భద్రాద్రిలో ప్రత్యేక పూజలు
నేటి నుంచి కార్తీకమాస పూజలు
శివకేశవులకు ప్రీతిపాత్రమైన మాసం
ఆలయాల్లో ప్రత్యేక పూజలు, వ్రతాలు
శివారాధనకు విశిష్టత
తెలుగు మాసాల్లో అత్యంత పవిత్రమైనదిగా, శివకేశవులకు ప్రీతికరమైనదిగా భావించే కార్తీక మాసం వచ్చేసింది. మంగళవారం నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు కార్తీక మాసోత్సవాలు కొనసాగనున్నాయి. ఈమేరకు ఉమ్మడి జిల్లాల్లోని శివాలయాల్లో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు చేశారు.
–పాల్వంచ రూరల్ / భద్రాచలం టౌన్/
ఖమ్మం గాంధీచౌక్ / సత్తుపల్లి టౌన్
ముస్తాబైన శివాలయాలు
కార్తీక మాసోత్సవాలకు శివాలయాలు ముస్తాబయ్యాయి. ఆలయాలను విద్యుత్ దీపాలతో అలంకరించడమే కాక ప్రత్యేక పూజలకు పెద్దసంఖ్యలో వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసంలో శివాలయాల గోపురంపై దీపాన్ని వెలిగించి నెల పాటు అఖండంగా వెలుగుతూ ఉంచుతారు. ఈ ఆకాశ దీపాన్ని దర్శించుకుంటే సకల దోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. కాగా, ఈ నెల పాటు శివాలయాల్లో ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు, లక్షబిల్వార్చన, లక్ష దీపారాధనలు జరగనున్నాయి. ఖమ్మంలోని శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి దేవస్థానం, సుగ్గల వారి తోటలోని శ్రీ అన్నపూర్ణ సహిత కాశీ విశ్వేశ్వర ఆలయంతో పాటు జిల్లాలోని వివిధ శివాలయాల్లో ప్రత్యేక పూజలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
భక్తి.. ఆరోగ్య రక్షణ
కార్తీక మాసం కేవలం ఆధ్యాత్మికతకే కాదు ఆరోగ్యానికీ మేలు చేస్తుందని పెద్దలు చెబుతారు. ఈ మాసంలో చలి ప్రభావం రోజురోజుకు ఎక్కువవుతుంది. ఉపవాసం, తెల్లవారుజామునే నదీ స్నానం, నువ్వుల నూనె, ఆవు నెయ్యితో దీపారాధన, ఉసిరి, తులసి పూజలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీపాల నుంచి వచ్చే ధూపం వాతావరణాన్ని శుద్ధి చేస్తుందని, ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేయడం వల్ల ఆరోగ్యం చేకూరుతుందని విశ్వాసం. నెల పాటు సాత్విక ఆహారం తీసుకోవడం, మాంసాహారం, మద్యం మానేయడం వల్ల శరీరం, మనసు శుద్ధి అవుతాయి. అలాగే, కార్తీక మాసంలో చేసే దానధర్మాలు, దీపదానం, అన్నదానం పుణ్యాన్ని ఇస్తాయని పండితులు చెబుతున్నారు. ఇక కార్తీక సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి రోజులు మరింత విశిష్టమైనవి భావిస్తారు. ఈమేరకు ఇళ్లలో భక్తులు తులసి కోట వద్ద దీపం వెలిగించి పూజ చేయడంతో పాటు ప్రతీ సోమవారాల్లో ఉపవాసం ఉంటూ శివుడిని ఆరాధిస్తారు. నోములు, వ్రతాలు చేసే భక్తుల రద్దీ, అభిషేకాలు, దీపారాధన, ప్రత్యేక అలంకరణలతో ఆలయాలు కళకళలాడనున్నాయి.
నదీస్నానానికి ప్రాధాన్యత
కార్తీకమాసంలో తెల్లవారుజామున నదీస్నానం ఆచరిస్తే పుణ్యప్రదమని పెద్దలు చెబుతారు. నదీతీరాల్లో సూర్యోదయానికి ముందే స్నానాలు చేసి దీపారాధన, ఇష్టదైవాల పూజలు నిర్వహిస్తారు. ఈక్రమాన భద్రాచలంలోని గోదావరి తీరం వద్ద ఈ నెల పాటు రద్దీ నెలకొననుంది.
కార్తీక మాసం మంగళవారం మొదలుకానుంది. నెల పాటు శివుడికి ప్రతిప్రాతమైన మాసం కాగా, ప్రతీ సోమవారం తులసి, ఉసిరి చెట్టు వద్ద దీపారాధన చేయడం వలన శుభ ఫలితాలు లభిస్తాయి. సూర్యోదయానికి ముందు దీపారాధాన చేయడం ద్వారా విశిష్ట ఫలితాలు ఉంటాయి. ప్రతీ సోమవారం ఉపవాసం ఉంటూ దీపారాధన, దానధర్మాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
– పద్మనాభశర్మ,
వేదపండితుడు, పెద్దమ్మతల్లి ఆలయం, పాల్వంచ
భద్రాచలంటౌన్: భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యాన కార్తీకమాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శివాలయంలో ప్రతీ సోమవారం ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు జరుగుతాయని ఈఓ కె.దామోదర్‌రావు తెలిపారు. అలాగే, ఈనెల 16న భస్మాభిషేకం, 23న చందనాభిషేకం, 24న జ్వాలాతోరణం, 29న స్వామివారి కల్యాణం, 30న శర్కరాభిషేకం, డిసెంబర్ 7న లక్షబిల్వార్చన నిర్వహిస్తామని వెల్లడించారు. అంతేకాక ప్రతీ సోమవారం గోదావరి తీరంలో నదీహారతి, మిథిలా స్టేడియంలోని నిత్యకల్యాణ మండపంలో ప్రతిరోజూ ఉదయం 6నుంచి 8 గంటల వరకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఉంటాయని తెలిపారు. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యాన శివాలయానికి వెళ్లేందుకు రంగనాయకుల గుట్ట పైనుంచి మార్గం ఏర్పాటు చేసినట్లు ఈఓ వెల్లడించారు.
ప్రత్యేకం.. మల్లికార్జునస్వామి ఆలయం
అన్నపురెడ్డిపల్లి: అన్నపురెడ్డిపల్లిలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం కార్తీక మాసోత్సవాలకు ముస్తాబైంది. జిల్లాలో మరెక్కడా లేని విధంగా 108 శివలింగాలతో లింగాకారంలో నిర్మితమైన ఈ ఆలయం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఆలయ ప్రాంగణంలో దక్షిణామూర్తి, భక్త కన్నప్ప, మార్కండేయ, శివ పార్వతులు, వాయు లింగం, నంది విగ్రహాఅలు ఉండగా, ఏటా కార్తీక మాసంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భక్తులు తరలిస్తారు. ఈమేరకు ఆలయ ప్రాంగణంలోని కోనేరులో పుణ్యస్నానాలు, ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలకు ఏర్పాట్లు చేశారు. కాగా, కార్తీక మాసంలో భాగంగా 20వ తేదీన అన్నాభిషేకం, 24వ తేదీన జ్వాలాతోరణం, వచ్చేనెల 7వ తేదీన శివ పార్వతుల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. కాగా, పూజలకు హాజరయ్యే భక్తులు ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ మేనేజర్ పాకాల రమణ తెలిపారు.
ప్రాచీన కాలం నుంచి వస్తున్న సంప్రదాయాల ప్రకారం ఆలయంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తాం. దీపారాధనలు, ఉపవాస దీక్షలతో శివనామ స్మరణ చేస్తే భక్తులతో ఈ నెల పాటు ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది. ఈ మాసంలో స్వామిని దర్శించుకోవడం ఎంతో పుణ్యప్రదం. – సత్యనారాయణ శర్మ,
ఆలయ ప్రధాన అర్చకుడు


