
పారిశ్రామికవేత్త అనిల్ అంబానీని చిక్కులు వెంటాడుతున్నాయి. రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఖాతాలను "ఫ్రాడ్"గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రకటించిన కొన్ని రోజులకే తాజాగా బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI) కూడా ప్రమోటర్ అనిల్ అంబానీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్, రిలయన్స్ టెలికాం రుణ ఖాతాలను మోసపూరితమైనవిగా వర్గీకరించింది.
రుణాలను దారి మళ్లించారని, మంజూరు నిబంధనలను ఉల్లంఘించారని, అంబానీతో పాటు కంపెనీలతో సంబంధం ఉన్న పలువురు వ్యక్తుల పేర్లను తన నోటీసులో పేర్కొన్నట్లు రెగ్యులేటరీ ఫైలింగ్‌లో బ్యాంక్ పేర్కొంది. కాగా 2025 ఆగస్టు 22న ప్రభుత్వ రంగ సంస్థ బీఓఐ నుంచి తమకు లేఖ అందిందని ఆర్‌కామ్ అదే రోజున తెలిపింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్, అనిల్ ధీరూభాయ్ అంబానీ, మంజరి ఆషిక్ కక్కర్ ల రుణ ఖాతాలను రూ .724.78 కోట్లకు మోసంగా ట్యాగ్ చేసినట్లు బ్యాంక్ తన నోటీసులో పేర్కొంది.
తమ అనుబంధ సంస్థ రిలయన్స్ టెలికాం లిమిటెడ్ (ఆర్టీఎల్)కు కూడా బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లేఖ వచ్చిందని రిలయన్స్ కమ్యూనికేషన్స్ తన ఫైలింగ్‌లో వెల్లడించింది. దీని ప్రకారం.. ఆర్టీఎల్, గ్రేస్ థామస్ (ఆర్టీఎల్ మాజీ డైరెక్టర్, ప్రస్తుత కంపెనీ డైరెక్టర్), మరికొందరి రుణ ఖాతాలను 'ఫ్రాడ్'గా వర్గీకరించాలని బ్యాంక్ నిర్ణయించింది.
బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం.. ఒక రుణ ఖాతాను మోసపూరితమైనదిగా ప్రకటించిన తర్వాత, క్రిమినల్ చర్యల కోసం దానిని ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలకు పంపాలి. రుణగ్రహీత వచ్చే ఐదేళ్ల వరకు బ్యాంకులు లేదా ఇతర నియంత్రిత సంస్థల నుండి కొత్త రుణాలు తీసుకోకుండా నిషేధం ఉంటుంది.
ఇప్పటికే ఎస్‌బీఐ..
రుణ నిబంధనలను ఉల్లంఘించి ఆర్ కామ్ బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసిందని ఆరోపిస్తూ గత జూన్ లో స్టేట్ ఎస్‌బీఐ కూడా ఇలాంటి చర్య తీసుకుంది. ఎస్‌బీఐ ఫిర్యాదు మేరకు ఆర్‌కామ్‌కు సంబంధించిన కార్యాలయాలతో పాటు అనిల్ అంబానీ నివాసంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్, అనిల్ అంబానీ అక్రమాలకు పాల్పడ్డారని, రూ.2,929.05 కోట్ల నష్టం వాటిల్లిందని ఎస్‌బీఐ పేర్కొనడంతో కేసు నమోదు చేసినట్లు సీబీఐ ధృవీకరించింది. అయితే ఈ ఆరోపణలను అనిల్ అంబానీ తన ప్రతినిధి ద్వారా ఖండించారు.
ఇదీ చదవండి: అంబానీపై అప్పు రూ.3.47 లక్షల కోట్లు!