ఆదాయపు పన్ను లెక్కించేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు..

Brief Detail About Income Tax Rules And Regulations By Experts - Sakshi

ఆదాయపు పన్ను భారం లెక్కించేటప్పుడు సొంత ఖర్చులు/ఇంటి ఖర్చులను మినహాయించుకోవచ్చా? ఈ ప్రశ్నకు నిపుణులు ఏమంటున్నారంటే.. ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయాలన్నీ కలిపిన మొత్తం ఆదాయంపై పన్ను భారం ఉంటుంది. ఆదాయాలన్నింటినీ ఐదు శీర్షికల కింద వర్గీకరించారు. జీతాలు, ఇంటి మీద అద్దె, వ్యాపారం/వృత్తి మీద ఆదాయం, మూలధన లాభాలు, ఇతర ఆదాయాలు.

ఈ అయిదింటిని లెక్కించే విధానంలో ఏయే శీర్షిక కింద ఏయే మినహాయింపులు ఇవ్వాలో నిర్దేశించారు. జీతంలో నుంచి స్టాండర్డ్‌ డిడక్షన్, వృత్తి పన్ను మినహాయిస్తారు. ఇంటి అద్దెలో నుంచి 30 శాతం మొత్తం రిపేరు కింద తగ్గిస్తారు. వ్యాపారం/వృత్తిగత ఆదాయంలో నుంచి సంబంధిత ఖర్చులను మాత్రమే తగ్గిస్తారు. అందుకే ఈ మినహాయింపుల విషయంలో పూర్తిగా తెలుసుకోకపోతే పన్నుదారులకు పర్సులో నగదుపై ప్రభావం పడుతుంది.

అలాగే మూలధన లాభాలు లెక్కించేటప్పుడు ఆస్తి కొన్న విలువ, బదిలీ కోసం అయిన ఖర్చు, ఇతర ఆదాయాలు లెక్కించేటప్పుడు సంబంధిత ఖర్చులే మినహాయిస్తారు. సంబంధించిన ఖర్చులుంటే నిర్వహణ నిమిత్తం ఖర్చు పెట్టాలి. ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ సంబంధం ఉండాలి. సమంజసంగా ఉండాలి. సరైనవి ఉండాలి. రుజువులు ఉండాలి. పైన చెప్పిన వివరణ ప్రకారం ఏ శీర్షిక కిందనైనా స్వంత ఖర్చులు, వ్యక్తిగత ఖర్చులు, ఇంటి ఖర్చులకు మినహాయింపు లేదు. వ్యాపారం/వృత్తి నిర్వహణలో చాలామంది అన్ని ఖర్చులు కలిపేస్తుంటారు.

కరెంటు చార్జీలు, పెట్రోల్, టెలిఫోన్, సెల్‌ఫోన్, పనివాళ్ల మీద ఖర్చు, విరాళాలు, దేవుడికి పూజలు, దేవుడికి కానుకలు, మొక్కుబడులు, తిరుపతి యాత్ర .. తీర్థయాత్రలు .. విహారయాత్రలు.. పార్టీలు, విలాసాలు, క్లబ్బు ఖర్చులు, ఇంటి పేపరు ఖర్చు, షాపుల నుండి .. దుకాణాల నుండి ఇంటికి పంపే వస్తువులు .. సొంత వాడకాలు.. ఇలా ఎన్నో ఉదాహరణగా చెప్పవచ్చు. ఇలాంటి ఖర్చులన్నీ స్వంత ఖర్చులుగా, వ్యక్తిగత ఖర్చులుగా పరిగణిస్తారు. అవి వ్యాపార సంబంధమైనవి కావు.. వ్యాపారానికి ఎటువంటి అవసరం లేదు. అందువల్ల ఇటువంటి ఖర్చులన్నీ మినహాయించరు. మనం వీటిని వ్యాపార ఖర్చులుగా చూపించడం సమంజసమూ కాదు. 

ఇంటి విషయంలో రిపేరు విషయంలో మీరు ఖర్చు పెట్టకపోయినా, ఎంత ఎక్కువ ఖర్చు పెట్టినా కేవలం 30 శాతం మాత్రమే మినహాయిస్తారు. అలాగే ఉద్యోగస్తులకు స్టాండర్డ్‌ డిడక్షన్‌ విషయం. ఇది ఆఫీసుకు వెళ్లి రావడం నిమిత్తం ఇచ్చిన మినహాయింపు. మీ ఆఫీసు ఇంటి పక్కనే ఉన్నా, అడవిలో ఉన్నా, అల వైకుంఠపురంలో ఉన్నా .. రవాణా నిమిత్తం నడక అయినా, సైకిల్‌ అయినా .. కారు వాడినా .. అలవెన్సు మారదు. తగ్గదు. 

అలాగే సంబంధిత ఖర్చులు, సమంజసంగా ఉండాలి. సరిగ్గా ఉండాలి. లెక్కలుండాలి. రుజువులు ఉండాలి. లాభం తగ్గించడానికి స్వంత ఖర్చులు / ఇంటి ఖర్చులను వ్యాపార ఖర్చులుగా చూపించకండి. సంబంధిత ఖర్చులనే చూపండి. ఒక్కొక్కపుడు కొన్ని ఖర్చుల ప్రయోజనం వ్యాపారానికెంత.. సొంతానికి ఎంత అని చెప్పలేకపోవచ్చు. కేటాయించలేకపోవచ్చు. అధికారులకు వారి సంతృప్తి మేరకు వివరణ ఇవ్వగలిగితేనే వ్యాపార ఖర్చులుగా చూపించండి. లేదా మొత్తం సొంతంగానే భావించండి. 

చదవండి: ఒకటికి మించి బ్యాంక్‌ అకౌంట్లు ఉన్నాయా? ఇలాగైతే సమస్యలు తప్పవ్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top