బిగ్‌ అలర్ట్: అమలులోకి ఆధార్‌ కొత్త రూల్‌..వారికి మాత్రం మినహాయింపు!

Alert: Uidai Wants Citizens To Update Aadhaar Biometrics Every 10 Years - Sakshi

దేశంలో ఆధార్‌ అనేది సామాన్యుని గుర్తింపుగా ప్రాచుర్యం పొందింది. గత 8 సంవత్సరాలుగా ఆధార్‌ భారతీయులకు గుర్తింపు పరంగా ముఖ్యంగా మారిందనే చెప్పాలి. యూనిక్‌ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) 13 సంవత్సరాల క్రితం దీన్ని ప్రారంభించగా తాజాగా ఈ గుర్తింపు కార్డ్‌ నిబంధనల్లో మార్పులు చేసేందుకు పూనుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ప్రజలు.. ఆధార్‌లో వారి బయోమెట్రిక్ డేటాను స్వచ్ఛందంగా అప్‌డేట్ చేసుకోవాలనే రూల్స్‌ రావొచ్చని నివేదికలు చెప్తున్నాయి.

సమాచారం ప్రకారం.. ఆధార్ కార్డు దారులు వారి ఫేస్, ఫింగర్‌ప్రింట్ బయోమెట్రిక్ డేటాను ప్రతీ 10 ఏళ్లకు అప్‌డేట్ చేసుకునేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించనుందట. అయితే ఇందులో 70 ఏళ్లకు పైన వయసు కలిగిన వారికి దీని నుంచి మినహాయింపు ఉంటుందని సమాచారం. ప్రస్తుతం, ఐదు నుంచి 15 సంవత్సరాల మధ్య ఉంటే.. వాళ్లు ఆధార్ తప్పనిసరి బయోమెట్రిక్‌లను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

ఐదేళ్లకు లోపు ఉ‍న్న పిల్లలకు వారి ఫోటో ఆధారంగా, అలాగే వారి తల్లిదండ్రుల బయోమెట్రిక్స్ ద్వారా ఆధార్ కార్డును జారీ చేస్తున్నారు. ఒకవేళ తల్లిదండ్రులు లేనిపక్షంలో వారి సంరక్షుల బయోమెట్రిక్స్ ద్వారా ఆ పిల్లలకు ఆధార్ జారీ చేస్తున్నారు. UIDAI తాజాగా గ్రూప్-ఆధారిత సంక్షేమ పథకాలను తన ప్లాట్‌ఫారమ్‌పైకి తీసుకురావడానికి రాష్ట్రాలతో చర్చలు జరుపుతోంది. ఎందుకంటే ఇది నకిలీ లబ్ధిదారులను తొలగించడంతో పాటు, నిధుల దుర్వినియోగం కాకుండా చూస్తుంది. దీంతో ప్రజల డబ్బును ఆదా చేయడానికి ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.

చదవండి: మహిళా ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్‌ న్యూస్‌.. ఇకపై రైళ్లలో వారికోసం..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top