 12.5% ట్యాక్స్ రేటు వర్తిస్తుంది. సాధారణంగా హోల్డింగ్ పీరియడ్‌తో సంబంధం లేకుండా ఇన్వెస్టర్ శ్లాబ్ రేట్‌కి తగ్గట్లుగా షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వర్తించే సంప్రదాయ సాధనాలతో పోలిస్తే ఇది పన్ను ఆదా ప్రయోజనాలను కల్పిస్తుంది. 2–5 ఏళ్ల మధ్యకాలిక పెట్టుబడి వ్యవధికి ఇన్వెస్ట్ చేసే ఇన్వెస్టర్లకు ఈ ఫండ్స్ అనువైనవి.
ఎవరికి మేలంటే..
ఒక మోస్తరు సంపద వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంటూనే, మూలధనాన్ని కాపాడుకునేందుకు తక్కువ రిస్కులున్న సాధనాల కోసం అన్వేషించే మదుపరులకు ఇవి ఉపయోగకరం. పెద్దగా రిస్క్ తీసుకోకుండా, ఫిక్సిడ్ ఇన్‌కం సాధనాల్లో పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని కోరుకునే వారు పోర్ట్‌ఫోలియోను తీర్చిదిద్దుకునేందుకు ఇవి సహాయకరం. ప్రస్తుతం వడ్డీ రేట్లు మారుతుండటం, అంతర్జాతీయంగా అనిశ్చితులు, ఆర్థిక విధానాలు మారిపోతుండటం తదితర పరిస్థితులను ఎదుర్కొంటూ ముందుకెళ్లే క్రమంలో ఇన్వెస్టర్లకు ఈ పెట్టుబడి వ్యూహం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
స్థిరమైన ఆదాయం: మార్కెట్ షాక్‌లను తట్టుకునేందుకు డెట్ సాధనం ఉపయోగపడుతుంది. నమ్ముకోతగిన ఆదాయ వనరుగా నిలుస్తుంది. అలాగే ఈక్విటీల్లో పెట్టుబడులపరంగా ఎదురయ్యే ఒడిదుడుకులను తగ్గిస్తుంది.
సరళతరం, లిక్విడిటీ: లాకిన్ పీరియడ్‌లు ఉండే సంప్రదాయ సొల్యూషన్స్‌తో పోలిస్తే ఈ ఫండ్స్ సాధారణంగా మరింత మెరుగైన లిక్విడిటీని ఆఫర్ చేస్తాయి. భారీ పెనాల్టీల భారం లేకుండా కావాల్సినప్పుడు తమ యూనిట్లను రిడీమ్ చేసుకునేలా ఇన్వెస్టర్లకు వెసులుబాటు కల్పిస్తాయి.
ప్రాక్టికల్ ప్రయోజనాలు: నిర్దిష్ట డెట్, ఆర్బిట్రేజ్ స్కీముల మధ్య కేటాయింపులను ఫండ్ మేనేజరే అటూ, ఇటూ మారుస్తుండటం వల్ల (ఫండ్ ఆఫ్ ఫండ్ స్వభావరీత్యా) ఇన్వెస్టరుపై ట్యాక్స్ లయబిలిటీ ఉండకపోవడమనేది ఈ తరహా ఫండ్ ప్రధాన ప్రయోజనాల్లో ఒకటి. ఎఫ్‌ఓఎఫ్ స్వరూపరీత్యా అంతర్గతంగానే ఈ మార్పులు జరగడం వల్ల, యూనిట్లను రిడీమ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇన్వెస్టర్లకు ట్యాక్స్ భారం పడుతుంది. ఆ విధంగా ఇది తక్కువ వ్యయాలతో కూడుకున్న, పన్ను ఆదాపరమైన ప్రయోజనాలను కల్పించే విధంగా ఉంటుంది.
ఫిక్సిడ్ ఇన్‌కం పెట్టుబడుల్లో వైవిధ్యాన్ని కోరుకునే ఇన్వెస్టర్లు, మధ్యకాలిక లక్ష్యాలకు ప్లాన్ వేసుకుంటున్న వారు, పోర్ట్‌ఫోలియోకి మరింత రక్షణ కవచాన్ని ఏర్పర్చుకోదల్చుకున్న వారు ఈ ఫండ్స్‌ను తప్పక పరిశీలించవచ్చు.

ఇదీ చదవండి: పెట్టుబడి వెనక్కి తీసుకుంటే పెనాల్టీ కట్టాలా?


