బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటులో కీలక అడుగు

Cabinet clears proposal for govt guarantee to bad bank - Sakshi

ప్రభుత్వ గ్యారంటీకి కేబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ మొండి బకాయిల (ఎన్‌పీఏ) పరిష్కారంలో భాగంగా  ప్రతిపాదిత బ్యాడ్‌ బ్యాంక్‌ లేదా నేషనల్‌ అసెట్‌ రికన్‌స్ట్రక్షన్‌ కంపెనీ (ఎన్‌ఏఆర్‌సీఎల్‌) ఏర్పాటు దిశలో కీలక అడుగు పడింది. ఎన్‌ఏఆర్‌సీఎల్‌ జారీ చేసే సెక్యూరిటీ రిసిప్ట్స్‌కు ప్రభుత్వం గ్యారంటీగా ఉండే ప్రతిపాదనకు ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని క్యాబినెట్‌ సమావేశం బుధవారం ఆమోదముద్ర వేసింది.  తాజా నిర్ణయంతో ఎన్‌ఏఆర్‌సీఎల్‌ జారీ చేసే సెక్యూరిటీ రిసిట్స్‌కు  సావరిన్‌ (ప్రభుత్వ) గ్యారంటీ లభించనుంది.

ప్రభుత్వ గ్యారెంటీ తొలి దశలో దాదాపు రూ.31,000 కోట్లు ఉంటుందని బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు బాధ్యతలను పర్యవేక్షిస్తున్న ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) అంచనావేస్తోంది. మొండిబకాయికి సంబంధించి ఆమోదిత విలువలో 15 శాతం ఎన్‌ఏఆర్‌సీఎల్‌ నగదులో చెల్లిస్తుంది. మిగిలిన 85 శాతం ప్రభుత్వ హామీతో కూడిన సెక్యూరిటీ రిసిప్‌్ట్స’ ఉంటాయని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొంటున్నాయి. ఏదైనా ఎన్‌పీఏ కొనుగోలుకు సంబంధించి ప్రవేశ విలువలో  నష్టం జరిగితే ప్రభుత్వ హామీ భరోసాగా ఉంటుంది.  

లైసెన్స్‌కు ఇప్పటికే దరఖాస్తు..
రూ.6,000 కోట్ల బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు సంబంధించి లైసెన్స్‌కు ఐబీఏ గతవారం ఆర్‌బీఐని సంప్రదించింది. వచ్చే రెండు నెలల్లో ఈ లైసెన్స్‌ జారీ అవకాశం ఉంది. ఎన్‌ఏఆర్‌సీఎల్‌ ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా 51 శాతంగా ఉండనుంది. మిగిలిన వాటాను ప్రైవేటు రంగ బ్యాంకులు కలిగిఉంటాయి. ఎన్‌ఏఆర్‌సీఎల్‌లో 12 శాతం వాటాతో లీడ్‌ స్పాన్సర్‌గా ఉందామన్న ఆకాంక్షను ప్రభుత్వ రంగ కెనరాబ్యాంక్‌ వ్యక్తం చేసింది. తొలి దశలో బ్యాడ్‌ బ్యాంక్‌కు బదలాయించడానికి 22 మొండి బకాయిలను గుర్తించినట్లు సమాచారం. వీటి విలువ దాదాపు రూ.89,000 కోట్లు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top