యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(UAE)లో రియల్ ఎస్టేట్ ఉద్యోగాలకు డిమాండ్ భారీగా పెరిగింది. ప్రముఖ జాబ్ పోర్టల్ 'నౌకరీ గల్ఫ్' 2025 వార్షిక నివేదిక ప్రకారం.. గతేడాది అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పించిన రంగంగా రియల్ ఎస్టేట్ నిలిచింది.
దుబాయ్, అబుదాబి నగరాల్లో ఆస్తుల అమ్మకాలు, కొనుగోళ్లు పెరగడంతో రియల్ ఎస్టేట్ ఉద్యోగాలకు డిమాండ్ ఏర్పడింది. ప్రస్తుతం రియల్ ఎస్టేట్ కంపెనీలు కేవలం సేల్స్ ఏజెంట్లనే కాకుండా ప్రాజెక్ట్ మేనేజర్లు, సివిల్ ఇంజనీర్ల పోస్టులను కూడా భర్తీ చేస్తున్నాయి.
అదేవిధంగా ఈ రంగంలో డిజిటల్ మార్కెటింగ్, ఏఐ నిపుణులకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. కొత్తగా ఉద్యోగంలో చేరిన సేల్స్ ఏజెంట్లు నెలకు 6,000 (సుమారు రూ.1,50,000) - 15,000 (సుమారు రూ.3,75,000) దిర్హామ్‌లు సంపాదిస్తున్నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. రియల్ ఎస్టేట్ తర్వాత ఐటీ, టెలికాం, ఇంటర్నెట్, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.


