దర్జాగా వేర్ల దందా | - | Sakshi
Sakshi News home page

దర్జాగా వేర్ల దందా

Nov 10 2026 12:31 AM | Updated on Nov 10 2026 12:31 AM

● ఐరన్‌ఉడ్‌ టార్గెట్‌గా కొత్త కలప మాఫియా ● అక్టోబర్‌లోనే 12.50 టన్నుల వేర్ల రవాణా ● చోద్యం చూస్తున్న ఫారెస్ట్‌ చెక్‌పోస్ట్‌ సిబ్బంది

● ఐరన్‌ఉడ్‌ టార్గెట్‌గా కొత్త కలప మాఫియా ● అక్టోబర్‌లోనే 12.50 టన్నుల వేర్ల రవాణా ● చోద్యం చూస్తున్న ఫారెస్ట్‌ చెక్‌పోస్ట్‌ సిబ్బంది

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని దుమ్ముగూడెం, చర్ల మండలాలతోపాటు ఛత్తీస్‌గఢ్‌లో విరివిగా అల్లి చెట్టు లేదా ఐరన్‌ ఉడ్‌ (మెమైసెలాన్‌ అమ్‌బెల్లాటం) చెట్లు ఉన్నాయి. వాటి వేర్లు, ఆకులు, బెరడులను షుగర్‌ వ్యాధికి చిట్కా వైద్యంగా ఉపయోగిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఔష ధ లక్షణాలు కలిగిన ఈ చెట్టు నుంచి వంపులు తిరిగే గుణం కలిగిన దృఢమైన కలప వస్తుంది. దీంతో ఈ కలపపై కన్నేసిన స్మగ్లింగ్‌ మాఫియా ఆరంభంలో చిట్కా వైద్యం పేరుతో ఇక్కడ పాతుకుపోయింది. ముందుగా ఆకులు, బెరడు, వేర్ల అక్రమ రవాణాతో మొదలు పెట్టి క్రమంగా కలప స్మగ్లింగ్‌కు అవసరమైన ‘సర్దుబాట్లు’ చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో చేస్తోంది.

పావులుగా స్థానికులు

దట్టమైన అడవుల్లో గుబురుగా పెరిగే అల్లి చెట్లను గుర్తించడం, వాటి నుంచి వేర్లు, బెరడు, కొన్ని సందర్భాల్లో ఆకులను సేకరించే పనిని స్థానికంగా ఉన్న గిరిజనులు లేదా వలస ఆదివాసీలకు సిండికేట్‌ అప్పగిస్తోంది. అడవుల్లో తిరుగుతూ కష్టపడి సేకరించిన ఆకులు, బెరడు, వేర్లకు కేజీకి రూ.50 వంతున చెల్లిస్తోంది. ఇలా సేకరించిన వేర్లను ఏపీలోని తిరువూరు, విజయవాడలలోని బయ్యర్లకు రూ.250 వంతున అమ్ముతోంది. అక్కడి నుంచి కేజీ రూ.2,500 లెక్కన తమిళనాడు వరకు సరఫరా చేస్తున్నారు.

గోదావరి తీరం వెంబడి నిల్వలు

పేరుకు చిట్కా వైద్యానికి ఔషధ మొక్కల సరఫరా అయినప్పటికీ అల్లి చెట్లను పూర్తిగా నరికివేసి, ఆ చెట్ల నుంచి కలపను తమిళనాడు, ఏపీలోని పడవలు తయారు చేసే సంస్థలకు విక్రయిస్తున్నారు. దీంతో బెరడు, ఆకుల కంటే వేర్ల సేకరణకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. అక్టోబర్‌లోనే కేవలం దుమ్ముగూడెం మండలం పరిధిలో లక్షా ఇరవై ఐదు వేల కేజీల వేర్లను సేకరించారు. ఇలా సేకరించిన వేర్లను 25కేజీల బస్తాల్లో కూర్చి, దుమ్మగూడెం మండలంలోని బట్టిగూడెం, కోడివారిగుంపు, నల్ల బెల్లి గ్రామాల్లో గోదావరి తీరం వెంబడి వెలిసిన గోదాము(గుడిసెలు)ల్లో నిల్వ చేశారు. మరికొంత చర్లలో నిల్వ చేశారు.

ఆగమేఘాల మీద తరలింపు

చెట్టు వేర్ల సేకరణ, నిల్వ ఉంచడం వంటి రిస్క్‌తో కూడిన అన్ని పనులు తమతో చేయిస్తూ వచ్చిన లాభాలన్నీ అల్లిచెట్ల సిండికేట్‌ జేబుల్లోకి వేసుకోవడంపై స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చింది. మెల్లగా విషయం బయటకు పొక్కడం మొదలైంది. దీంతో మూడు వేర్వేరు రహస్య స్థావరాల్లో దాచిన 12.50 మెట్రిక్‌ టన్నుల వేర్లను ఇటీవల ఏపీ మీదుగా తమిళనాడుకు తరలించినట్టు సమాచారం. దీపావళి పండగ హడావుడిని ఆసరాగా చేసుకుని శుక్ర, శనివారాల్లో (నవంబరు 6, 7) రెండే వేర్వురు మినీ ట్రక్‌లలో వేర్లను తరలించినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో దందాలో కీలకంగా వ్యవహరిస్తున్న వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. దీంతో దుమ్ముగూడెం మండలంలోనే రహస్య స్థావరంలో ఉండిపోయిన చివరి లోడ్‌ను ఎలా తరలించా లనే అంశంపై సిండికేట్‌ సభ్యులు మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది.

తనిఖీలు ఏవీ?

రాష్ట్రంలోనే భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో అత్యధికంగా అడవులు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌, ఏపీలతో జిల్లాకు సరిహద్దులు ఉన్నాయి. ఒడిశా సమీపంలోనే ఉంది. భౌగోళికంగా ఉన్న ప్రాముఖ్యత వల్ల జిల్లాలో అటవీశాఖ ఆధ్వర్యంలో అనేక చెక్‌పోస్టులు ఏర్పా టు చేశారు. ఇక్కడ నిత్యం తనిఖీలు జరుగుతుంటాయి. అయినా అటవీశాఖ అధికారులు, సిబ్బంది కన్నుగప్పి టన్నుల కొద్దీ అల్లి చెట్టు వేర్లు జిల్లా, రాష్ట్ర సరిహద్దులు దాటుతున్నాయి. దీంతో ఫారెస్ట్‌ చెక్‌పోస్టుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి.

అల్లిచెట్ల వేర్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement