అప్పుడు జియో నెట్‌వర్క్‌.. ఇప్పుడు పెట్రోలు బంకులు.. రిలయన్స్‌ సంచలన నిర్ణయం

After Jio Network Reliance Entered Into Fuel Station Business - Sakshi

రిలయన్స్‌–బీపీ బ్రాండ్‌ పెట్రోల్‌ బంకులు షురూ

ముంబైలో తొలి మొబిలిటీ స్టేషన్‌ ప్రారంభం 

ఎలక్ట్రిక్‌ వాహనాలకు కూడా చార్జింగ్‌  

న్యూఢిల్లీ: రిలయన్స్‌ సంస్థ రాకతో ఒక్కసారిగా మొబైల్‌ నెట్‌వర్క్‌ రూపు రేఖలే మారిపోయాయి. ముఖ్యంగా ఇంటర్నెట్‌ వినియోగం ఆకాశాన్ని తాకింది. అతి తక్కువ ధరలకే ఇంటర్నెట్‌ అందిస్తూ మార్కెట్‌లో గట్టి పాగా వేసింది రిలయన్స్‌. తాజాగా పెట్రోలు బంకులు వ్యాపారంలోకి వస్తోంది. గతంలో రిలయన్స్‌ ఆధ్వర్యంలో బంకులు ఉన్నా.. ఒక అడుగు ముందుకి రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉండేది. కానీ ఈసారి విదేశీ కంపెనీతో జట్టుకట్టి గోదాలోకి దూకుతోంది రిలయన్స్‌.

పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్, బ్రిటన్‌ సంస్థ బీపీ కలిసి ఏర్పాటు చేసిన జాయింట్‌ వెంచర్‌ సంస్థ రిలయన్స్‌ బీపీ మొబిలిటీ (ఆర్‌బీఎంఎల్‌) తొలి పెట్రోల్‌ బంకును ఆవిష్కరించింది. జియో–బీపీ బ్రాండ్‌ కింద నవీ ముంబైలోని నావ్డేలో దీన్ని ప్రారంభించింది. ‘కస్టమరు అవసరాలకు అనుగుణంగా జియో–బీపీ మొబిలిటీ స్టేషన్‌లను తీర్చిదిద్దాం. ఎలక్ట్రిక్‌ వాహనాల చార్జింగ్, అడిటివైజ్డ్‌ ఇంధనాలు, రిఫ్రెష్‌మెంట్లు, ఆహారం మొదలైన వివిధ సర్వీసులన్నీ వీటిలో అందుబాటులో ఉంటాయి‘ అని ఆర్‌బీఎంఎల్‌ ఒక ప్రకటనలో తెలిపింది. ఇతర సాధారణ ఇంధనాలు కాకుండా మరింత శక్తిమంతమైన ఇంధనాలను, ఎటువంటి అదనపు ధర విధించకుండా, వీటిలో అందిస్తామని పేర్కొంది. అంతర్జాతీయ స్థాయి ’యాక్టివ్‌’ టెక్నాలజీతో రూపొందించిన ఈ ఇంధనం.. కీలకమైన ఇంజిన్‌ భాగాలకు రక్షణ కల్పిస్తుందని, ఇంజిన్లను శుభ్రంగా ఉంచుతుందని ఆర్‌బీఎంఎల్‌ వివరించింది.  


చాయ్‌.. సమోసా.. ఉప్మా.. 
తమ మొబిలిటీ స్టేషన్లలోను, ఇతర ప్రాంతాల్లోనూ ఈవీ చార్జింగ్‌ స్టేషన్లు, బ్యాటరీ మార్పిడి స్టేషన్ల నెట్‌వర్క్‌ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌బీఎంఎల్‌ తెలిపింది. ‘బీపీకి చెందిన వైల్డ్‌ బీన్‌ కెఫే బ్రాండ్‌ కాఫీతో పాటు మసాలా చాయ్, సమోసా, ఉప్మా, పనీర్‌ టిక్కా రోల్‌ వంటి ప్రాంతీయ, స్థానిక ఆహారం కూడా అందిస్తాం. ఇక పేరొందిన అమెరికన్‌ సంస్థ 24 గీ7 షాప్‌ ద్వారా నిత్యావసరాలు, స్నాక్స్, కన్ఫెక్షనరీ ఉత్పత్తులను రిలయన్స్‌ రిటైల్‌ అందుబాటులో ఉంచుతుంది‘ అని వివరించింది. ఇక మొబిలిటీ స్టేషన్లలో క్యాస్ట్రాల్‌ భాగస్వామ్యంతో ఎక్స్‌ప్రెస్‌ ఆయిల్‌ చేంజ్‌ అవుట్‌లెట్స్‌ కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. వీటిలో వాహనాల చెకప్, ఆయిల్‌ చేంజ్‌ సర్వీసు వంటి సర్వీసులు ఉచితంగా అందిస్తామని వివరించింది. తక్ష ణ డిస్కౌంట్‌లు, హ్యాపీ అవర్‌ స్కీములు, సరళతరమైన డిజిటల్‌ చెల్లింపుల విధానాలు మొదలైనవి కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆర్‌బీఎంఎల్‌ తెలిపింది. 
2025 నాటికి 5,500 మొబిలిటీ స్టేషన్లు.. 
2019లో జాయింట్‌ వెంచర్‌గా (జేవీ) ఏర్పాటైన ఆర్‌బీఎంఎల్‌లో బీపీకి 49 శాతం, రిలయన్స్‌కు 51 శాతం వాటాలు ఉన్నాయి. రిలయన్స్‌కి చెందిన 1,400 పైచిలుకు పెట్రోల్‌ బంకులు, 31 విమాన ఇంధన (ఏటీఎఫ్‌) స్టేషన్లను దీనికి బదలాయించారు. ఈ బంకుల సంఖ్యను 2025 నాటికి 5,500కి పెంచుకోవాలని జేవీ నిర్దేశించుకుంది. ప్రస్తుతం దేశీయంగా దాదాపు 78,751 పెట్రోల్‌ బంకులు ఉండగా.. వీటిలో సింహభాగం వాటా ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలదే ఉంది. ఆర్‌బీఎంఎల్‌కు 1,427 అవుట్‌లెట్స్, రష్యన్‌ దిగ్గజం రాస్‌నెఫ్ట్‌కు చెందిన నయారా ఎనర్జీకి 6,250 బంకులు, షెల్‌కు 285 పెట్రోల్‌ బంకులు ఉన్నాయి. ప్రస్తుతమున్న 1,400 రిలయన్స్‌ బంకులను జియో–బీపీ కింద రీబ్రాండింగ్‌ చేయనున్నట్లు ఆర్‌బీఎన్‌ఎల్‌ తెలిపింది.
చదవండి:  శ్రీలంకపై కన్నేసిన అదానీ..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top