
2025లో ఇప్పటివరకు 2.17 బిలియన్ డాలర్ల చోరీ
చెయినాలిసిస్ నివేదిక
న్యూఢిల్లీ: డిజిటల్ కరెన్సీ ప్రపంచంలో సైబర్ ముప్పులు భారీగా పెరుగుతున్నాయి. గత వారం జరిగిన కాయిన్‌డీసీఎక్స్ హ్యాక్‌లో పోయిన 44 మిలియన్ డాలర్లు సహా క్రిప్టోకరెన్సీ సర్వీసుల కార్యకలాపాలకు సంబంధించి ఈ ఏడాది (2025లో) ఇప్పటివరకు 2.17 బిలియన్ డాలర్ల మేర చోరీలు నమోదయ్యాయి. బ్లాక్‌చెయిన్ అనలిటిక్స్ ప్లాట్‌ఫాం చెయినాలిసిస్ 2025 నివేదిక ప్రకారం గతేడాది మొత్తంతో పోలిస్తే ఈ ఏడాది చోరీలు మరింతగా పెరిగాయి.
2022 మొత్తం సంవత్సరంలో చోరీకి గురైన దానికన్నా, 2025 జూన్ ఆఖరు నాటికి 17 శాతం ఎక్కువ మొత్తాన్ని హ్యాకర్లు దొంగిలించారు. 1.5 బిలియన్ డాలర్ల బైబిట్ హ్యాక్ అనేది క్రిప్టో చరిత్రలోనే ఏకైక భారీ హ్యాక్‌గా నిల్చింది. అంతేగాకుండా ఈ ఏడాది క్రిప్టోసర్వీసుల్లో చోరీకి గురైన మొత్తంలో ఈ కేసు వాటా దాదాపు 69 శాతం ఉంటుంది. ఇక మిగతా వాటిలో సెటస్ ప్రొటోకాల్ ఈ ఏడాది మే నెలలో 200–260 మిలియన్ డాలర్ల మేర నష్టపోగా, జూలైలో బిగ్‌వన్ సంస్థ 27 మిలియన్ డాలర్లు పోగొట్టుకుంది.
ఈ ఏడాది ఇప్పటివరకు అమెరికా, జర్మనీ, రష్యా, కెనడా, జపాన్, ఇండొనేషియా, దక్షిణ కొరియాల్లో హ్యాకింగ్ బాధితులు అత్యధికంగా ఉన్నారు. ప్రాంతీయంగా చూస్తే తూర్పు యూరప్, మధ్యప్రాచ్యం–ఉత్తర ఆఫ్రికా, సీఎస్‌ఏవో (సెంట్రల్, సదరన్ ఆసియా, ఓషియానియా)లో బాధితుల సంఖ్య గతేడాది ప్రథమార్ధంతో పోలిస్తే ఈ ఏడాది ప్రథమార్ధంలో మరింతగా పెరిగింది. వ్యక్తిగత వాలెట్లను టార్గెట్ చేసే వారికన్నా క్రిప్టోసర్వీసులను హ్యాక్ చేసే వారు మరింత అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. గతేడాది క్రిప్టో ఎక్సే్చంజ్ వజీర్‌ఎక్స్ కూడా 230 మిలియన్ డాలర్ల మేర హ్యాకింగ్‌కి గురైంది.