ప్చ్‌.. బ్యాడ్‌టైం! అనుకున్నది ఒక్కటి.. అవుతోంది ఒక్కటి

Corona Virus India Personal Hygiene Market Fall Down In 2021 - Sakshi

Hygiene Products Business Fall After Vaccination In India: కరోనా టైంలో అలవర్చుకున్న ఆరోగ్య సూత్రాలకు, శుభ్రతా అలవాట్లకు జనాలు గుడ్‌బై చెప్పేస్తున్నారా?!. కొవిడ్‌ పూర్వ అలవాట్లకు మళ్లుతున్నారు. తగ్గుతున్న హైజీన్, రోగ నిరోధక ఉత్పత్తుల అమ్మకాలు,  ఆయా సెగ్మెంట్స్‌ నుంచి  కంపెనీలు తప్పుకుంటున్న వైనం పరిస్థితి అదేనని చెప్తోంది. 

కరోనా వైరస్‌ మహమ్మారి దెబ్బతో ప్రజల్లో పరిశుభ్రత, ఆరోగ్య సూత్రాలు పాటించడం, రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ప్రాధాన్యమివ్వడం పెరిగింది. మాస్క్‌ల మొదలు.. శానిటైజర్లు, ఫ్లోర్‌ క్లీనర్లు, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారోత్పత్తులు.. తదితర అమ్మకాలు భారీగా జరిగాయి. పాత తరం ఫుడ్డు, అలవాట్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దీంతో ప్రజలు కొత్త(పాత) జీవన విధానానికి క్రమంగా అలవాటు పడిపోతున్నారని, రానున్న రోజుల్లో ఇదే కొనసాగిస్తారనే అభిప్రాయం ఏర్పడింది.  కానీ.. 

కొన్నాళ్లుగా టీకాల ప్రక్రియ వేగవంతమవుతుండటం, ఎకానమీలో ఆర్థిక కార్యకలాపాలు తిరిగి జోరందుకుంటూ ఉండటం వంటి పరిస్థితుల నేపథ్యంలో విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.  ప్రజలు కోవిడ్‌ పూర్వ అలవాట్లకు క్రమంగా మళ్లుతున్నారు. హైజీన్‌ (పరిశుభ్రత), ఆరోగ్య సంరక్షణ, ఇమ్యూనిటీ పెంచే ఫుడ్‌ ప్రొడక్టుల ఉత్పత్తుల అమ్మకాలు మార్కెట్‌లో తగ్గుతుండటమే ఇందుకు నిదర్శనం.  దీనితో గంపెడు ఆశలు పెట్టుకున్న కంపెనీలు..ఈ విభాగాల నుంచి శాశ్వతంగా తప్పుకోవడమో లేదా ఆయా ఉత్పత్తుల తయారీని తగ్గించుకోవడమో చేస్తున్నాయి. ఈ–కామర్స్‌ వంటి అత్యధిక వృద్ధి అవకాశాలు ఉండే మాధ్యమాల్లో కూడా అమ్మకాలు దాదాపు సున్నా స్థాయికి తగ్గిపోవడం మరో విశేషం.

కంపెనీలు వెనక్కి..
శానిటైజర్లు, క్లీనర్ల ఉత్పత్తులకు సంబంధించి కంపెనీలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.  డాబర్, పార్లే ప్రోడక్ట్స్, ఇమామి వంటి కంపెనీలు ఇప్పటికే హ్యాండ్‌ శానిటైజర్‌ విభాగం నుంచి తప్పుకున్నాయి. ఇమామీ నెమ్మదిగా డిస్‌ఇన్‌ఫెక్టెంట్‌ ఫ్లోర్‌ క్లీనర్లు, సర్ఫేస్‌ శానిటైజర్లు, డిష్‌ వాష్‌ జెల్‌ లాంటి సెగ్మెంట్ల నుంచి కూడా తప్పుకుంటోంది. ‘మహమ్మారి తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా ఈ ఉత్పత్తుల అమ్మకాలు గణనీయంగానే ఉంటాయన్న అంచనాలు అన్నీ తప్పుతున్నాయి. వినియోగదారులు నెమ్మదిగా మల్లీ కోవిడ్‌ పూర్వ జీవన విధానాలకు మళ్లుతున్నారు. వీటి వినియోగం దారుణంగా తగ్గిపోయింది’ అని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇక చ్యవన్‌ప్రాశ్‌ మినహా మిగతా ఉత్పత్తుల తయారీని గణనీయంగా తగ్గించుకున్నట్లు ఇమామి సంస్థ వర్గాలు వెల్లడించాయి. 

హెచ్‌యూఎల్‌ ఆశాభావం.. 
ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్‌ యూనిలీవర్‌ కూడా హ్యాండ్‌ శానిటైజర్లు, హ్యాండ్‌ వాష్‌ల విక్రయాలు గణనీయంగా తగ్గినట్లు వెల్లడించింది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు కొత్త అలవాట్లను కొనసాగించగలరని ఆశాభావం వ్యక్తం చేసింది.

చిరువ్యాపారులకు తప్పట్లేదు
బడా కంపెనీల విషయంలోనే కాదు.. చిరువ్యాపారులకు సైతం ఈ ఇబ్బందులు తప్పట్లేదు. పండ్లు, డ్రై ఫ్రూట్స్‌, మసాలా దినుసుల దుకాణాలు కరోనా టైంలో చేసిన భారీ బిజినెస్‌లో ఇప్పుడు సగం కూడా చేయట్లేదు. దీంతో చాలా వరకు దుకాణాలు మూతపడుతున్నాయి. రోడ్‌ సైడ్‌ వెండర్లదీ ఇంతకన్నా దీనస్థితి. మరోవైపు మాంసం అమ్మకాలు సైతం కిందటి ఏడాదితో పోలిస్తే 30 శాతానికి పడిపోయినట్లు గణాంకాలు చెప్తున్నాయి.

చదవండి: దేశంలో భారీగా పెరిగిన ఆదాయ అసమానతలు

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top