
క్యూ1లో రూ. 5,948 కోట్లు
న్యూఢిల్లీ: మొబైల్ టెలికం రంగ దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 43 శాతం జంప్‌చేసి రూ. 5,948 కోట్లను తాకింది. భారత్‌సహా.. ఆఫ్రికా బిజి నెస్‌లో వృద్ధి ఇందుకు సహకరించింది.
గతేడాది (2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 4,160 కోట్లు ఆర్జించింది. ఆఫ్రికా కార్యకలాపాల నికర లాభం ఐదు రెట్లు ఎగసి 15.6 కోట్ల డాలర్లకు చేరింది. గత క్యూ1లో ఇది 3.1 కోట్ల డాలర్లు మా త్రమే. కాగా.. మొత్తం ఆ దాయం 28 శాతం పైగా పుంజుకుని రూ. 49,463 కోట్లయ్యింది. గత క్యూ1 లో రూ. 38,506 కోట్ల టర్నోవర్ అందుకుంది.
దేశీ విభాగం జోరు
మొత్తం ఆదాయంలో దేశీ బిజినెస్ 29 శాతం జంప్‌చేసి రూ. 37,585 కోట్లకు చేరింది. ఒక్కో వినియోగదారునిపై సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) రూ. 211 నుంచి రూ. 250కు బలపడింది. ఈ కాలంలో 40 లక్షలమంది స్మార్ట్‌ఫోన్ డేటా యూజర్లను జత చేసుకుంది. 2025 జూన్‌కల్లా మొత్తం కస్టమర్ల సంఖ్య 7% వృద్ధితో 60.5 కోట్లను తాకింది. దీనిలో దేశీ వినియోగదారుల వాటా 6.6 శాతం పుంజుకుని 43.6 కోట్లకు చేరింది.
పోస్ట్‌పెయిడ్ విభాగంలో 0.7 మిలియన్ల మంది జత కలవడంతో వీరి సంఖ్య 2.66 కోట్లకు చేరింది. స్మార్ట్‌ఫోన్ డేటా యూజర్ల సంఖ్యలో 8.2 శాతం వార్షిక వృద్ధి నమోదైంది. దీంతో క్యూ1లో 2.13 కోట్లమంది వినియోగదారులు జత కలిశారు. మొబైల్ డేటా వినియోగం సగటున 13 శాతం ఎగసి నెలకు 26.9 జీబీకి చేరింది. ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్‌సహా హోమ్ సర్విసుల విభాగం కస్టమర్ల సంఖ్య 38 శాతం జంప్‌చేసి 1.09 కోట్లను తాకింది.
ఈ కాలంలో పెట్టుబడి వ్యయాలు 14 శాతం తగ్గి రూ. 7,273 కోట్లకు పరిమితమయ్యాయి. కంపెనీ రుణ భారం 2 శాతం పెరిగి రూ. 1.91 లక్షల కోట్లకు చేరింది. భారతీ ఎయిర్‌టెల్‌లో భాగమైన ఎక్స్‌టెలిఫై కొత్తగా ఎయిర్‌టెల్ క్లౌడ్ పేరిట క్లౌడ్ ప్లాట్‌ఫాంను ఆవిష్కరించింది. ఇన్‌ఫ్రా, ప్లాట్‌ఫాం సర్వీసులను (ఐఏఏఎస్, పీఏఏఎస్) ఇది అందిస్తుంది.
ఎయిర్‌టెల్ షేరు 0.8% బలపడి రూ. 1,930 వద్ద క్లోజైంది.