Amazon Layoffs అమెజాన్‌ కొత్త ఎత్తుగడ, కేంద్రం భారీ షాక్‌!

Amazon urges employees to resign voluntarily Labour Ministry Summons Ecommerce Giant - Sakshi

న్యూఢిల్లీ: టెక్‌, ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌  10వేల ఉద్యోగాల కోత ప్రకటన తరువాత వచ్చే పరిణామాలను ఎదుర్కొ నేందుకు మల్లగుల్లాలు పడుతోంది. ఈ మేరకు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని ఇండియన్‌ టెకీలను వేడు కుంటోంది. అంతేకాదు అలా చేసిన వారికి భారీ ప్రయోజనాలు అందిస్తామని కూడా ప్రకటించింది. దీంతో ఈ అంశం   హాట్‌టాపిక్‌గా నిలిచింది.  (మరో టెక్‌ దిగ్గజం సంచలన నిర్ణయం: ఉద్యోగులకు ఇక గడ్డుకాలమేనా?)

అమెజాన్‌ ఎక్స్‌పీరియన్స్ అండ్ టెక్నాలజీ టీమ్‌లో L1 నుండి L7 బ్యాండ్‌లో పని చేస్తున్న భారతీయ ఉద్యోగులు కంపెనీ వాలంటరీ సెపరేషన్ ప్రోగ్రామ్‌కు అర్హులని పేర్కొంది. ఈ పథకం కింద  ఈ సంవత్సరం నవంబర్ 30 లోపు రాజీనామా చేస్తే వారికి కొన్ని ప్రయోజనాలు కల్పిస్తామని హామీ ఇస్తోంది.  దీంతో పలువరు ఇండియన్‌ ఉద్యోగులు స్వచ్ఛంద రాజీనామాలను ప్రారంభించినట్టు తెలుస్తోంది.  (దోమలను తోలేసినంత తేలిగ్గా ఉద్యోగ కోతలు, ఎన్నాళ్లీ వేట?)

కార్మిక మంత్రిత్వ శాఖ సమన్లు
భారతీయఉద్యోగులను స్వచ్ఛంద పదవీ విమరణకు అమెజాన్‌ ప్రయత్నాలపై భారత ప్రభుత్వం స్పందించింది. ఈ మేరకు అమెజాన్‌కు కార్మిక మంత్రిత్వ శాఖ నోటీసు లిచ్చింది. దీనిపై విచారణకు హాజరు కావాలని మంగళవారం డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఏ అంజనప్ప కంపెనీకి నోటీసులు పంపారు. భారతదేశంలో అమెజాన్ చేసిన తొలగింపులపై ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ఫిర్యాదు మేరకు, బెంగళూరులోని ఈకామర్స్ దిగ్గజం సీనియర్ పబ్లిక్ పాలసీ మేనేజర్ స్మితా శర్మను (బుధవారం నవంబర్ 23న జరిగే) విచారణకు హాజరు కావాలని  ఆదేశించింది. ఐటి/ఐటిఇఎస్ ఉద్యోగుల యూనియన్ గత వారం కేంద్ర కార్మిక మంత్రి భూపేందర్ యాదవ్‌కు రాసిన లేఖలో, దేశంలోని అమెజాన్ ఉద్యోగులను స్వచ్ఛందంగా కంపెనీ నుండి వైదొలగాల్సి వస్తోందన్న ఫిర్యాదులు అందాయని పేర్కొంది. దేశంలోని కార్మిక చట్టాలను అమెజాన్ ఉల్లంఘిస్తోందని ఆరోపించింది.

ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా తొలగించిన ఉద్యోగులకు భారీ పరిహారం అందించాల్సి ఉంటుంది. అందుకే నవంబర్ 30, 2022న భారత ప్రామాణిక కాలమానం ప్రకారం ఉదయం 6:30 గంటలలోపు స్మార్ట్ ఫారమ్‌ల ద్వారా స్వచ్ఛందంగా రాజీనామా చేయాలంటూ ఉద్యోగులకు ఒక నోట్ పంపింది. అయితే ఉద్యోగులు రాజీనామా చేసిన తర్వాత  ఎంత సమయంలోపు ఈ పరిహారం అందిస్తుంది అనేది  అమెజాన్‌ స్పష్టం చేయలేదు. 

 ఈ స్కీం కింద 22 వారాల బేస్ పే; అలాగే ప్రతి ఆరు నెలల సర్వీస్‌కు ఒక వారం మూల వేతనం (సమీప 6 నెలల వరకు ఉంటుంది) గరిష్ట ప్రయోజనం ఇరవై వారాల వరకు  చెల్లింపు, బీమా బెనిఫిట్ పాలసీ ప్రకారం 6 నెలల పాటు మెడికల్ ఇన్సూరెన్స్ కవరేజ్ లేదా దానికి బదులుగా సమానమైన బీమా ప్రీమియం మొత్తం తదితర ప్రయోజనాలను ఆఫర్‌ చేసింది.ఒక ఉద్యోగిని కంపెనీ తొలగించినట్లయితే, తొలగింపును చట్టపరంగా సవాలు చేయవచ్చు. కానీ ఒక ఉద్యోగి స్వచ్ఛందంగా రాజీనామా చేసినప్పుడు, న్యాయస్థానంలో ఉద్యోగం కోల్పోవడంపై సవాలు చేసే హక్కును కోల్పోతారు. ఇదే కంపెనీ ఎత్తుగడ అని లానోజిఎమ్‌బిహెచ్‌ ఎంప్లాయిమెంట్ లా ప్రాక్టీషనర్, జనరల్ కౌన్సెల్ భాగ్యశ్రీ పాంచోలో  వ్యాఖ్యానించారు. 

కాగా  ఆర్థికమందగమనం, ఆదాయాలు క్షీణత నేపథ్యంలో తన గ్లోబల్ వర్క్‌ఫోర్స్‌ను విభాగాల్లో 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు వచ్చే ఏడాది కూడా ఈ తొలగింపుల ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించిన సంగతి తెలిసిందే.  (ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు: అమెజాన్‌ కీలక నిర్ణయం)

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top