మురుగప్ప గ్రూప్ (Murugappa Group) మాజీ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ అరుణాచలం వెల్లయన్ (Arunachalam Vellayan) 72 ఏళ్ల వయసులో సోమవారం తుదిశ్వాస విడిచారు. వందకు పైగా సంవత్సరాల చరిత్ర గల మురుగప్ప గ్రూప్‌ను భారతదేశంలోనే అత్యంత గౌరవనీయమైన, వ్యూహాత్మక వ్యాపార దిగ్గజాల్లో ఒకటిగా తీర్చిదిద్దడంలో ఆయన ఎంతో కృషి చేశారు. ఆయన కొద్ది రోజులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన మృతిపట్ల ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
అరుణాచలం వెల్లయన్ ప్రఖ్యాత మురుగప్ప కుటుంబానికి చెందిన నాలుగో తరం వారసుడు. మురుగప్ప గ్రూప్ వ్యవస్థాపకులు దీవాన్ బహదూర్ మురుగప్ప చెట్టియార్ మునిమనుమడు వెల్లయన్. అరుణాచలం ఉత్తరాఖండ్‌లోని ది డూన్ స్కూల్‌లో ఆయన ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి కామర్స్‌లో డిగ్రీ పొందారు. యూకేలోని ఆస్టన్ యూనివర్సిటీ నుంచి ఇండస్ట్రియల్ అడ్మినిస్ట్రేషన్‌లో డిప్లొమా, అలాగే వార్విక్ బిజినెస్ స్కూల్ నుంచి బిజినెస్ స్టడీస్‌లో మాస్టర్స్ డిగ్రీని అభ్యసించారు.
వ్యాపార ప్రయాణం
వెల్లయన్ దశాబ్దాల పాటు మురుగప్ప గ్రూప్ వృద్ధికి తన వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందించారు. గ్రూప్‌లో వైస్-ఛైర్మన్, డైరెక్టర్‌గా వివిధ కీలక పదవుల్లో ఉంటూ 2009 నవంబర్‌లో ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన 1968లో లండన్‌లో మురుగప్ప గ్రూప్ జాయింట్ వెంచర్ భాగస్వామితో గ్రాడ్యుయేట్ ట్రైనీగా తన కెరియర్ ప్రారంభించారు. ఆ తర్వాత 1972లో చెన్నైకి తిరిగి వచ్చి గ్రూప్‌లోని ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఆఫ్ ఇండియా (TII) యూనిట్‌కు సారథ్యం వహించారు.
రూ.70 వేల కోట్లకు గ్రూప్ విలువ
ఆయన నాయకత్వంలో కంపెనీ వృద్ధి కేవలం అంతర్గత వృద్ధికి మాత్రమే పరిమితం కాలేదు. వ్యూహాత్మకమైన కొనుగోళ్ల ద్వారా గ్రూప్ విస్తరించింది. 1994లో జర్మన్ చైన్స్ ప్లాంట్, 1995లో జపాన్ ట్యూబ్ ప్లాంట్‌లను కొనుగోలు చేయడంలో ఆయన చొరవ తీసుకున్నారు. 2008లో కొరమండల్ ఇంటర్నేషనల్ ఛైర్మన్‌గా ఆయన ‘మై గ్రోమోర్’ పేరుతో రిటైల్‌లోకి అడుగుపెట్టారు. రైతులు, కంపెనీల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని నెలకొల్పారు. రైతుల్లో విశ్వాసం పెంచడానికి, ఉత్పత్తులను మెరుగ్గా రూపొందించడానికి ఇది సహాయపడుతుందని నమ్మారు. ఈ దార్శనిక నిర్ణయం కొరమండల్ విజయానికి తోడ్పడింది. అరుణాచలం వెల్లయన్ నాయకత్వంలో మురుగప్ప గ్రూప్ భారీగా వృద్ధి చెందింది. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆరు రెట్లు అధికమైంది. గ్రూప్ విలువ రూ.11,600 కోట్ల నుంచి రూ.70,000 కోట్లకు పెరిగింది.
అయితే 2015లో ఆర్‌బీఐ నుంచి పేమెంట్స్ బ్యాంక్ ఏర్పాటుకు గ్రూప్‌నకు అనుమతి లభించినప్పటికీ మారుతున్న వ్యాపార పరిస్థితుల కారణంగా ఆ ప్రాజెక్ట్‌ను విరమించుకున్నారు. ఇది గ్రూప్ క్రమశిక్షణతో కూడిన, దీర్ఘకాలిక వ్యూహాత్మక విధానానికి అద్దం పట్టింది.
ఇదీ చదవండి: గిఫ్ట్ సిటీకి ఎందుకంత క్రేజ్..


