బ్లూ ఆరిజిన్​ రెండో టూర్​ సక్సెస్​: అద్భుతమన్న నటుడు.. అంతరిక్షయానంలో అత్యంత వయస్కుడిగా రికార్డు

Blue Origin Mission Star Trek Actor Shatnet Became Oldest Space Traveller - Sakshi

అప్పుడు రీల్​ లైఫ్​లో.. ఇప్పుడు రియల్​ లైఫ్​లో.. సేమ్​ సీన్‌ రిపీట్‌ అయ్యింది!. అందుకే  ఆ పెద్దాయన భావోద్వేగానికి గురయ్యారు. 11 నిమిషాల అంతరిక్షయానాన్ని తన జీవితంలో కలకాలం గుర్తుండిపోయే అనుభవమని వ్యాఖ్యానించారు. కెనడియన్‌ నటుడు విలియమ్‌ షాట్‌నర్‌ సహా నలుగురు బ్లూ ఆరిజిన్​ ద్వారా అంతరిక్షయానం విజయవంతంగా పూర్తి చేసుకుని తిరిగొచ్చారు. తద్వారా తొంభై ఏళ్ల వయసులో అంతరిక్ష యానం చేసిన అత్యంత వయస్కుడిగా కొత్త చరిత్ర సృష్టించాడాయన.

 
జెఫ్​ బెజోస్​కు చెందిన ప్రైవేట్​ స్పేస్​ఏజెన్సీ సంస్థ బ్లూ ఆరిజిన్ చేపట్టిన రెండో మానవసహిత అంతరిక్ష ప్రయాణ ప్రయోగం విజయవంతంగా పూర్తైంది. నటుడు విలియమ్​ షాట్​నర్​తో పాటు బ్లూ ఆరిజిన్​ ఎగ్జిక్యూటివ్​ ఆడ్రే పవర్స్​, ప్లాంట్​ లాబ్స్​ కో ఫౌండర్​ క్రిస్​ బోషుజెన్​, మెడిడేటా సొల్యూషన్​కు చెందిన గ్లోన్​ డె వ్రైస్​ 11 నిమిషాల అంతరిక్ష యానంలో పాల్గొన్నారు. ‘‘ఇదొక అద్భుతమైన అనుభూతి. మాటల్లో వర్ణించలేను. అంతరిక్షం నుంచి చూస్తే మన గ్రహం ఎంతో అందంగా కనిపించింది. అదేటైంలో ప్రమాదంలో ఉన్నట్లు అనిపించింది. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది” ఎమోషనల్ అయ్యారు షాట్​నర్​.


 
పశ్చిమ టెక్సాస్​ నుంచి అమెరికా కాలమానం ప్రకారం.. బుధవారం  ఉదయం 9.49నిమిషాల సమయంలో బ్లూ ఆరిజిన్​ సబ్‌ఆర్బిటల్‌ రాకెట్‌(ఎన్‌ఎస్‌-18) నింగిలోకి ఎగిసింది. దాదాపు 66 మైళ్ల ఎత్తులో అంతరిక్షంలో గడిపాక.. తిరిగి భూమ్మీదకు చేరుకుంది. ఇదిలా ఉంటే క్యాప్సూల్​ దగ్గరికి స్వయంగా వెళ్లి వాళ్లను బయటకు ఆహ్వానించాడు జెఫ్​ బెజోస్​.
 
​అత్యంత వయస్కుడు
60వ దశకలో ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన ‘స్టార్‌ ట్రెక్‌’ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్నాడు  కెనడియన్‌ నటుడు విలియమ్‌ షాట్‌నర్‌.  కెప్టెన్‌ జేమ్స్‌ క్రిక్‌ రోల్‌లో ఆయన నటన అమోఘం.  అయితే ఈయన్ని అంతరిక్ష ప్రయాణం చేయించడం ద్వారా బ్లూ ఆరిజిన్‌ స్పేస్‌ టూరిజం బిజినెస్‌ పెంచాలని భావించారు సదరు ప్రైవేట్‌ స్పేస్‌ ఏజెన్సీ బాస్‌ జెఫ్‌ బెజోస్‌.  గతంలో నాసా అంతరిక్ష వ్యోమగామి జాన్‌ గ్లెన్‌ 77 ఏళ్ల వయసులో డిస్కవరీ షటిల్‌(1998) ద్వారా యానం పూర్తి చేయగా, అమెరికన్‌ ఏవియేటర్‌ వాలీ ఫంక్‌(82) ఈ ఏడాది జులైలో బ్లూ ఆరిజిన్‌ విజయవంతంగా పూర్తి చేసిన అంతరిక్ష యానం ద్వారా ఆ ఫీట్‌ బ్రేక్‌ చేశారు . అయితే వాలీఫంక్‌ వెళ్లొచ్చింది.. ఇప్పుడు 90 ఏళ్ల వయసున్న షాట్‌నర్‌ వెళ్లొచ్చేది కార్మన్‌ లైన్‌ దాకా మాత్రమే. ఇది భూమ్మీద నుంచి 100 కిలోమీటర్ల ఎత్తు మాత్రమే ఉంటుంది.

వీరాభిమాని
స్టార్‌ ట్రెక్‌కు వీరాభిమాని అయిన జెఫ్​ బెజోస్​.. తన తొమ్మిదేళ్ల వయసులో ఈ టీవీ సిరీస్​ మీద గీసిన ఓ బొమ్మను అపురూపంగా దాచుకోవడం విశేషం. అంతేకాదు స్పేస్​ డ్రామాలను ఇష్టపడే బెజోస్​.. 2016 స్టార్​ టెక్​ బియాండ్​లో ఏలియన్​ రోల్​లో తళుక్కున మెరిశాడు కూడా. ప్రస్తుత బ్లూ ఆరిజిన్​ ప్రయోగం ద్వారా ఇప్పటిదాకా 600 మంది అంతరిక్షయానం పూర్తి చేసుకున్నట్లు అయ్యింది. ఈ ప్రయోగం(బ్లూ ఆరిజిన్​ మొదటిది జులైలోనే పూర్తైంది) సక్సెస్​ కావడంతో స్పేస్​టూరిజంలో బలమైన పోటీ ఇవ్వనుందనే సంకేతాలు పంపింది బ్లూ ఆరిజిన్.

చదవండి: దేశీ స్పేస్​ పోటీ.. ఆసక్తికరం

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top