క్రూడాయిల్ ధరలు అదే స్థాయిలో ఉంటే జీడీపీపై ప్రభావం..

Burden will be shared if oil remains above 110 a barrel says CEA Nageswaran amid rising fuel prices - Sakshi

న్యూఢిల్లీ: ప్రైవేటు రంగంలో మూలధన వ్యయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం నుంచి (2022అక్టోబర్‌–2023 మార్చి) మెరుగుపడతాయన్న ఆశాభావాన్ని ప్రధాన ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్‌ మంగళవారం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. 

కార్పొరేట్‌ పన్ను తగ్గింపుతో సహా అనేక చర్యలు తీసుకున్నప్పటికీ, ప్రైవేట్‌ రంగం నుండి పెట్టుబడులు గత పలు సంవత్సరాలుగా ఊపందుకోని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (ఏఐఎంఏ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో అనంత నాగేశ్వరన్‌ చేసిన

ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...

  • సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) బ్యాంకింగ్‌ రుణం పుంజుకోవడం ప్రారంభమైంది. అందువల్ల, బహుశా రెండవ త్రైమాసికం చివరి నాటికి లేదా సంవత్సరం రెండవ అర్ధభాగంలో ప్రైవేట్‌ రంగం మూలధన వ్యయం భారీగా పెరుగుతాయని నేను భావిస్తున్నాను.
  • ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో 2022–23 ఆర్థిక సంవత్సరానికి క్యాపెక్స్‌ (మూలధన వ్యయం)ను 35.4 శాతం పెంచారు. దీనితో ఈ విలువ రూ. 7.5 లక్షల కోట్లకు పెరిగింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో క్యాపెక్స్‌ రూ. 5.5 లక్షల కోట్లు. ఇది పెట్టుబడుల పురోగతికి దారితీసే అంశం. 
  • రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) సర్వే ప్రకారం పరిశ్రమ సామర్థ్య వినియోగం 68% నుంచి 74 శాతానికి పెరిగింది.  పలు రంగాల్లోని తొలి దిగ్గజ నాలుగు సంస్థలు ఇప్పటికే 80 శాతానికి పైగా సామర్థ్యంతో పనిచేస్తున్నాయి.
  • దీర్ఘకాలిక ఆకాంక్షలు,  స్థూల ఆర్థిక స్థిరత్వం, వివేకవంతమైన బడ్జెట్, పారదర్శకత, మూలధన వ్యయంపై దృష్టి వంటి పలు అంశాలు ఎకానమీని తగిన బాటలో సమతౌల్యతతో నడుపుతూ వృద్ధికి దోహదపడతాయి.
  • పేదలకు ఉపశమనం కలిగించేందుకు, ప్రభుత్వం ఉచిత ఆహార కార్యక్రమాన్ని మరో ఆరు నెలలు పొడిగించింది. దీని వల్ల ఖజానా నుంచి దాదాపు రూ. 80,000 కోట్లు (జీడీపీలో 0.65 శాతం) వ్యయం అవుతుంది.   పేద ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించే ప్రధాన్‌ మంత్రి గరీబ్‌ కళ్యాణ్‌ యోజన (పీఎంజీకేఏవై)వల్ల భారత్‌లో పేదరికం తీవ్రత తగ్గిందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) సంస్థ ఇటీవలే విశ్లేషించింది. ఈ  పథకం వల్ల కోవిడ్‌–19 మహమ్మారిని ఎదుర్కొన్న 2020 సమయంలో భారత్‌లో తీవ్ర పేదరికం 0.8 శాతం వద్ద కనిష్ట స్థాయిలో కొనసాగిందని ఒక వర్కింగ్‌ పేపర్‌లో పేర్కొంది. మార్చి 2020లో ప్రారంభించిన ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నెలకు 5 కిలోల ఆహారధాన్యాలను ఉచితంగా అందిస్తోంది.  సాధారణ కోటా కంటే ఎక్కువగా అదనపు ఉచిత ధాన్యాన్ని జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) కింద అందించడం జరుగుతోంది. కిలోగ్రాముకు రూ. 2 నుంచి రూ.3 వరకూ అధిక సబ్సిడీ రేటుతో ఈ ప్రయోజనాన్ని పేదలకు కేంద్రం అందిస్తోంది. 2022 సెప్టెంబర్‌ వరకూ ఈ పథకాన్ని పొడిగించింది. 
  • ప్రైవేట్‌ రంగంలో బ్యాలెన్స్‌ షీట్‌ పటిష్టంగా ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రికత్తలు, ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు వంటి ప్రతికూలాంశాలను ఇది భర్తీ చేస్తుంది. 2022–23 ద్వితీయార్థంలోకి వెళుతున్నప్పుడు, మనకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. 2003–2012 మధ్య కాలంలో మనం సాధించిన అధిక వృద్ధిని మరింత స్థిరమైన రూపంలో మళ్లీ చూడగలుగుతామన్న విశ్వాసం ఉంది. 
  • భౌగోళిక రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ తన ద్రవ్య విధానాన్ని కఠిన తరం చేయడం ప్రస్తుతం ప్రధాన సవాళ్లు. మొండిబకాయిల సమస్య పరిష్కారం దిశలో చర్యలు, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం ప్రస్తుతం దృష్టి సారించాల్సిన అంశాలు. 
  • గడిచిన ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 2021 ఏప్రిల్‌ నుంచి 2022 మార్చి వరకు పన్నుల రూపంలో ఖజానాకు రూ.27.07 లక్షల కోట్లు (అంచనాలు రూ. 22.11 లక్షల కోట్లు) వచ్చి చేరాయి. బడ్జెట్‌ అంచనాలను మించి ఇవి నమోదు కావడం విశేషం. ఇదే ధోరణి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కూడా కొనసాగుతుందని భావిస్తున్నాం.

చమురు ధరలు దీర్ఘకాలం పాటు బ్యారల్‌కు 100 డాలర్ల పైనుంటే, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంకెలపై దీని ప్రభావం పడే వీలుందని సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్‌ పేర్కొన్నారు. ఈ అంచనాలను తగ్గించాల్సి రావచ్చని కూడా సూచించారు. ఎకనమిక్‌ సర్వే ప్రకారం, 2022–23లో ఆర్థికాభివృద్ధి 8 నుంచి 8.5  శ్రేణిలో ఉండవచ్చని(ఇంతక్రితం అంచనా 9.2 శాతం) ఆయన అన్నారు. క్రూడ్‌ ఆయిల్‌ ధరల తీవ్రత, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో సరఫరాల కొరతల వల్ల ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు క్రితం 7.8   శాతం అంచనాలను గత వారం ఆర్‌బీఐ పాలసీ సమావేశాలు 7.2 శాతానికి కుదించిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top