రాష్ట్రాలకు రూ.1.1 లక్షల కోట్లు

Centre to borrow Rs1.1 lakh crore on behalf of States - Sakshi

జీఎస్‌టీ పరిహార లోటు భర్తీకి రుణ సమీకరణ

రాష్ట్రాల తరఫున కేంద్రమే తీసుకుంటుంది

కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్‌ ప్రకటన

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) కింద రాష్ట్రాలకు ఆదాయలోటును పూడ్చేందుకు కేంద్రమే రుణ సమీకరణ చేసేందుకు ముందుకు వచ్చింది. జీఎస్‌టీ వసూళ్లలో లోటు కారణంగా.. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం పరిహారాన్ని సర్దుబాటు చేయాల్సి ఉంది. అయితే, ఈ మొత్తాన్ని మార్కెట్‌ నుంచి రుణాల రూపంలో రాష్ట్రాలే తీసుకోవాలని కేంద్రం కోరగా.. కేంద్రం తన పద్దుల కిందే తీసుకుని తమకు నిధులు సమకూర్చాలని కొన్ని రాష్ట్రాలు డిమాండ్‌ చేశాయి. అయితే, రాష్ట్రాల తరఫున రుణ సమీకరణకు కేంద్రం నిర్ణయించింది.

రూ.1.1 లక్షల కోట్లను రాష్ట్రాల తరఫున కేంద్ర ప్రభుత్వం రుణం కింద సమీకరించి వాటికి సర్దుబాటు చేస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం ప్రకటించారు. కరోనా వైరస్‌ కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లో జీఎస్‌టీ వసూళ్లు ఆశించిన మేర లేవన్న విషయం తెలిసిందే. కరోనా ముందు నుంచే దేశ ఆర్థిక వ్యవస్థ మందగించడం కూడా వసూళ్లపై ప్రభావం చూపించింది. దీంతో రాష్ట్రాల బడ్జెట్‌లపై ప్రభావం పడింది. జీఎస్‌టీ ముందు అయితే లోటును భర్తీ చేసుకునేందుకు వ్యాట్, స్థానిక పన్నులను రాష్ట్రాలు అస్త్రాలుగా వినియోగించుకునేవి. కానీ, ఇప్పుడు ఆ అవకాశాలు చాలా పరిమితం.

‘‘లోటును భర్తీ చేసుకునేందుకు రాష్ట్రాల బడ్జెట్‌ పరిమితులకు అదనంగా రూ.1.1 లక్షల కోట్ల మేర రుణ సమీకరణకు ప్రత్యేక విండోను ఆఫర్‌ చేశాము. అంచనా లోటు రూ.1.1 లక్షల కోట్లను అన్ని రాష్ట్రాల తరఫున కేంద్ర ప్రభుత్వమే రుణాలుగా.. పలు విడతల్లో తీసుకుంటుంది. జీఎస్‌టీ పరిహారం కింద ఆయా రుణాలను రాష్ట్రాలకు బదిలీ చేస్తాము’’ అని మంత్రి సీతారామన్‌  పేర్కొన్నారు. అయితే, ఈ రుణాలకు వడ్డీ, అసలు చెల్లింపులు ఎవరు చేస్తారన్న విషయాన్ని ఇందులో ప్రస్తావించలేదు. రాష్ట్రాల తరఫున కేంద్ర ప్రభుత్వం రుణాలు తీసుకోవడం వల్ల ఒకటే వడ్డీ రేటుకు వీలు పడుతుందని కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ప్రత్యేక విండో కింద రుణ సమీకరణ ద్రవ్యలోటుపై ఏ మాత్రం ప్రభావం చూపించదని స్పష్టం చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి



 

Read also in:
Back to Top