కొనసాగిన ఆదివాసీల ఆందోళన | - | Sakshi
Sakshi News home page

కొనసాగిన ఆదివాసీల ఆందోళన

Nov 10 2026 12:31 AM | Updated on Nov 10 2026 12:31 AM

చండ్రుగొండ : అసైన్‌మెంటు పట్టాలకు సంబంధించి భూముల హద్దులు చూపాలని ఆదివాసీలు తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట చేపట్టిన ఆందోళన సోమవారం కూడా కొనసాగింది. 40 మంది కుటుంబాలు ఆందోళనలో పాల్గొన్నాయి. సోమవారం ప్రజావాణిలో ఎంపీడీఓ బయ్యారపు అశోక్‌, డిప్యూటీ తహసీల్దార్‌ హైందవిలకు వినతిపత్రం అందించారు. లోకాయుక్త తీర్పును అమలు చేస్తామని చెప్పిన తహసీల్దార్‌ తప్పించుకు తిరుగుతున్నారని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. సీతాయిగూడెం, అయన్నపాలెం గ్రామాలకు చెందిన 40 మంది ఆదివాసీలకు మండలంలోని దామరచర్ల గ్రామ శివారులోని 136 ఎకరాల భూములను కేటాయిస్తూ సుమారు మూడు దశాబ్దాల క్రితం ప్రభుత్వం అసైన్‌మెంటు పట్టాలు ఇచ్చింది. అయితే క్షేత్రస్థాయిలో భూములు చూపలేదు. దశాబ్దకాలం నుంచి ఆదివాసీలు ఆందోళన చేస్తున్నా సమస్య పరిష్కారం కావడంలేదు. సీలింగ్‌గా చూపిన భూములను ఓ భూస్వామి కొందరు చిన్నకారు రైతులకు విక్రయించాడు. గిరిజనేతర రైతులు సైతం పేదలే కావడంతో రాజకీయ నాయకులు వారికి అండగా నిలుస్తున్నారు. దీంతో సమస్య జఠిలంగా మారింది.

లోకాయుక్త ఉత్తర్వులు ఇలా ..

నవంబర్‌ 11వ తేదీ లోపు ఆదివాసీలకు భూములు కేటాయించాలని లోకాయుక్త (హైదరాబాద్‌) ఈ ఏడాది మే 2న ఉత్తర్వులు జారీ చేసింది. లేని పక్షంలో ఆదివాసీలు 11న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో ఆదివాసీలు తాత్కాలికంగా ఆందోళన విరమించి సోమవారం సాయంత్రం హైదరాబాద్‌కు బయల్దేరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement