గూగుల్ పే గురించి వినుంటారు, ఫోన్‌పే ఉపయోగించుంటారు. యాపిల్ పే గురించి ఎప్పుడైనా విన్నారా?, అయితే ఈ వార్త మీ కోసమే. త్వరలోనే భారత్‌లో యాపిల్ పే సేవలు ప్రారంభం కానున్నాయి.
యాపిల్ ఐఫోన్ యూజర్లకు శుభవార్త. ఎందుకంటే.. భారత్‌లో యాపిల్ పే సేవలు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. యూజర్లు కార్డులను స్వైప్ చేయకుండానే చెల్లింపులు చేసుకునేలా ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. దీనికోసం కంపెనీ ఇప్పటికే మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ సంస్థలతో చర్చలను ప్రారంభించింది.
భారతదేశంలో కూడా.. యాపిల్ సంస్థ అటు ప్రభుత్వంతోనూ, ఇటు ఆర్‌బీఐ తరఫున అనుమతులు పొందేందుకు కసరత్తు చేస్తోంది. ఈ సేవలు తొలుత యూపీఐ లేకుండానే ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. ఎందుకంటే.. యూపీఐ కోసం థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ అవసరం. కాబట్టి తొలుత కార్డు ఆధారంగా కాంటాక్ట్‌లెస్ చెల్లింపులు అందుబాటులోకి వస్తాయి.
యాపిల్ వ్యాలెట్‌లో కార్డుల వివరాలను భద్రపరుచుకుంటే.. అవసరమైనప్పుడు యాపిల్ పే యాప్‌తో చెల్లింపులు జరపవచ్చు. ఈ సేవలు నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ ఆధారంగా ట్యాప్-టు పే టెక్నాలజీతో పనిచేస్తాయి. భద్రత ప్రమాణాల రీత్యా ఫేస్ ఐడీ లేదా టచ్ ఐడీల ధ్రువీకరణలను తప్పనిసరి చేస్తారు. ఏది ఏమైనా.. యాపిల్ గనక రంగంలోకి దిగితే.. ప్రస్తుతం ఈ రంగంలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న గూగుల్ పే, ఫోన్ పేలకు గట్టిపోటీ ఉండే అవకాశాలున్నాయి. ప్రస్తుతం యాపిల్ పే సేవలు 89 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి.


