పసిడి వెలుగుపై కోవిడ్‌ నీడ! 

 COVID-19 hits gold buying sentiment Q3 demand drops by 30pc: WGC - Sakshi

జూలై-సెప్టెంబర్‌ మధ్య భారత్‌ బంగారం డిమాండ్‌ 30 శాతం డౌన్

ప్రపంచ వ్యాప్తంగానూ 19 శాతం పతనం

వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ నివేదిక

సాక్షి, ముంబై: బంగారం డిమాండ్‌ జూలై-సెప్టెంబర్‌ మధ్య ఇటు భారత్‌లో అటు ప్రపంచవ్యాప్తంగా భారీగా పడిపోయింది. కరోనా మహమ్మారి దీనికి ప్రధాన కారణం. వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) తాజా నివేదిక ప్రకారం, జూలై-సెప్టెంబర్‌ మధ్య భారత్‌లో డిమాండ్‌ 30 శాతం పడిపోతే, ప్రపంచవ్యాప్తంగా ఈ క్షీణత 19 శాతంగా ఉంది.

నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను చూస్తే... 

  • సెప్టెంబర్‌ త్రైమాసికంలో భారత్‌ పసిడి డిమాండ్‌ పరిమాణంలో 123.9 టన్నుల (2019 సెప్టెంబర్‌) నుంచి 86.6 టన్నులకు పడిపోయింది. ఇక విలువ రూపంలో చూస్తే, పసిడి డిమాండ్‌ 4 శాతం పడిపోయి రూ.41,300 కోట్ల నుంచి రూ.39,510 కోట్లకు తగ్గింది. 
  • ఆభరణాల డిమాండ్, పరిమాణంలో 48 శాతం క్షీణించి 101.6 టన్నుల నుంచి 52.8 టన్నులకు చేరింది. విలువలో చూస్తే, 29 శాతం పడిపోయి, రూ.33,850 కోట్ల నుంచి రూ.24,100   కోట్లకు దిగింది.
  • మొత్తం రీసైకిల్డ్‌ గోల్డ్‌ పరిమాణం 14 శాతం ఎగసి 36.5 టన్నులకు 41.5 టన్నులకు చేరింది. యల్లో మెటల్‌ అధిక ధరలూ దీనికి కారణం.  

పెట్టుబడుల డిమాండ్‌ అప్‌...  ఇక పెట్టుబడుల విషయంలో (పరిమాణం) మాత్రం డిమాండ్‌ 22.3 టన్నుల నుంచి 33.8 టన్నులకు ఎగసింది. విలువలో చూస్తే, 107 శాతం పెరిగి రూ.7,450 కోట్ల నుంచి రూ.15,410 కోట్లకు ఎగసింది. 

ప్రపంచ డిమాండ్‌ 892.3 టన్నులు : ప్రపంచ వ్యాప్తంగా పసిడి డిమండ్‌ను సెప్టెంబర్‌ త్రైమాసికంలో పరిశీలిస్తే, 2019 ఇదే కాలంతో పోల్చితే పరిమాణంలో 19 శాతం పతనమైంది. 1,100.2 టన్నుల నుంచి 892.3 టన్నులకు డిమాండ్‌ పడిపోయింది. అయితే పెట్టుబడుల డిమాండ్‌ మాత్రం 21 శాతం పెరిగి 494.6 టన్నులకు చేరింది. ఆభరణాలకు డిమాండ్‌ 29 శాతం పడిపోయి 333 టన్నులుగా నమోదయ్యింది. సెప్టెంబర్‌తో ముగిసిన ఏడాది కాలానికి చూస్తే, ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌ హోల్డింగ్స్‌ విలువ ఏకంగా 1,003.3 టన్నులుగా ఉండడం గమనార్హం.   

2009 తరహా పరిస్థితి ఖాయం... : బంగారానికి తిరిగి డిమాండ్‌ ఏర్పడుతుందన్న గట్టి నమ్మకం ఉంది. కోవిడ్‌–19 తరువాత డిమాండ్‌ పెరుగుతుందని భావిస్తున్నాం. ఆర్థిక సంక్షోభం నాటి రోజులను తీసుకుంటే, 2009లో పసిడి డిమాండ్‌ 642 టన్నులుగా ఉంది. 2010లో ఇది భారీగా 1,002 టన్నులకు చేరింది. 2011, 2012లో డిమాండ్‌ మరింత పెరిగింది.-సోమసుందరం పీఆర్, డబ్ల్యూజీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఇండియా)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top