7 ఎలక్ట్రిక్  బైక్స్‌ అగ్నికి ఆహుతి, ఓవర్‌ చార్జింగే కారణమా?

7 electric bikes catch fire at showroom in Pune - Sakshi

సాక్షి,ముంబై: మహారాష్ట్ర, పూణెలోని ఓ ఎలక్ట్రిక్ బైక్ షాపులో ఏడు ఎలక్ట్రిక్ బైక్‌లు దగ్ధమైన ఉదంతం కలకలం రేపింది. రాత్రి పూట వాహనాలు చార్జ్‌ అవుతుండగా, షార్ట్ సర్క్యూట్ అయినట్టు తెలుస్తోంది. నాలుగు ఫైరింజన్లతో అగ్నిమాపక దళం మంటలను ఆర్పాల్సి వచ్చింది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణాన్ని తోసిపుచ్చిన ఫైర్‌ అధికారి బ్యాటరీ ఓవర్‌ చార్జ్‌ కావడంతో మంటలంటుకుని ఉండవచ్చన్నారు.

సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటనలో అదృష్టవశాత్తూ ఎవరూ గాయపడ లేదు. షోరూంలో మొత్తం 16 స్కూటర్లు ఉన్నందున ఈ సంఖ్య ఎక్కువగా ఉండవచ్చని అంచనా.  సమగ్ర విచారణ తర్వాతే  కారణాలు  వెలుగులోకి  వచ్చే అవకాశం ఉంది.

షోరూమ్‌లో ఒక బైక్‌లో పొగలు వ్యాపించడంతో మంటలు చెలరేగాయనీ, తరువాత ఆరు స్కూటర్లను చుట్టుముట్టాయని యాజమాన్యం వెల్లడించింది. ఇతర ఆస్తులకు కూడా  నష్టం వాటిల్లిందని యాజమాన్యం పేర్కొంది. మొత్తం స్కూటర్ల అంచనా ఖరీదు దాదాపు రూ.7 లక్షలుగా భావిస్తున్నారు. విచారణ తరువాత వివరాలు అందిస్తామని కొమాకి దేవల్ రైడర్స్ షోరూమ్ యజమాని ధనేష్ ఓస్వాల్ తెలిపారు.

కాగా ఈ వేసవిలో ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన అనేక అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఈ ఏడాది మార్చిలో పూణెలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మంటలు చెలరేగాయి. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తర్వాత తనిఖీ కోసం 1,441 ఎలక్ట్రిక్ స్కూటర్లను రీకాల్ చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీ లోపాలే ఈ ప్రమాదానికి  కారణమన్న  ఆందోళనల కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదిక తరువాత కేంద్రం కొన్ని మార్గదర్శకాలను  జారీ చేసింది.  నాసిరకం బ్యాటరీ ప్యాక్‌లకు సంబంధించి షోకాజ్ నోటీసులు ఆయా  కంపెనీలకు పంపింది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ప్రకారం నిబంధనలను పాటించడంలో విఫలమైతే డిఫాల్టర్ కంపెనీలకు భారీ జరిమానాలు తప్పవని  కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top