హైదరాబాద్‌లో నిర్మాణం మధ్యలో ఆగిపోయిన ఇళ్లెన్నో తెలుసా?

Anarock Report On Speedup of House Constructions  - Sakshi

మారిన డెవలపర్ల ధోరణి 

నిర్మాణంలోని ప్రాజెక్ట్‌లను పూర్తి చేయడంపై దృష్టి 

దీంతో నిలిచి ఉన్న గృహాలలో కదలిక 

5 నెలల్లో 36,830 ఇళ్ల నిర్మాణాల పూర్తి   

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం వంటి అనుకోని విపత్తులు స్థిరాస్తి రంగానికి పాఠాలు నేర్పించాయి. గతంలో ఒకరిని మించి మరొకరు పోటీపడి కొత్త ప్రాజెక్ట్‌లను ఆరంభించే నగర డెవలపర్లు... కరోనా తర్వాతి నుంచి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఆడంబరంగా లాంచింగ్స్‌ చేసి విక్రయాల్లేక బొక్కాబోర్లా పడే బదులు.. చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి నష్టాలు రాకుండా బయటపడితే చాలనే అభిప్రాయానికి వచ్చేశారు. దీంతో కరోనా తర్వాతి నుంచి ఇన్నాళ్లు ఆగిపోయిన, ఆలస్యంగా సాగుతున్న గృహ నిర్మాణాలు ఊపందుకున్నాయి. ఫలితంగా గత ఐదు నెలల్లో దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 36,830 గృహనిర్మాణ పనులు పూర్తయ్యాయని అనరాక్‌ నివేదిక వెల్లడించింది. 

5.17 లక్షల యూనిట్లు
గతేడాది డిసెంబర్‌ చివరి నాటికి దేశంలోని   ఏడు ప్రధాన నగరాలలో రూ.4.84 లక్షల కోట్ల విలువ చేసే 5.17 లక్షల యూనిట్లు వివిధ దశలో నిర్మాణ పనులు నిలిచిపోయి ఉండగా.. ఈ ఏడాది మే నెలాఖరు నాటికి 4.79 లక్షలకు క్షీణించాయి. వీటి విలువ రూ.4,48 లక్షల కోట్లు. 
- రెండో స్థానంలో నిలిచిన ముంబైలో గత ఐదు నెలల్లో 5,300 యూనిట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం రూ.1,91807 కోట్ల విలువ చేసే 1,34,170 యూనిట్లు ఆగిపోయి ఉన్నాయి. 
- బెంగళూరులో 3,960 యూనిట్లు పూర్తయ్యాయి. ప్రస్తుతం రూ.28,072 కోట్ల విలువైన 26,030 గృహా నిర్మాణ పనులు నిలిచిపోయి ఉన్నాయి.
- చెన్నైలో 5,190 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా.. ప్రస్తుతం రూ.3,731 కోట్ల విలువైన 8,870 యూనిట్లు ఆగిపోయి ఉన్నాయి. 
- పుణేలో 3,850 నిర్మాణాలు పూర్తి కాగా.. ప్రస్తుతం రూ.27,533 కోట్ల విలువ చేసే 44,250 యూనిట్లు నిలిచి ఉన్నాయి. 
- ఈ ఏడాది జనవరి నుంచి మే నెలాఖరు వరకు హైదరాబాద్‌లో 1,710 గృహ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం నగరంలో 11,400 నిర్మాణాలు వివిధ దశల్లో ఆగిపోయి ఉన్నాయి. వీటి విలువ రూ. 11,310 కోట్లుగా ఉంది. గతేడాది డిసెంబరు చివరినాటికి నగరంలోరూ.12,995 కోట్ల విలువ చేసే 13,160 నిర్మాణాలు ఆగిపోయి ఉన్నాయి.
- ఈ ఏడాది నుంచి జనవరి నుంచి మే వరకు కోల్‌కతాలో 1,580 గృహ నిర్మాణాలు పూర్తి  కాగా.. ప్రస్తుతం రూ.11,847 కోట్ల విలువ చేసే 23,540 గృహాలు ఆగిపోయి ఉన్నాయి. 

వేగం ఎందుకంటే? 
గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల కొనుగోళ్లకే కొనుగోలుదారులు ఆసక్తి చూపించడం కూడా నిర్మాణ పనుల వేగవంతానికి ప్రధాన కారణమని అనరాక్‌ గ్రూప్‌ సీనియర్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ ఠాకూర్‌ తెలిపారు. అలాగే గత కొంత కాలంగా సిమెంట్, స్టీల్‌ వంటి నిర్మాణ సామగ్రి ధరలు పెరగడం కూడా పనులు వేగవంతానికి మరొక కారణమని చెప్పారాయన. దీంతో పాటు ఆగిపోయి ఉన్న గృహ నిర్మాణాలను పూర్తి చేసేందుకు స్పెషల్‌ విండో ఫర్‌ అఫర్డబుల్‌ అండ్‌ మిడ్‌ ఇన్‌కం హౌసింగ్‌ (ఎస్‌డబ్ల్యూఏఎంఐహెచ్‌), నేషనల్‌ బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ కార్పొరేషన్‌ (ఎన్‌బీసీసీ) ప్రత్యేక నిధులను కేటాయించడం కూడా పనులు వేగవంతానికి కారణాలుగా వివరించారు. 

చదవండి: హైదరాబాద్‌లో ఏరియాల వారీగా ప్లాట్ల రేట్లు ఎలా ఉన్నాయంటే?
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top