పెండింగ్‌ డీల్స్‌కు మోక్షం..  ఆరు ఒప్పందాలకు సీసీఐ ఆమోదం

CCI Approves Six Deals - Sakshi

న్యూఢిల్లీ: దాదాపు మూడు నెలల విరామం తర్వాత కాంపిటీషన్‌ కమిషన్‌ (సీసీఐ) విలీనాలు, కొనుగోలు ఒప్పందాలను పరిశీలించడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆరు డీల్స్‌కు ఆమోదం తెలిపింది. కీమెడ్‌లో 20 శాతం వాటాను ప్రైమ్‌ టైమా లాజిస్టిక్స్‌ టెక్నాలజీస్‌ ద్వారా అపోలో హాస్పిటల్స్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ శోభనా కామినేని కొనుగోలు చేస్తుండటం, లాంకో అన్పారా పవర్‌ (ఎల్‌ఏపీఎల్‌)ను మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా (ఎంఈఐఎల్‌) కొనుగోలు చేయడానికి సంబంధించిన ఒప్పందాలు వీటిలో ఉన్నాయి.

కీమెడ్‌ ప్రధానంగా ఔషధాల హోల్‌సేల్‌ విక్రయం, పంపిణీ వ్యాపారం చేస్తోంది. అటు హంట్స్‌మాన్‌ ఇంటర్నేషనల్‌ను ఆర్చ్‌రోమా ఆపరేషన్స్‌ కొనుగోలు చేయడం, హీరో ఫ్యూచర్‌ ఎనర్జీస్‌ గ్లోబల్‌లో ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ కేకేఆర్‌ వాటాలు దక్కించుకోవడం, హిందుస్తాన్‌ పోర్ట్స్‌లో నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ (ఎన్‌ఐఐఎఫ్‌) వాటాలు తీసుకోవడానికి సంబంధించిన ఒప్పందాలు కూడా ఉన్నాయి. దీనితో నవంబర్‌ 3 వరకు పెండింగ్‌లో ఉన్న డీల్స్‌ను సీసీఐ క్లియర్‌ చేసినట్లయింది.

సాధారణంగా నిర్దిష్ట పరిమితి దాటిన ఒప్పందాలకు సీసీఐ ఆమోదముద్ర అవసరమవుతుంది. అయితే, 2022 అక్టోబర్‌ 25న చైర్‌పర్సన్‌ అశోక్‌ కుమార్‌ గుప్తా రిటైరైన తర్వాత కోరం లేకపోవడంతో సీసీఐ విలీన, కొనుగోలు డీల్స్‌ పరిశీలన చేపట్టలేదు. ఫలితంగా పలు డీల్స్‌ పెండింగ్‌లో పడిపోయిన నేపథ్యంలో కేంద్రం నిర్దిష్ట నిబంధనను అమల్లోకి తేవడంతో పరిశీలన మళ్లీ మొదలైంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top