స్విస్‌ సెంట్రల్‌ బ్యాంక్‌పై ఇన్వెస్టర్ల దావా

Credit Suisse bondholders sue Swiss regulator over wipe-out - Sakshi

బాండ్ల రద్దు నిర్ణయం సవాలు

లండన్‌: క్రెడిట్‌సూసే ఇన్వెస్టర్ల బృందం స్విస్‌ స్విట్జర్లాండ్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్‌ సూపర్‌ వైజరీ అథారిటీ (ఎఫ్‌ఐఎన్‌ఎంఏ/స్విస్‌ సెంట్రల్‌ బ్యాంక్‌)కి వ్యతిరేకంగా ఫెడరల్‌ కోర్టును ఆశ్రయించారు. గత నెలలో సంక్షోభంలో పడ్డ క్రెడిట్‌ సూసేని కాపాడేందుకు తీసుకున్న నిర్ణయం ఫలితంగా 16 బిలియన్‌ స్విస్‌ఫ్రాంకోలు (17.3 బిలియన్‌ డాలర్లు) విలువైన బాండ్ల విలువ తుడిచిపెట్టుకుపోయింది. దీంతో ఇందులో ఇన్వెస్ట్‌ చేసిన వారు సెంట్రల్‌ బ్యాంక్‌ నిర్ణయాన్ని కోర్టులో సవాలు చేశారు. క్రెడిట్‌ సూసేని యూబీఎస్‌ 3.25 బిలియన్‌ డాలర్లకు కొనడం తెలిసిందే.

ఇదంతా కేంద్ర బ్యాంకు మార్గదర్శకంలోనే జరిగింది. దీంతో స్విట్జర్లాండ్‌లోనే రెండో అతిపెద్ద బ్యాంక్‌గా ఉన్న క్రెడిట్‌సూసే మునిగిపోకుండా కాపాడినట్టయింది. ఇన్వెస్టర్లు తమ డిపాజిట్లను వెనక్కి తీసుకోవడంతో క్రెడిట్‌సూసే సంక్షోభం పాలైంది. ఎఫ్‌ఐఎన్‌ఎంఏ తీసుకున్న నిర్ణయం స్విస్‌ ఆర్థిక వ్యవస్థపై ఉన్న విశ్వసనీయత, కచ్చితత్వాన్ని దెబ్బతీసిందని లా సంస్థ క్విన్‌ ఎమాన్యుయేల్‌ అర్కుహర్ట్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ థామస్‌ వెర్లెన్‌ తెలిపారు. ఇన్వెస్టర్ల తరఫున ఈ సంస్థే వ్యాజ్యం దాఖలు చేసింది. కోర్టును ఆశ్రయించిన ఇన్వెస్టర్లు సంయుక్తంగా 5 బిలియన్‌ డాలర్ల విలువైన పెట్టుబడులను బాండ్లలో కలిగి ఉన్నారు.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top