
న్యూఢిల్లీ: అవీవా ఇండియా నూతనంగా అవీవా భారత్ బాల వికాస్ యోజన పేరుతో బీమా ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఇది ఈక్విటీ మార్కెట్‌తో సంబంధం లేని, నాన్ పార్టిసిపేటింగ్ జీవిత బీమా ప్లాన్. తమ పిల్లల భవిష్యత్ భద్రతకు ఇది భరోసానిస్తుందని కంపెనీ తెలిపింది. ప్రీమియం నెలకు రూ.1,000 నుంచి మొదలవుతుంది.
జీవిత బీమా రక్షణకుతోడు హామీతో కూడిన మెచ్యూరిటీ ప్రయోజనం కూడా ఇందులో భాగంగా ఉంటుంది. 3 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు పరిధిలోని వారు.. 12–30 ఏళ్ల కాలానికి తీసుకోవచ్చు. గరిష్ట కాల వ్యవధి పాలసీదారుడికి 80 ఏళ్ల వరకు ఉంటుంది.
నెలవారీ, త్రైమాసికం లేదా అర్ధ సంవత్సరం లేదా ఏడాదికోసారి ప్రీమియం చెల్లింపు ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. గ్యారంటీడ్ సమ్ అష్యూర్డ్ పేరుతో కాల వ్యవధి ముగిసిన తర్వాత చెల్లించే ప్రయోజనం పిల్లల భవిష్యత్ అవసరాలకు ఆర్థిక భరోసానిస్తుందని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వినీత్ కపాహి తెలిపారు.