వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ కొనసాగింపు.. ఎంప్లాయిస్‌పై నజర్‌! ఎప్పటివరకంటే..

Companies Plan To Continue Work From Home In 2022 Reveals Survey - Sakshi

Work From Home Continue In 2022: ఏడాది ముగింపుతో వర్క్‌ఫ్రమ్‌ హోంకీ ఎండ్‌ కార్డు పడనుందని అంతా భావించారు. ఈలోపే కొత్త వేరియెంట్‌ ‘ఒమిక్రాన్‌’ విజృంభణతో భయాందోళనలు తెర మీదకు వచ్చాయి. అయినప్పటికీ వ్యాక్సినేషన్‌ పూర్తైన ఉద్యోగులను కంపెనీలు ఎలాగైనా ఆఫీసులకు రప్పించి తీరతాయని, 2022 జనవరి నుంచి ఆఫీసులు కరోనాకి ముందు తరహాలో నడుస్తాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో పలు సర్వేలు ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడిస్తున్నాయి. 

గ్రాంట్‌ థోరంటన్‌ భారత్‌ సర్వే ప్రకారం.. దాదాపు 10 కంపెనీల్లో ఆరు కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోం వైపే మొగ్గు చూపిస్తున్నాయి.  సుమారు 65 శాతం కంపెనీ మేనేజ్‌మెంట్‌లు..  ఉద్యోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా.. కరోనా భయంతో వాళ్లలో ఆత్మవిశ్వాసం సడలకుండా ఉండేందుకు వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానాన్నే కంటిన్యూ చేయాలని నిర్ణయించాయి. అయితే మ్యానుఫ్యాక్చరింగ్‌, రవాణా, ఆతిథ్య, వైద్య, ఇతరత్ర అత్యవసర సర్వీసులు మాత్రం వర్క్‌ ఫ్రమ్‌ హోం నుంచి దూరంగానే ఉన్నాయి. మొత్తం 4, 650 రియాక్షన్‌ల ఆధారంగా ఈ సర్వేను పూర్తి చేసింది గ్రాంట్‌ థోరంటన్‌.

మరోవైపు కంపెనీలు నిర్వహించిన అంతర్గత సర్వేల్లోనూ ఉద్యోగులు వర్క్‌ఫ్రమ్‌ హోం వైపే ఆసక్తి చూపిస్తున్నారు. కంపెనీలు కూడా ప్రొడక్టివిటీ పెరగడం, ఆఫీస్‌ స్పేస్‌ భారం తగ్గుతుండడంతో వాళ్లకు తగ్గట్లు నడుచుకోవాలని భావిస్తున్నాయి. పరిస్థితులను బట్టి జూన్‌, 2022 వరకు వర్క్‌ఫ్రమ్‌ హోం కొనసాగించాలని తొలుత అనుకున్న కంపెనీలు,  తాజా నిర్ణయం ప్రకారం.. 2022 మొత్తం వర్క్‌ఫ్రమ్‌ హోంలోనే కొనసాగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో కొన్ని బెనిఫిట్స్‌ను దూరం చేస్తూనే.. వాళ్లకు వర్క్‌ఫ్రమ్‌ హోం వెసులుబాటును కల్పించాలని కొన్ని కంపెనీలు నిర్ణయించాయి. ఈ లెక్కన పూర్తిస్థాయిలో ఉద్యోగుల్ని రప్పించాలని భావిస్తున్న కంపెనీలు కొన్ని మాత్రమే.

చదవండి: వర్క్‌ఫ్రమ్‌ హోం.. గూగుల్‌కు ఉద్యోగుల ఝలక్‌!

ఇప్పటికే కొందరు ఉద్యోగులకు శాశ్వత వర్క్‌ఫ్రమ్‌ హోంను ఇస్తూ.. హైక్‌లు, ఇతర వెసులుబాటులను దూరం చేశాయి. చిన్న, మధ్యస్థ కంపెనీలతో పాటు ఇదే తరహాలో టెక్‌ దిగ్గజ కంపెనీలు కూడా ప్రణాళికలు వేస్తున్నాయి. టీసీఎస్‌ 95 శాతం ఉద్యోగుల్ని వర్క్‌ఫ్రమ్‌ హోంలోనే కొనసాగించాలని, అత్యవసర సిబ్బంది మాత్రమే ఆఫీసులకు రావాల్సి ఉంటుందని పేర్కొన్న విషయం తెలిసిందే. మరోవైపు అమెరికా కేంద్రంగా నడుస్తున్న కంపెనీలు భారత్‌లోని ఉద్యోగులకు ఇప్పటికే సంకేతాలు అందించాయి కూడా. 

పర్యవేక్షణ కోసం!
స్మార్ట్‌హోం డివైజ్‌లను రంగంలోకి దించుతుండడంతో దాదాపు ఇది ఖరారైనట్లేనని టెక్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  ‘హోం ఆఫీసుల’లో ఉద్యోగుల పర్యవేక్షణ కోసమే వీటిని తీసుకురాబోతున్నట్లు, ఈ మేరకు అమెజాన్‌, మెటా, గూగుల్‌ సైతం దరఖాస్తులకు ఉద్యోగుల నుంచి ఆహ్వానం పలికినట్లు సమాచారం. ఒకవేళ దరఖాస్తులు రాకున్నా.. ప్రొత్సాహాకాలను మినహాయించుకుని ఈ ఎక్విప్‌మెంట్‌ అందించాలని(తప్పనిసరి) భావిస్తున్నాయి. ఏది ఏమైనా వర్క్‌ఫ్రమ్‌ హోం కొనసాగింపుపై డిసెంబర్‌ మొదటి వారంలోగానీ, మధ్యలో వరుసబెట్టి ఒక్కో కంపెనీ కీలక ప్రకటన చేసే అవకాశాలు కచ్చితంగా ఉన్నాయి.

చదవండి: వారంలో 3 రోజులే పని.. ఎలా ఉంటుంది?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top