
సీఐఐ గ్రీన్ సిమెంటెక్ ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఉద్గారాలను తగ్గిస్తూ, పర్యావరణహితంగా కార్యకలాపాల నిర్వహణను మెరుగుపర్చుకునే దిశగా సిమెంటు పరిశ్రమ కృషి చేస్తోందని అంబుజా సిమెంట్స్ ఎండీ, గ్రీన్ సిమెంటెక్ 2025 చైర్మన్ అజయ్ కపూర్ తెలిపారు. ఇందుకోసం ప్రత్యామ్నాయ ఇంధనాలు, పునరుత్పాదక విద్యుత్, సాంకేతికత మొదలైన వాటిని వినియోగించుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నట్లు వివరించారు.
బొగ్గు స్థానంలో ఘన వ్యర్ధాలు, ప్లాస్టిక్‌లాంటి ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం ప్రస్తుతం సగటున సుమారు ఆరు–ఏడు శాతం స్థాయిలో ఉన్నట్లు చెప్పారు. సిమెంట్ తయారీ సంస్థల అసోసియేషన్‌తో (సీఎంఏ) కలిసి పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహిస్తున్న సీఐఐ గ్రీన్ సిమెంటెక్ 21వ ఎడిషన్ ప్రారంభం సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు వినూత్న వ్యూహాలు, కార్యక్రమాలపై ప్రధానంగా ఫోకస్‌తో ఇది రెండు రోజుల పాటు సాగుతుంది.
గత కొన్నేళ్లుగా కర్బన ఉద్గారాలు గణనీయంగా తగ్గినట్లు సాగర్ సిమెంట్స్ జాయింట్ ఎండీ ఎస్. శ్రీకాంత రెడ్డి తెలిపారు. తటస్థ ఉద్గారాల స్థాయికి ప్రభుత్వం నిర్దేశించిన గడువుకు పదేళ్లు ముందుగానే లక్ష్యాన్ని సాధించేందుకు సంస్థలు ప్రయత్నిస్తున్నాయని వివరించారు. సరి్టఫై చేసిన హరిత ఉత్పత్తులు, ప్రోత్సాహకాల కారణంగా పర్యావరణహిత భవంతుల నిర్మాణం పుంజుకుంటోందని ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ జాతీయ వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి తెలిపారు.