బర్గర్‌ కింగ్‌ ఐపీవో.. స్పందన సూపర్‌ | Burger King IPO attracts 158 times subscription | Sakshi
Sakshi News home page

బర్గర్‌ కింగ్‌ ఐపీవో.. స్పందన సూపర్‌

Dec 5 2020 9:01 AM | Updated on Dec 5 2020 10:09 AM

Burger King IPO attracts 158 times subscription - Sakshi

ముంబై, సాక్షి: అంతర్జాతీయ ఫాస్ట్‌ఫుడ్‌(QSR) చైన్ల దిగ్గజం బర్గర్‌ కింగ్‌ పబ్లిక్‌ ఇష్యూకి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఇష్యూ చివరి రోజుకి దాదాపు 157 రెట్లు అధికంగా సబ్‌స్క్రిప్షన్‌ లభించింది. రిటైల్‌ విభాగంలో 68 రెట్లు అధికంగా స్పందన లభించింది. సంపన్నవర్గాల(హెచ్‌ఎన్ఐలు) నుంచి ఏకంగా 354 రెట్లు ఎక్కువగా బిడ్స్‌ దాఖలయ్యాయి. ఇక సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి సైతం 87 రెట్లు దరఖాస్తులు వచ్చినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల డేటా వెల్లడించింది. వెరసి 7.44 కోట్ల షేర్లను కంపెనీ అమ్మకానికి ఉంచగా.. శుక్రవారానికల్లా మొత్తం 1,167 కోట్ల షేర్ల కోసం బిడ్స్‌ దాఖయ్యాయి. రూ. 59-60 ధరల శ్రేణిలో చేపట్టిన ఐపీవో ద్వారా కంపెనీ రూ. 810 కోట్లను సమకూర్చుకుంది. ఇష్యూ నిధులలో కొంతమేర బర్గర్‌ కింగ్‌ రెస్టారెంట్స్‌ పేరుతో కొత్త కంపెనీ ఏర్పాటుకు వినియోగించనున్నట్లు మాతృ సంస్థ ప్రాస్పెక్టస్‌లో పేర్కొంది. అంతేకాకుండా స్టోర్ల విస్తరణకూ వినియోగించనుంది. ఇష్యూకి ముందు రోజు కంపెనీ యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ. 364 కోట్లకుపైగా సమకూర్చుకున్న సంగతి తెలిసిందే. 

ఐదేళ్లలో.. 
గ్లోబల్‌ క్యూఎస్‌ఆర్‌ చైన్‌ సంస్థ బర్గర్‌ కింగ్‌ దేశీయంగా ఐదేళ్లక్రితం ఏర్పాటైంది. ఈ ఐదేళ్లలో రెస్టారెంట్ల ఏర్పాటురీత్యా వేగంగా వృద్ధి చెందుతూ వచ్చింది. మాస్టర్‌ ఫ్రాంచైజీ ఒప్పందాల ద్వారా బర్గర్‌ కింగ్‌ బ్రాండును దేశీయంగా విస్తరిస్తోంది. అంతర్జాతీయంగా బర్గర్‌ బ్రాండ్లలో నెట్‌వర్క్‌ రీత్యా ఈ కంపెనీ రెండో ర్యాంకులో నిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18,000 రెస్టారెంట్లు కలిగి ఉంది. 2020 సెప్టెంబర్‌కల్లా దేశీయంగా 261 రెస్టారెంట్లను ఏర్పాటు చేసింది. ఫ్రాంచైజీలతో కలిపి దేశవ్యాప్తంగా 57 పట్టణాలలో విస్తరించింది. 2017లో రూ. 233 కోట్లుగా నమోదైన ఆదాయం 2019కల్లా రూ. 633 కోట్లకు జంప్‌చేసింది. ఇదే సమయంలో నష్టాలు రూ. 72 కోట్ల నుంచి రూ. 38 కోట్లకు తగ్గాయి. కాగా.. జూబిలెంట్‌ ఫుడ్‌వర్క్స్‌, వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌ కంపెనీలను దేశీయంగా లిస్టయిన ప్రధాన ప్రత్యర్ధి సంస్థలుగా పేర్కొనవచ్చు. జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్‌.. డోమినోస్‌ పిజ్జా రెస్టారెంట్లను నిర్వహిస్తుంటే.. వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌..  మెక్‌డొనాల్డ్‌ రెస్టారెంట్లను నిర్వహిస్తున్న విషయం విదితమే.

Advertisement
 
Advertisement
Advertisement