
క్యూ1లో రూ. 3,311 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి త్రైమాసికంలో ప్రయివేట్ రంగ దిగ్గజం అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 7 శాతం వృద్ధితో రూ. 3,311 కోట్లకు చేరింది. ఆదాయం పుంజుకోవడం ఇందుకు దోహదపడింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 3,307 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం రూ. 8,054 కోట్ల నుంచి రూ. 9,422 కోట్లకు జంప్ చేసింది.
అయితే మొత్తం వ్యయాలు సైతం రూ. 4,239 కోట్ల నుంచి రూ. 5,732 కోట్లకు పెరిగాయి. ఈ కాలంలో 11 శాతం అధికంగా 121 మిలియన్ మెట్రిక్ టన్నుల(ఎంఎంటీ) కార్గో పరిమాణాన్ని హ్యాండిల్ చేసినట్లు కంపెనీ వెల్లడించింది. దేశీయంగా పోర్టుల ఆదాయం 14% ఎగసి రూ. 6,137 కోట్లను తాకగా. అంతర్జాతీయ పోర్టుల బిజినెస్ 22% వృద్ధితో రూ. 973 కోట్లకు చేరినట్లు తెలియజేసింది.
అదానీ పోర్ట్స్ షేరు 2.4 శాతం క్షీణించి రూ. 1,358 వద్ద ముగిసింది.