
హౌసింగ్ బ్రోకరేజీ సంస్థ ‘ప్రాప్‌టైగర్’ను కొనుగోలు చేస్తున్నట్టు ఆరమ్ ప్రాప్‌టెక్ లిమిటెడ్ ప్రకటించింది. రూ.86.45 కోట్ల విలువ మేర షేర్లను జారీ చేయడం ద్వారా ఆస్ట్రేలియాకు చెందిన ఆర్‌ఈఏ గ్రూప్ నుంచి ప్రాప్‌టైగర్‌ను సొంతం చేసుకుంటున్నట్టు తెలిపింది. ఇందులో భాగంగా ఆర్‌ఈఏ ఇండియాకు ప్రిఫరెన్షియల్ షేర్లను జారీ చేయనున్నట్టు స్టాక్ ఎక్స్చేంజ్‌లకు వెల్లడించింది.
ప్రాప్‌టైగర్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ 100 శాతం షేర్లను కొనుగోలు చేసేందుకు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపినట్టు పేర్కొంది. ఒక్కోటీ రూ.5 ముఖ విలువ కలిగిన 42,42,537 షేర్లను ఆర్‌ఈఏ ఇండియాకు జారీ చేయనున్నట్టు వెల్లడించింది. షేర్ల జారీ అనంతరం ఆరమ్ ప్రాప్‌టెక్‌లో ఆర్‌ఈఏ ఇండియాకు 5.54 శాతం వాటా లభించనుంది.
ప్రాప్‌టైగర్ నిర్వహణలో రియల్ ఎస్టేట్ ప్రకటనల పోర్టల్ అయిన హౌసింగ్ డాట్ కామ్ ఉండడం గమనార్హం. 2023–24లో హౌసింగ్ డాట్ కామ్ ఆదాయం రూ.101 కోట్లుగా ఉంది. ఆరమ్ ప్రాప్‌టెక్ రియల్ ఎస్టేట్ రంగానికి సాఫ్ట్‌వేర్, టెక్నాలజీ పరిష్కారాలను అందిస్తుంటుంది.