ప్రపంచ మార్కెట్లను వెంటాడిన ఒమిక్రాన్‌!

Black Monday market collapses, Crushing six lakh crores in just a few minutes - Sakshi

ఆగస్టు 23 తర్వాత అతిపెద్ద పతనం

ఇంట్రాడేలో ఎనిమిది నెలల కనిష్టానికి., 

సెన్సెక్స్‌ 1,190 పాయింట్లు క్రాష్‌ 

నిఫ్టీ నష్టం 371 పాయింట్లు

ముంబై: ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయాలు మరోమారు ఈక్విటీ మార్కెట్లను కుదిపేశాయి. ఈ కొత్త రకం కేసుల సంఖ్య అంతకంతా పెరగడానికి తోడు ప్రపంచ మార్కెట్లలో అనూహ్య అమ్మకాలతో భారత మార్కెట్లో మరో ‘‘బ్లాక్‌ మండే’’ నమోదైంది. వైరస్‌ కట్టడికి ఆయా దేశాల లాక్‌డౌన్‌ల విధింపులు ఆర్థిక రికవరీ విఘాతం కలిగించవచ్చనే ఆందోళనల ఇన్వెస్టర్లను కలవరపెట్టాయి.

ద్రవ్యోల్బణ కట్టడికి ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల కఠినతర ద్రవ్య విధాన వైఖరికి మొగ్గు చూపుతుండటం.., విదేశీ ఇన్వెస్టర్ల వరుస విక్రయ ఆందోళనలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీశాయి. అన్ని రంగాల షేర్లలో అమ్మకాల సునామీ వెల్లువెత్తడంతో సెన్సెక్స్‌ 56 వేల స్థాయిని కోల్పోయి 1,189 పాయింట్ల నష్టంతో 55,822 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సూచీ 371 పాయింట్లు క్షీణించి 16,614 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఆగస్టు 23 తర్వాత సూచీలకిదే అతిపెద్ద నష్టాల ముగింపు. శాతం పరంగా చూస్తే.., సెన్సెక్స్‌ మూడుశాతం, నిఫ్టీ రెండు శాతం క్షీణించాయి.

సెన్సెక్స్‌ సూచీలో మొత్తం 30 షేర్లలో 2 షేర్లు.. నిఫ్టీ50 షేర్లలో 4 షేర్లే లాభాలతో గట్టెక్కాయి. విదేశీ ఇన్వెస్టర్లు ఇటీవల పెద్ద మొత్తంలో బ్యాంకింగ్, ఆర్థిక షేర్లను విక్రయిస్తుండటంతో ఈ రంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. డాలర్‌ ఇండెక్స్‌ ఏడాది గరిష్టానికి చేరుకోవడంతో పాటు యూఎస్‌ నాస్‌డాక్‌ ఇండెక్స్‌ పతన ప్రభావంతో దేశీ ఐటీ షేర్లు పతనమయ్యాయి. ఆర్థిక వృద్ధి ఆందోళనలతో మెటల్, మౌలిక రంగ షేర్లు కరిగిపోయాయి. బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌ ఇండెక్స్‌లు మూడున్నర శాతం నష్టాన్ని చవిచూశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.3,565 కోట్ల షేర్లను అమ్మేయగా.., విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,764 కోట్ల షేర్లను కొన్నారు.   

సోమవారం సెషన్‌ సాగింది ఇలా..!  
ప్రపంచ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు అందడంతో స్టాక్‌ మార్కెట్‌ ఉదయం నష్టంతో మొదలైంది. సెన్సెక్స్‌ 495 పాయింట్ల పతనంతో 56,517 వద్ద, నిఫ్టీ 161 పాయింట్లు క్షీణించి 16,824 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. తొలి నుంచి ఇన్వెస్టర్లు అమ్మకాలకే మొగ్గు చూపడంతో ఒక దశలో సెన్సెక్స్‌ 1879 పాయింట్ల పతనమై 55,132 వద్ద, నిఫ్టీ 575 పాయింట్లు నష్టపోయి 16,410 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ఈ స్థాయిలు సూచీలకు ఎనిమిది నెలల కనిష్టస్థాయిలు కావడం గమనార్హం. మిడ్‌ సెషన్‌ తర్వాత ఆయా షేర్లకు కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో రికవరీ బాట పట్టాయి. ఫలితంగా సూచీల నష్టాలు ఎనిమిది నెలల కనిష్టం నుంచి 4 నెలల కనిష్టానికి పరిమితమయ్యాయి.  

► అమెజాన్‌తో కుదిరిన ఒప్పందాన్ని కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా నిలివేయడతో  ఫ్యూచర్‌ లైఫ్‌స్టైల్‌ (20%), ఫ్యూచర్‌ రిటైల్‌ (19.92%), ఫ్యూచర్‌ కన్జ్యూమర్‌ (19.91%) షేర్లు  రాణించి అప్పర్‌ సర్క్యూట్‌ను తాకాయి.  

► ఇటీవల లిస్టయిన నైకా, కార్‌ట్రేడ్, జొమాటో పేటీఎంలు (న్యూ ఏజ్‌ స్టాక్‌లు) ఎనిమిది శాతం క్షీణించాయి.

నష్టాలకు నాలుగు కారణాలు...  
► వణికించిన ఒమిక్రాన్‌ వేరియంట్‌  
ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ వేగంగా వ్యాపిస్తూ ఇన్వెస్టర్లలో భయాలను సృష్టిస్తోంది. యూరప్‌లో కేసులు పెరగడంతో ఆయా దేశాలు లాక్‌డౌన్‌ యోచనలు చేస్తున్నాయి. రెండు కోవిడ్‌ వ్యాక్సిన్లతో పాటు బూస్టర్‌ షాట్లు తప్పనిసరిగా తీసుకోవాలని ఇటీవల అమెరికా ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక దేశవ్యాప్తంగా కూడా ఒమిక్రాన్‌ కేసుల పెరిగింది. వైరస్‌ వ్యాప్తి కట్టడికి అంతర్జాతీయంగా కఠిన ఆంక్షలు అమలు కావచ్చని అంచనాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది.

► వడ్డీ రేట్ల పెంపు భయాలు
ద్రవ్యోల్బణ కట్టడికి ఆయా దేశాలు వడ్డీరేట్ల పెంపునకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ వడ్డీరేట్లను పెంచగా.., వచ్చే ఏడాది ప్రారంభం నుంచి కీలకరేట్ల పెంపును ప్రారంభిస్తామని యూఎస్‌ ఫెడ్‌ ప్రకటించింది. దీంతో ఫలితంగా  ఈ ఏడాదిలో అత్యుత్తమ స్థాయికి డాలర్‌ ఇండెక్స్‌ చేరింది.  అధిక వడ్డీ రేట్ల భయాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో బలహీనతలు నెలకొన్నాయి. ఈ ప్రభావం మన స్టాక్‌ సూచీలపై పడింది.   

► విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు  
దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడంతో సెంటిమెంట్‌ బలహీనపడింది. ఈ డిసెంబర్‌లో ఇప్పటి వరకు రూ.17,696 కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఒమిక్రాన్‌ పరిణామాలు, అధిక వాల్యూయేషన్లు, ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల పెంపు దిశగా యోచనలు చేస్తుండటంతో ఎఫ్‌ఐఐలు భారత్‌ లాంటి వర్థమాన దేశాల్లో పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు.  

► ప్రపంచ మార్కెట్ల పతనం
క్రిస్మస్, నూతన సంవత్సర సీజన్‌కు ముందు ఒమిక్రాన్‌ కేసులు పెరగడంతో ప్రపంచ మార్కెట్లు 2% క్షీణించాయి. కేసుల కట్టడికి ఐరోపా దేశాల్లో మరోమారు లాక్‌డౌన్‌ విధింపు ఉండొచ్చనే వార్తలు వెలువడ్డాయి. ఇప్పటికే నెదర్లాండ్స్‌ లాక్‌డౌన్‌ విధించింది. పండుగ వేళ లాక్‌డౌన్‌లు, ఆంక్షల నిర్ణయాలు వ్యాపారాలు దెబ్బతింటాయన్న భయాలు ఈక్విటీ మార్కెట్ల పతనానికి కార ణమయ్యాయి. ఆసియాలో చైనా, జపాన్‌ దేశాల స్టాక్‌ సూచీలు 2% వరకు క్షీణించాయి. యూరప్‌లో ఇటలీ, ఫ్రాన్, బ్రిటన్‌ మార్కెట్లు 2–1% నష్టపోయాయి. యూఎస్‌ మార్కెట్లు 1.5% నష్టంతో ట్రేడ్‌ అవుతున్నాయి.

డిస్కౌంట్‌లో శ్రీరాం ప్రాపర్టీస్‌ లిస్టింగ్‌
శ్రీరాం ప్రాపర్టీస్‌ షేర్లు లిస్టింగ్‌ రోజు నష్టాలను పంచాయి. ఇష్యూ ధర రూ.118తో పోలిస్తే బీఎస్‌ఈలో 24 శాతం క్షీణించి రూ.94 వద్ద లిస్టయ్యాయి. ఒక దశలో 22 శాతం మేర  పతనమైన రూ.92 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకాయి. చివరికి 16% నష్టంతో రూ.118 వద్ద స్థిరపడింది. మార్కెట్‌ ముగిసే సరికి కంపెనీ విలువ రూ.1,686 కోట్ల వద్ద స్థిరపడింది.

రెండు రోజుల్లో రూ.11.45 లక్షల కోట్ల సంపద ఆవిరి
స్టాక్‌ మార్కెట్లో గడచిన రెండు రోజుల్లో రూ.11.45 లక్షల కోట్ల సంపద హరించుకుపోయింది. సూచీలు సోమవారం నాలుగు నెలల కనిష్టానికి దిగిరావడంతో ఈ ఒక్క రోజే రూ.6.81 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. వెరసి ఇన్వెస్టర్ల సంపదగా బీఎస్‌ఈ కంపెనీల మొత్తం విలువ రూ.252 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఈ రెండు రోజుల్లో సెన్సెక్స్‌ 2078 పాయింట్లు, నిఫ్టీ 634 పాయింట్లు నష్టపోయాయి.

ఇంట్రాడేలో 1879 పాయింట్లు డౌన్‌
55,132కు పతనం ముగింపు
1190 పాయింట్లు డౌన్‌ 55,822 వద్ద క్లోజ్‌

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top