
జీడీపీ సంస్కరణలు ఆదుకుంటాయ్
సీఈఏ అనంత నాగేశ్వరన్
భారత జీడీపీపై నికరంగా పడే ప్రభావంపై అంచనా
అమెరికా టారిఫ్‌ల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీపై నికరంగా పడే ప్రభావం 0.2–0.3 శాతం వరకు ఉండొచ్చని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్ అంచనా వేశారు. అయితే జీఎస్‌టీలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశీ డిమాండ్‌ను పెంచడం ద్వారా ఈ ప్రభావాన్ని భర్తీ చేస్తాయని అభిప్రాయపడ్డారు.
ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద అమెరికాకు చేసిన ఎగుమతుల్లో సగం మేర ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఐదు నెలల్లోనే నమోదైనట్టు గుర్తు చేశారు.
సుంకాలు స్వల్పకాలమే గానీ, దీర్ఘకాలం పాటు కొనసాగకపోవచ్చన్నారు. ఒకవేళ దీర్ఘకాలం పాటు కొనసాగితే అప్పుడు ద్వితీయ, తృతీయ అంచ ప్రభావాలు ప్రస్ఫుటంగా కనిపిస్తాయంటూ.. పెట్టుబడులు, మూలధన వ్యయాలు, ఆర్థిక వ్యవస్థ సెంటిమెంట్‌పై దీని తాలూకూ అనిశ్చితి ఉంటుందని చెప్పారు.
అయితే, జీఎస్‌టీలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశీయంగా బలమైన వినియోగ సృష్టి ద్వారా టారిఫ్‌ల తాలూకూ ద్వితీయ, తృతీయ అంచ ప్రభావాలను అధిగమించేందుకు సాయపడతాయన్నారు. కనుక మొత్తం మీద జీడీపీపై పడే ప్రభావం 0.3 శాతం మించి ఉండదన్నారు. 2025–26 సంవత్సరానికి 6.3–6.8% మధ్య జీడీపీ వృద్ధి నమోదు కావొచ్చన్న తమ అంచనాలను గుర్తు చేశారు.
సాగులో సంస్కరణలు..
వ్యవసాయ రంగం జీడీపీకి మరో 0.5–0.70 శాతం వరకు తోడ్పాటునివ్వగలదని నాగేశ్వరన్ తెలిపారు. ఇందుకు గాను రైతులు వారు కోరుకున్న చోట విక్రయించే హక్కు అవసరమన్నారు. ప్రకృతి విపత్తులపై సాగు దిగుబడులు ఆధారపడి ఉన్నందున వారికి బీమా రూపంలోనూ దన్నుగా నిలవాలన్నారు. ప్రపంచ వాణిజ్యం విషయంలో అంతర్జాతీయ కరెన్సీగా ఉన్న డాలర్ స్థానాన్ని భర్తీ చేసే ఎలాంటి ప్రతిపాదన లేదని సీఈఏ అనంత నాగేశ్వరన్ స్పష్టం చేశారు.
అటువంటి చర్యలో భారత్ పాలుపంచుకోదని ఓ ప్రశ్నకు సమాధనంగా చెప్పారు. డాలర్‌కు మెరుగైన ప్రత్యామ్నాయం ప్రస్తుతానికి లేదంటూ.. ఇందుకు చాలా కాలం పట్టొచ్చన్నారు. గతేడాది జరిగిన బ్రిక్స్ సదస్సులో భాగస్వామ్య దేశాల మధ్య వాణిజ్యానికి స్థానిక కరెన్సీల్లో చెల్లింపులకు, ప్రత్యేకంగా బ్రిక్స్ కరెన్సీ ఏర్పాటుకు అంగీకారం కుదరడం గమనార్హం.