ఇక మేడిన్‌ ఇండియా హెలికాప్టర్లు! | Sakshi
Sakshi News home page

ఇక మేడిన్‌ ఇండియా హెలికాప్టర్లు!

Published Sat, Jan 27 2024 5:47 AM

Airbus partners with Tata Group to set up India first helicopter line - Sakshi

ముంబై: దేశీ డైవర్సిఫైడ్‌ దిగ్గజ గ్రూప్‌ టాటాతో ఎయిర్‌బస్‌ హెలికాప్టర్స్‌ చేతులు కలిపింది. ఇరు సంస్థలు దేశీయంగా హెలికాప్టర్స్‌ తయారీకి భాగస్వామ్య కంపెనీ(జేవీ)ని ఏర్పాటు చేయనున్నాయి. టాటా గ్రూప్‌తో జత కట్టడం ద్వారా హెలికాప్టర్స్‌ తయారీలో తుది అసెంబ్లీ లైన్‌ (ఎఫ్‌ఏఎల్‌) యూనిట్‌ను నెలకొల్పనున్నట్లు ఎయిర్‌బస్‌ హెలికాప్టర్‌ ఒక ప్రకటనలో తెలియజేసింది.

ఈ ప్లాంటు ద్వారా పౌర విమాన శ్రేణిలో దేశీయంగా ఎయిర్‌బస్‌ హెచ్‌125 హెలికాప్టర్లను రూపొందించనున్నట్లు పేర్కొంది. వీటిలో కొన్నింటిని పొరుగు దేశాలకు సైతం ఎగుమతి చేయనున్నట్లు తెలియజేసింది. వెరసి దేశీయంగా హెలికాప్టర్‌ తయారీకి ప్రైవేట్‌ రంగంలో తొలి ఎఫ్‌ఏఎల్‌ను నెలకొల్పనున్నట్లు వెల్లడించింది. ఇది భారత ప్రభుత్వం చేపట్టిన ఆత్మనిర్భర్‌ కార్యక్రమానికి భారీస్థాయిలో ప్రోత్సాహాన్నివ్వనున్నట్లు వివరించింది.  

డెలివరీలవరకూ..
భాగస్వామ్యంలో భాగంగా ఎయిర్‌బస్‌ హెలికాప్టర్స్‌తో కలసి టాటా గ్రూప్‌ అనుబంధ సంస్థ టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ (టీఏఎస్‌ఎల్‌) ఎఫ్‌ఏఎల్‌ను ఏర్పాటు చేయనుంది. ఫ్రెంచ్‌ ప్రెసిడెంట్‌ ఇమాన్యుయెల్‌ మేక్రన్‌ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా ఎయిర్‌బస్‌ హెలికాప్టర్‌ తాజా ప్రకటన జారీ చేసింది. గణతంత్ర దినోత్సవాలలో ప్రధాన అతిథిగా పాల్గొనేందుకు మేక్రన్‌ భారత్‌కు విచ్చేసిన సంగతి తెలిసిందే.

కాగా.. ప్రధాన విడిభాగాల అసెంబ్లీలు, ఏవియానిక్స్, మిషన్‌ సిస్టమ్స్, ఎలక్ట్రికల్‌ నియంత్రణల ఇన్‌స్టలేషన్, హైడ్రాలిక్‌ సర్క్యూట్లు, విమాన కంట్రోళ్లు, ఇంధన వ్యవస్థతోపాటు ఇంజిన్‌ కూర్పు తదితరాలను జేవీ నిర్వహించనున్నట్లు ఎయిర్‌బస్‌ హెలికాప్టర్స్‌ వివరించింది. అంతేకాకుండా భారత్‌ తదితర ప్రాంతాలలో హెచ్‌125ల టెస్టింగ్, క్వాలిఫికేషన్‌తో సహా..  డెలివరీలను సైతం చేపట్టనున్నట్లు పేర్కొంది. 24 నెలల్లోగా ఎఫ్‌ఏఎల్‌ ఏర్పాటవుతుందని, 2026లో దేశీయంగా తయారైన తొలి (మేడిన్‌ ఇండియా) హెచ్‌125ల డెలివరీ చేసే వీలున్నట్లు అంచనా వేసింది. తయారీ యూనిట్‌ ఏర్పాటుచేసే ప్రాంతాన్ని సంయుక్తంగా ఎంపిక చేయనున్నట్లు వెల్లడించింది.

కీలక పాత్ర...
జాతి నిర్మాణంలో హెలికాప్టర్లు కీలక పాత్ర పోషిస్తాయని ఎయిర్‌బస్‌ సీఈవో గిలామ్‌ ఫారీ పేర్కొన్నారు. నవ భారత సామర్థ్యాలపై గల నమ్మకానికి మేడిన్‌ ఇండియా పౌర హెలికాప్టర్‌ ప్రతీకగా ఉంటుందని అభివర్ణించారు. తద్వారా దేశీయంగా హెలికాప్టర్‌ మార్కెట్‌కున్న భారీ అవకాశాలకు తెరతీస్తుందని అభిప్రాయపడ్డారు. దేశీయంగా ప్రయివేట్‌ రంగంలో తొలి హెలికాప్టర్‌ అసెంబ్లీ యూనిట్‌ ఏర్పాటుకు సంతోషిస్తున్నట్లు టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. తుది అసెంబ్లీ లైన్‌ ద్వారా ప్రపంచంలోనే ఎయిర్‌ బస్‌కు చెందిన అత్యుత్తమ హెచ్‌125 సింగిల్‌ ఇంజిన్‌ హెలికాప్టర్‌ను భారత్‌తోపాటు, ఇతర మార్కెట్లకు కూడా అందించనున్నట్లు తెలియజేశారు.

Advertisement
 
Advertisement