‘‘వీడు కుక్కను చూసినా వదిలిపెట్టడు అని నాకు అర్థమైంది’ అంటూ రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే శ్రీధర్‌ని ఉద్దేశించి కూటమి నేత ఒకరు చేసిన వ్యాఖ్య నెట్టింట వాయిస్ కాల్ రూపంలో వైరల్ అవుతోంది. ప్రభుత్వ ఉద్యోగిని ఒకరిని శ్రీధర్ లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యవహారంలోనే ఇది చోటు చేసుకోవడం గమనార్హం.
జనసేన నేత తాతంశెట్టి నాగేంద్ర పేరిట వాయిస్ కాల్ ఒకటి గురువారం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. బాధితురాలితో మాట్లాడినట్టు ఉన్న ఆ కాల్‌లో ‘‘మీరేదైనా మాట్లాడాలనుకున్నప్పుడు నాతో చెప్పండి. నేను మాట్లాడుతాను. శ్రీధర్‌కు చపలత్వం ఎక్కువ. రాంగ్‌ట్రాక్‌లో పోతున్నాడు. మనోడు ఇన్‌స్టాలో వచ్చిన మెసేజ్‌లకూ తప్పుగా స్పందించాడు. పిల్ల చేష్టలు. వాళ్ల పెద్దోళ్లకు కూడా నీ గురించి చెప్పా. మీవాడికి చపలత్వం ఎక్కువుంది జాగ్రత్త అని చెప్పా..’’ అంటూ తాతంశెట్టి బాధితురాలికి సర్దిచెప్పారు.
దీనికి బాధితురాలు దీటుగా బదులివ్వడంతో ‘‘వీడు(శ్రీధర్) కుక్కను చూసినా వదిలి పెట్టడు అని నాకు అర్థమైంది’’ అంటూ ఫోన్ పెట్టేశారు. ప్రస్తుతం నెట్టింట ఇందుకు సంబంధించిన క్లిప్ తెగ వైరల్ అవుతోంది.
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలను వివరిస్తూ నారావారిపల్లెలో సీఎం చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితురాలు వాపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. శ్రీధర్ వికృత చేష్టలను తెలియజేసే మరికొన్ని వీడియోలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో ఆయన చేసిన అసభ్యకర మెసేజ్‌లు, ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్, లైంగిక వేధింపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు..
వివిధ విభాగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులను, సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే మహిళలను, స్నేహితులు, బంధువుల భార్యలను కూడా కామంతోనే చూసేవాడని.. వారి శరీరాకృతుల గురించి తన వద్ద అసభ్యంగా మాట్లాడేవాడని బాధితురాలు వివరించారు. వావి వరుసలు కూడా చూసేవాడు కాదని బాధితురాలు చెబుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి.
::: సాక్షి, రైల్వే కోడూరు


