హైదరాబాద్‌లో ఇళ్ల ధరలకు రెక్కలు! కారణం ఇదే..?

Credai Colliers Liases Foras Report on Housing Pricetracker Report 2022 - Sakshi

జనవరి–మార్చి కాలంలో  9 శాతం పెరుగుదల 

8 పట్టణాల్లో 11 శాతం పెరిగిన ధరలు 

ధరల పెరుగుదల డిమాండ్‌కు అడ్డంకి కాదు 

క్రెడాయ్, కొలియర్స్‌ నివేదిక వెల్లడి 

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ మార్కెట్లో ఈ ఏడాది మొదటి మూడు నెలల కాలంలో (జనవరి–మార్చి) ఇళ్ల ధరలు 9 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.9,232గా ఉంది. ముంబై తర్వాత చదరపు అడుగు ధర అధికంగా ఉన్నది హైదరాబాద్‌లోనే కావడం గమనార్హం. అదే దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు జనవరి–మార్చి మధ్య సగటున 11% పెరిగాయి. ఈ వివరాలను క్రెడాయ్, కొలియర్స్, లయసెస్‌ ఫొరాస్‌ నివేదిక రూపంలో వెల్లడించాయి. డిమాండ్‌ పెరగడానికితోడు, నిర్మాణరంగంలో వాడే ముడి సరు కుల ధరలకు రెక్కలు రావడం ఇళ్ల ధరలు ప్రియం కావడానికి కారణాలుగా నివేదిక తెలిపింది.  

ఢిల్లీలో అధికం.. 
ఢిల్లీ మార్కెట్లో ఇళ్ల ధరలు అంతకుముందు ఏడాది ఇదే మూడు నెలల కాలంతో పోలిస్తే (2021 జనవరి–మార్చి) అత్యధికంగా 11 శాతం పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.7,363కు చేరింది. అహ్మదాబాద్‌లో ధరలు 8% పెరిగి చదరపు అడుగుకు రూ.5,721కి చేరింది. బెంగళూరు, చెన్నై, ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో ఇళ్ల ధరలు ఒక్క శాతమే వృద్ధిని చూశాయి. చదరపు అడుగు ధర బెంగళూరులో రూ.7,595, చెన్నైలో రూ.7,017గా ఉండగా,  ముంబై ఎంఎంఆర్‌లో                రూ. 19,557గా ఉంది. పుణె మార్కెట్లో ధరలు 3% పెరిగాయి. చదరపు అడుగు ధర రూ.7,485గా ఉంది. ‘‘చాలా పట్టణాల్లో ఇళ్ల కొనుగోలు డిమాండ్‌ పెరిగింది. రెండేళ్లలో ఇళ్ల నిర్మాణానికి వినియోగించే మెటీరియల్స్‌ ధరలు ఆకాశాన్నంటాయి. ఈ పరిస్థితులే వార్షికంగా ధరలు పెరగడానికి దారితీశాయి. ఫలితంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో ఇళ్ల ధరలు కరోనా ముందున్న స్థాయిని దాటేశాయి’’అని ఈ నివేదిక తెలిపింది.  

దేశవ్యాప్తంగా 4 శాతం 
‘‘దేశవ్యాప్తంగా ఇళ్ల ధరలు జనవరి–మార్చి కాలంలో సగటున 4 శాతం పెరిగాయి. దీర్ఘకాలం పాటు మందగమన పరిస్థితుల నుంచి నివాసిత ఇళ్ల మార్కెట్‌ ఇంకా కోలుకోవాల్సి ఉంది’’అని క్రెడాయ్, కొలియర్స్‌ నివేదిక తెలియజేసింది.  

పూర్వపు స్థాయి కంటే ఎక్కువ 
2022 జనవరి – మార్చి త్రైమాసికంలో కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కరోనా ముందు నాటికంటే ఎక్కువగా ఉన్నట్టు లయసెస్‌ ఫొరాస్‌ ఎండీ పంకజ్‌ కపూర్‌ పేర్కొన్నారు. రానున్న త్రైమాసికాల్లో కొత్త ప్రాజెక్టుల ఆవిష్కరణ మరింత ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేశారు. కొత్త సరఫరాతో ఇళ్ల యూనిట్ల లభ్యత పెరుగుతుందన్నారు. గృహ రుణాలపై ఇటీవల వడ్డీ రేట్లు పెరిగినా కానీ, ఇళ్ల విక్రయాలు కూడా వృద్ధిని చూపిస్తాయని చెప్పారు.  

రియల్టీకి మద్దతుగా నిలవాలి.. 
పెరిగిపోయిన నిర్మాణ వ్యయాలతో రియల్‌ ఎస్టేట్‌ రంగంలో గత 18 నెలల్లో వృద్ధిపై ప్రభావం పడినట్టు క్రెడాయ్‌ జాతీయ అధ్యక్షుడు హర్‌‡్షవర్ధన్‌ పటోడియా అన్నారు. స్టీల్‌ ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు తగ్గించడం.. ముడి ఇనుము, స్టీల్‌ ఇంటర్‌మీడియరీల దిగుమతులపైనా సుంకాలు తగ్గించడం దేశీయంగా స్టీల్‌ ఉత్పత్తుల ధరలు చల్లారడానికి సాయపడతాయన్నారు. ‘‘ప్రస్తుత పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవడం ముఖ్యం. రియల్‌ ఎస్టేట్‌ రంగం యూ షేప్‌లో రికవరీ అయ్యేందుకు మద్దతుగా నిలవాలి’ అని ఆయన కోరారు

5–10 శాతం పెరగొచ్చు.. 
వచ్చే 6–9 నెలల కాలంలో ఇళ్ల ధరలు మరో 5–10 శాతం మధ్య పెరిగే అవకాశం ఉందని కొలియర్స్‌ ఇండియా సీఈవో రమేశ్‌ నాయర్‌ అంచనా వేశారు. ‘‘భారత నివాస మార్కెట్‌ మంచి పనితీరు చూపించడం ఉత్సాహంగా ఉంది. చాలా ఏళ్ల తర్వాత మార్కెట్‌ అంచనాలను అధిగమిస్తోంది. విశ్వసనీయమైన సంస్థలు ఈ ఏడాది ఎక్కువ విక్రయాలు చూస్తాయని అంచనా వేస్తున్నాం. ఎందుకంటే వినియోగదారులు డెవలపర్ల మంచి పేరును కూడా చూస్తున్నారు’’ అని నాయర్‌ చెప్పారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top