చార్జర్లు లేకుండానే ఫోన్ల విక్రయం!

Budget Phones to Cost More And More Companies to Sell Without Chargers - Sakshi

పెరగనున్న మోడళ్ల ధర 

బడ్జెట్‌ ఫోన్స్‌పై బడ్జెట్‌ ఎఫెక్ట్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పన్ను పెరిగిన స్థాయిలోనే మొబైల్స్‌ ధరలూ అధికం కానున్నాయి. ముఖ్యంగా తక్కువ ధరలో లభించే స్మార్ట్‌ఫోన్లపై దీని ప్రభావం ఎక్కువగా ఉండనుంది. బడ్జెట్‌ ఫోన్లను అతి తక్కువ లాభాలపై కంపెనీలు విక్రయిస్తున్నాయి. పన్ను భారాన్ని మోసే స్థాయిలో వీటి తయారీ కంపెనీలు లేవు. దీంతో అంతిమంగా కస్టమర్‌పైనే భారం పడనుంది. అయితే కంపెనీలు చార్జర్లు లేకుండానే మొబైల్స్‌ను విక్రయించే అవకాశం ఉంది. ఇప్పటికే పలు కంపెనీలు ఎంపిక చేసిన మోడళ్లపై ఈ విధానాన్ని అమలు చేస్తున్నాయి కూడా అని టెక్నోవిజన్‌ ఎండీ సికందర్‌ తెలిపారు. దేశీయంగా చాలా సంస్థలు చార్జర్లను స్థానికంగా తయారు చేస్తున్నాయి. స్వల్పంగా ధరలు అధికమైనప్పటికీ మొబైల్స్‌ అమ్మకాలు తగ్గే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.  

ప్రతిపాదనలకు వ్యతిరేకంగా..
మొబైల్స్‌ విడిభాగాలు, చార్జర్ల తయారీకి కావాల్సిన కొన్ని పరికరాలపై సుంకం విధించడాన్ని ఎలక్ట్రానిక్స్‌ పరిశ్రమ తీవ్రంగా వ్యతిరేకించింది. తమ ప్రతిపాదనలకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారని ఇండియా సెల్యులార్, ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) చైర్మన్‌ పంకజ్‌ మొహింద్రూ అన్నారు.

 మొబైల్‌ ఫోన్ల రేట్లు స్వల్పంగా పెరగనున్నాయి. మొబైల్స్‌లో వాడే కొన్ని విడిభాగాలు, చార్జర్ల తయారీకి ఉపయోగించే కొన్ని పరికరాలపై 2.5 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నట్టు బడ్జెట్‌లో ప్రకటించారు. అలాగే మదర్‌బోర్డ్‌గా పిలిచే ప్రింటెడ్‌ సర్క్యూట్‌ బోర్డ్‌ అసెంబ్లీ (పీసీబీఏ), కెమెరా మాడ్యూల్స్, కనెక్టర్స్, వైర్డ్‌ హెడ్‌ సెట్స్, యూఎస్‌బీ కేబుల్, మైక్రోఫోన్, రిసీవర్లపైనా 2.5% కస్టమ్స్‌ డ్యూటీ విధించారు. మొబైల్‌ చార్జర్లపై ఏకంగా 10% దిగుమతి సుంకం ప్రకటించారు.  చార్జర్‌/అడాప్టర్ల తయారీకి ఉపయోగించే మౌల్డెడ్‌ ప్లాస్టిక్‌ ముడి పదార్థాలు, విడిభాగాలపై 10% సుంకం వసూలు చేయనున్నారు. చార్జర్ల పీసీబీఏ ముడిపదార్థాలు, విడిభాగాలపై సుంకం 10% అధికమైంది. పెంచిన సుంకం.. చార్జర్లు, మొబైల్‌ ఫోన్‌ విడిభాగాలపై ఫిబ్రవరి 2  నుంచి, మిగిలినవాటిపై ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి రానుంది.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top