
హైదరాబాద్: కాదేది వ్యాపారానికి అనర్హం అన్న చందంగా మారింది కార్పొరేట్ ఆన్‌లైన్ వ్యాపారస్తుల తీరు. వీరు పండుగల సీజన్లలో ప్రత్యేక ఆఫర్లు ప్రకటించి మరీ భోగి పిడకల దగ్గరి నుంచి మావిడాకులు, పూజా సామాగ్రి, కొబ్బరిచిప్పలు, వేప పుల్లలు వరకూ అన్నింటినీ ఇంటివద్దకే సరఫరా చేస్తున్నారు. తాజాగా అరటి ఆకులు కూడా ఆన్‌లైన్‌లో అమ్మకానికి రెడీ అయ్యాయి.
హిందూ సంప్రదాయంలో అరటి ఆకులకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే గ్రామాల్లో దొరికినంత ఈజీగా పట్టణాల్లో అరటి ఆకులు దొరకవు. నగర వాసులు పండగలు, పబ్బాలు వస్తే వీటి కోసం మార్కెట్ల వద్ద బారులు తీరాల్సి వస్తుంది. దీంతో ఆన్‌లైన్ వ్యాపారులు అరటి ఆకులను ఇంటికే డెలవరీ చేస్తామంటూ ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నారు. పల్లెల్లో అయితే ఫ్రీగా దొరికే వీటి ధర ఆన్‌లైన్‌లో ఎంతో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.
ఐదు అరిటాకులు ధర రూ. 50 లు అంటూ బిగ్ బాస్కెట్ అనే అస్‌లైన్ కార్పొరేట్ వ్యాపార సంస్థ తమ సైట్‌లో ఆఫర్ ప్రకటించింది. ఇక్కడ బిగ్ బాస్కెట్ వాళ్లు కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారండోయ్. ఐదు ఆకుల అసలు ధర రూ. 62.50 అయితే, 20 శాతం డిస్కౌంట్ పోనూ రూ. 50కి ఇస్తున్నామని సదరు సంస్థ ప్రకటించింది. అసలే శ్రావణ మాసం పూజలు, ఫంక్షన్ల కాలం.. దీంతో అరిటాకులకు ఆన్ లైన్ లో మంచి డిమాండ్ ఏర్పడింది.
చదవండి: వర్క్ ఫ్రమ్ హోం: ఇదీ పరిస్థితి!