సాంకేతిక రంగంలో వస్తున్న వేగవంతమైన మార్పులు, ఏఐ విస్తరణ, భారతీయ ఐటీ, సర్వీస్ రంగ ఉద్యోగులపై భారీ ప్రభావమే చూపుతున్నాయి. తాజాగా, అమెరికాకు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ టెక్నాలజీ దిగ్గజం ‘ఓపెన్‌డోర్’ భారతదేశంలో తన వ్యాపార కార్యకలాపాలను పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంతో కంపెనీలో పనిచేస్తున్న దాదాపు 250 మంది భారతీయ ఉద్యోగులు ఒకేసారి రోడ్డున పడినట్లయింది.
కంపెనీ వ్యూహాత్మక మార్పులపై ఓపెన్‌డోర్ సీఈఓ కాజ్ నెజాటియన్ ఉద్యోగులకు పంపిన అంతర్గత నోట్‌లో కొన్ని అంశాలు అధికారికంగా ధ్రువీకరించారు. ఆ నోట్ ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో చర్చనీయాంశమైంది. ‘మా కస్టమర్లు అందరూ అమెరికాలోనే ఉన్నారు. కాబట్టి వారికి సేవలందించే ఆపరేషనల్ విభాగాలు కూడా ఆ కస్టమర్లకు వీలైనంత దగ్గరగా ఉండటమే వ్యాపారపరంగా ఉత్తమం’ అని చెప్పారు. గతంలో వివిధ వ్యవస్థల్లో మ్యాన్యువల్ వర్క్‌ఫ్లోలను నిర్వహించడానికి భారతదేశంలో ఒక పెద్ద బృందాన్ని ఏర్పాటు చేశామని, అయితే ప్రస్తుత సాంకేతిక పురోగతి వల్ల ఆ అవసరం లేకుండా పోయిందని ఆయన స్పష్టం చేశారు.
శ్రామిక శక్తిపై ఏఐ దెబ్బ!
ఈ లేఆఫ్స్‌కు ప్రధాన కారణం కంపెనీ శరవేగంగా అవలంబిస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతగా తెలుస్తోంది. గతంలో భారత్‌లోని సిబ్బంది మ్యాన్యువల్‌గా చేసే పనులను ఇప్పుడు అమెరికాలో ఏఐ ఎనేబుల్డ్ బృందాల సాయంతో మరింత సులభంగా పూర్తి చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. సాంకేతికత పెరగడం వల్ల విదేశాల్లో (భారత్‌లో) ప్రత్యేకంగా ఒక టీమ్‌ను ఉంచాల్సిన అవసరం తగ్గిందని మేనేజ్‌మెంట్ పేర్కొంది.
I shared this note earlier today with the entire team at Opendoor.
Today we began to say goodbye to our colleagues in India as we wind down our India operations.
Our customers are in America, and that's where our operational work belongs. pic.twitter.com/Ak2jLxKiX5— Kaz Nejatian (@nejatian) June 10, 2026
ప్రతిభకు లోటు లేదు.. కానీ తప్పట్లేదు!
ఈ తొలగింపులు భారతీయ బృందం పనితీరు లోపం వల్ల జరిగినవి కావని సీఈఓ నెజాటియన్ నొక్కి చెప్పారు. భారత్‌లోని ఉద్యోగులు ఎంతో ప్రతిభావంతులని, ఇతర సంస్థలకు వారు అద్భుతమైన ఆస్తిగా మారుతారని ప్రశంసించారు. అయితే, వ్యాపార సరళీకరణ, ఏకీకృత ప్లాట్‌ఫారమ్ నిర్మాణం, మ్యాన్యువల్ ప్రక్రియలపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు.
ఇదీ చదవండి: కరుగుతోన్న బంగారు కొండ.. వరుసగా రెండో రోజు!


