Chinese Hackers Target SBI Customers Via Fake KYC Link And Free Gift Scams - Sakshi
Sakshi News home page

ఎస్‌బీఐ కస్టమర్లకు హెచ్చరిక..!

Published Thu, Jul 8 2021 4:00 PM

Chinese Hackers Target SBI Customers With Fake KYC Link Free Gift Scams - Sakshi

ముంబై: చైనాకు చెందిన హాకర్లు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) ఖాతాదారులను లక్ష్యంగా చేసుకొని​ వారిపై సైబర్‌దాడులకు పాల్పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఖాతాదారులకు కెవైసీని అప్‌డేట్‌ చేయాలని హ్యకర్లు ఒక వెబ్‌సైట్‌ లింక్‌ పంపుతున్నారని తెలిసింది. అంతేకాకుంగా రూ. 50 లక్షల విలువైన ఉచిత బహుమతులను సొంతం చేసుకోండి అంటూ వాట్సాప్‌లో ఖాతాదారులకు సందేశాలను పంపుతున్నారు. హ్యకర్లు పంపిన సందేశాలకు రిప్లై ఇస్తే అంతే సంగతులు..!  ఖాతాదారుల విలువైన సమాచారాన్ని దోచుకోవడమే కాకుండా డబ్బులను ఖాతాల నుంచి ఊడ్చేస్తారని సైబర్‌ సెక్యూరిటీ అధికారులు హెచ్చరించారు.

న్యూఢిల్లీకి చెందిన థింక్‌ట్యాంక్‌ సైబర్‌పీస్‌ పౌండేషన్‌ పరిశోధనా విభాగం, ఆటోబోట్‌ ఇన్ఫోసెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ వారు కొంతమంది స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులు ఫిషింగ్‌ సమస్యను ఎదుర్కొంటున్నారని వారి అధ్యయనంలో వెల్లడించారు. ఎస్‌బీఐ ఖాతాదారులకు కెవైసీ ధృవీకరణ చేయాలని చెప్పి, ఫోన్లకు మెసేజ్‌లను పంపుతున్నారని గుర్తించారు. ఈ మెసేజ్‌ను ఓపెన్‌ చేస్తే అధికారిక ఎస్‌బీఐ ఆన్‌లైన్‌ సైట్‌ పేజీని పోలి ఉన్న వెబ్‌సైట్‌ ఓపెన్‌ అవుతోంది. ఇది యూజర్ మొబైల్ నంబర్‌కు ఓటీపీని పంపి, ఎంటర్‌ చేయగానే ఖాతాదారులు వ్యక్తిగత వివరాలను హాకర్లు సేకరిస్తున్నారని ఈ బృందం గుర్తించింది.

నకిలీ ఎస్‌బీఐ వెబ్‌సైట్‌తో ఖాతాదారులను దారిమళ్లించి వారి సమాచారాన్ని హాకర్లు పొందుతున్నారు. మరో సందర్భంలో..ఖాతాదారులకు ఆకర్షణీయమైన ఉచిత బహుమతులు అందిస్తామంటూ వాట్సాప్‌లో సందేశాలను హాకర్లు పంపిస్తున్నారు. ఈ సర్వేలో పాల్గొంటే రూ. 50 లక్షల విలువైన బహుమతులు మీ సొంతం అంటూ హాకర్లు ఖాతాదారులను దారి మళ్లించి వారి విలువైన సమాచారాన్ని లాగేసుకుంటున్నారని తెలిసింది. కాగా ఎస్‌బీఐ యూజర్లకే కాకుండా ఐడీఎఫ్‌సీ, పీఎన్‌బీ, ఇండస్‌ఇండ్‌, కోటక్‌ బ్యాంక్‌ ఖాతాదారులపై ఫిషింగ్‌ స్కామ్‌ పాల్పడుతున్నట్లు  తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో ఎస్‌మీఐ కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని ఫిషింగ్‌ కుంభకోణానికి పాల్పడినట్లుగా పరిశోధన బృందం నిర్ధారించింది.

Advertisement
Advertisement